manhunt
-
రెండు రాత్రులు.. మూడు పగళ్లు నరక యాతన
► వేటకోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ► అంతర్వేది బీచ్ లో ఒడ్డుకు చేరుకున్న బాధితులు ► గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు అంతర్వేది (సఖినేటిపల్లి)/ రేపల్లె : రోను తుపాను ప్రభావంతో గతి తప్పిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ బోటు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద బోల్తా పడింది. దానిలో ఉన్న ఒక వ్యక్తి గల్లంతవగా, మరో ఆరుగురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా నిజాంపట్నం కేంద్రంగా బాలవర్థన్ అనే వ్యక్తికి చెందిన బోటులో ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 17న సముద్రంపై వేటకు వెళ్లారు. ఆ బోటులో కొత్తపాలేనికి చెందిన మత్స్యకారులు పుల్లంగుంట నాగమల్లేశ్వరరావు, కొప్పాడి రవి, పీతా వెంకటేశ్వరరావు, నీలం బాబూరావు, సున్నంపూడి మగదారయ్య, చెన్ను రవి, మన్నం ఏసోబు (65) ఉన్నారు. వీరంతా 18వ తేదీ రాత్రి రోను తుపానులో చిక్కుకున్నారు. లైటు వెలుతురు చూసి అప్రమత్తం.. ఇంజన్లో ఆయిల్ అడుగంటడంతో బోటు ఎటు వెళ్తోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వారంతా రెండు రాత్రులు, మూడు పగళ్లు సముద్రంపై నర కయాతన అనుభవించారు. ఆదివారం తెల్లవారుజామున ఎక్కడో దూరంగా మిణుకు మిణుకుమంటున్న లైటును గుర్తించి, ఆ దిశగా నెమ్మదిగా తెడ్లతో బోటును నెట్టుకుంటూ కొంత దూరం వచ్చారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో అంతర్వేది తీరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో సముద్రంలోనే ఉండిపోయారు. తమ దుస్థితిపై పడవలోని ఓ వ్యక్తి నిజాంపట్నం పోర్టుకు సమాచారం అందించారు. అక్కడి అధికారులు సఖినేటిపల్లి ఎస్సై కృష్ణభగవాన్ బీచ్ వద్దకు చేరుకున్నారు. సముద్రంపై బోటు ఎక్కడ ఉన్నదీ గుర్తించడానికి పోలీసులకు కొంత సమయం పట్టింది. చివరికి ఒడ్డుకు.. నిజాంపట్నం పోర్టు అధికారులు సాంకేతిక సహాయంతో మత్స్యకారుల బోటును అంతర్వేది తీరం వైపు మళ్లించేలా చేశారు. దీంతో బోటును పోలీసులు గుర్తించారు. బోటులో ఉన్నవారి సెల్ నంబర్‌తో ఎస్సై సంప్రదింపులు జరుపుతూ, వారిని ఒడ్డుకు చేర్చేందుకు యత్నించారు. ఈ దశలో ఒడ్డుకు సమీపంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల మధ్య లంగ రు వేయడంతో అకస్మాత్తుగా బోటు తిరగబడిందని సున్నంపూడి మగదారియా చెప్పారు. దీంతో సముద్రంలోకి వెళ్లిన పోలీసులు వారిని ఒడ్డుకు చేర్చారు. మన్నం ఏసోబు సముద్రంలో గల్లంతయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సర్పంచ్‌లు భాస్కర్ల గణపతి, చొప్పల చిట్టిబాబు, మాజీ సర్పంచ్‌లు వనమాలి మూలాస్వామి, నల్లి సుభాష్‌లు వారిని పరామర్శించారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇచ్చిన సమాచారంతో రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఘటన స్థలానికి చేరుకుని వారిని పరామర్శించారు. -
పటాన్ కోట్ లో కారు అపహరణ కలకలం
పటాన్ కోట్: పంజాబ్ లోని పటాన్ కోట్ లో మల్లీ అలజడి మొదలైంది. కొందరు వ్యక్తులు ఆయుధాలతో వచ్చి ఓ కారును అపహరించుకుపోవడం కలకలం రేపింది. జిల్లాలోని సుజన్ పూర్ పట్టణంలో ఓ వ్యక్తి నుండి తుపాకి గురిపెట్టి కారును త ఎత్తుకుపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు, ఇతర భద్రతా అధికారుల్లో కలవరం మొదలైంది. మంగళవారం రాత్రి చోటు చేసుకుందని, పోలీసులు బుధవారం చెప్పారు. దీంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. పంజాబ్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు విచారణ చేపట్టారు. ఫోర్డ్ ఫిగో కారులో వెళుతున్న వ్యక్తిని అడ్డుకున్న ముగ్గురు వ్యక్తులు ఆయను బలవంతంగా లాగి పడేశారు. అనంతరం తుపాకి చూపించి బెదిరించి కారును ఎత్తుకెళ్లారు. దీనిపై భద్రతా అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు. విస్త్రృత తనిఖీలు చేపట్టారు. ఆయుధాలతో వచ్చిన వ్యక్తుల ఆచూకీకోసం గాలింపు చర్యలు చేపట్టారు. పంజాబ్ లోని గురుదాస్ దూర్ ఉగ్రదాడి, పటాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈసంఘటనను సీరియస్ గా స్పందించిన భద్రతబలగాలు నిఘా విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఈ సంఘటనలో ఉగ్రనేపథ్యంలేనప్పటికీ, హై ఎలర్ట్ ప్రకటించినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నామన్నారు. -
