రెండు రాత్రులు.. మూడు పగళ్లు నరక యాతన
► వేటకోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు
► అంతర్వేది బీచ్ లో ఒడ్డుకు చేరుకున్న బాధితులు
► గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు
అంతర్వేది (సఖినేటిపల్లి)/ రేపల్లె : రోను తుపాను ప్రభావంతో గతి తప్పిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ బోటు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద బోల్తా పడింది. దానిలో ఉన్న ఒక వ్యక్తి గల్లంతవగా, మరో ఆరుగురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా నిజాంపట్నం కేంద్రంగా బాలవర్థన్ అనే వ్యక్తికి చెందిన బోటులో ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 17న సముద్రంపై వేటకు వెళ్లారు. ఆ బోటులో కొత్తపాలేనికి చెందిన మత్స్యకారులు పుల్లంగుంట నాగమల్లేశ్వరరావు, కొప్పాడి రవి, పీతా వెంకటేశ్వరరావు, నీలం బాబూరావు, సున్నంపూడి మగదారయ్య, చెన్ను రవి, మన్నం ఏసోబు (65) ఉన్నారు. వీరంతా 18వ తేదీ రాత్రి రోను తుపానులో చిక్కుకున్నారు.
లైటు వెలుతురు చూసి అప్రమత్తం..
ఇంజన్‌లో ఆయిల్ అడుగంటడంతో బోటు ఎటు వెళ్తోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వారంతా రెండు రాత్రులు, మూడు పగళ్లు సముద్రంపై నర కయాతన అనుభవించారు. ఆదివారం తెల్లవారుజామున ఎక్కడో దూరంగా మిణుకు మిణుకుమంటున్న లైటును గుర్తించి, ఆ దిశగా నెమ్మదిగా తెడ్లతో బోటును నెట్టుకుంటూ కొంత దూరం వచ్చారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో అంతర్వేది తీరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో సముద్రంలోనే ఉండిపోయారు. తమ దుస్థితిపై పడవలోని ఓ వ్యక్తి నిజాంపట్నం పోర్టుకు సమాచారం అందించారు. అక్కడి అధికారులు సఖినేటిపల్లి ఎస్సై కృష్ణభగవాన్ బీచ్ వద్దకు చేరుకున్నారు. సముద్రంపై బోటు ఎక్కడ ఉన్నదీ గుర్తించడానికి పోలీసులకు కొంత సమయం పట్టింది.
చివరికి ఒడ్డుకు..
నిజాంపట్నం పోర్టు అధికారులు సాంకేతిక సహాయంతో మత్స్యకారుల బోటును అంతర్వేది తీరం వైపు మళ్లించేలా చేశారు. దీంతో బోటును పోలీసులు గుర్తించారు. బోటులో ఉన్నవారి సెల్ నంబర్‌తో ఎస్సై సంప్రదింపులు జరుపుతూ, వారిని ఒడ్డుకు చేర్చేందుకు యత్నించారు. ఈ దశలో ఒడ్డుకు సమీపంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల మధ్య లంగ రు వేయడంతో అకస్మాత్తుగా బోటు తిరగబడిందని సున్నంపూడి మగదారియా చెప్పారు. దీంతో సముద్రంలోకి వెళ్లిన పోలీసులు వారిని ఒడ్డుకు చేర్చారు. మన్నం ఏసోబు సముద్రంలో గల్లంతయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సర్పంచ్‌లు భాస్కర్ల గణపతి, చొప్పల చిట్టిబాబు, మాజీ సర్పంచ్‌లు వనమాలి మూలాస్వామి, నల్లి సుభాష్‌లు వారిని పరామర్శించారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇచ్చిన సమాచారంతో రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఘటన స్థలానికి చేరుకుని వారిని పరామర్శించారు.