మహిళలపై దుండగుడి దాడి
కర్రతో కొట్టడంతో ఇద్దరికి గాయాలు కేకలు వేయడంతో పలాయనం పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగింత మతిస్థిమితం లేదని సమాచారం గతంలో జరిగిన బైక్ దొంగతనాలతో సంబంధాలున్నట్లు అనుమానం ముదినేపల్లి రూరల్ : ఉభయ గోదావరి జిల్లాల్లో సూది సైకోగాళ్లు సంచలనం సృష్టిస్తుండగా తాజాగా ముదినేపల్లి మండలంలో ఆదివారంఒక వ్యక్తి ఇద్దరు మహిళలపై దాడిచేయడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదగొన్నూరు శివారు ఉప్పరగూడెంకు చెందిన మహిళలు స్థానిక పెదలంక డ్రెయిన్‌లో బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన రెడ్డి దుర్గ, కలిదిండి ధనలక్ష్మి పెదలంక డ్రెయిన్‌పై ఉన్న వంతెన సమీపంలో ఆదివారం బట్టలు ఉతుకుతున్నారు. అదే సమయంలో ఒక అపరిచిత వ్యక్తి కర్ర, కత్తి, తాడుతో హఠాత్తుగా దాడి చేశాడు. కర్రతో తలలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. మహిళలు గట్టిగా కేకలు వేయడంతో స్థానిక యువకులు పరుగున వచ్చారు. వారిని గమనించిన సదరు వ్యక్తి సమీప పొలాల్లోకి పారిపోయాడు. యువకులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. చినవాడవల్లి సమీపంలోని వరి పొలాల్లో దాక్కుని ఉన్న దుండగుడిని ఎట్టకేలకు పట్టుకుని గ్రామానికి తీసుకువచ్చి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో ముదినేపల్లి పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత మహిళలను స్థానికులు 108 అంబులెన్సులో గుడివాడలో ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మతి స్థిమితం లేకే... దుండగుడిని గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన ఈడే ఏడుకొండలుగా గుర్తించినట్లు తెలిసింది. పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెం అత్తవారిల్లు కాగా కొంతకాలంగా మతి స్థిమితం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఏడుకొండలు గురించి స్థానిక పోలీసు లు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని మోటార్ బైక్ దొంగతనం కేసుల్లో ఏడు కొండలు పాత్ర ఉన్నట్లు అనుమానించి విచారిస్తున్నట్లు సమాచారం. -
ఆ జర్నలిస్టు కోసం వేట
ముంబై: ఐఎస్ఐఎస్లో చేరాలనుకుంటున్నట్లు వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు జుబర్ అహ్మద్ ఖాన్ కోసం ముంబై పోలీసులు వేట మొదలు పెట్టారు. దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా, రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన అతడిని ఎలాగైనా పట్టుకుని తీరాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జుబర్ అహ్మద్ ఖాన్ కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ముంబై పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్ ఉరికి సానుభూతిని వ్యక్తం చేస్తూ జుబర్ అహ్మద్ ఖాన్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేశాడు. అంతేకాకుండా తాను ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ప్రతినిధిగా వ్యవహరించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. యాకూబ్ మెమన్ మృత వీరుడుగా అభివర్ణించాడు. దీనిపై ఓ వ్యక్తి పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దేశంలో ఉగ్రవాదుల దాడులు, పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాటు వార్తల నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా ఆ జర్నలిస్టు నవీ ముంబైలో నివసిస్తున్నట్టుగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా తృటిలో తప్పించుకున్నట్టు సమాచారం.