ఆ జర్నలిస్టు కోసం వేట
ముంబై: ఐఎస్ఐఎస్లో చేరాలనుకుంటున్నట్లు వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు జుబర్ అహ్మద్ ఖాన్ కోసం ముంబై పోలీసులు వేట మొదలు పెట్టారు. దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా, రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన అతడిని ఎలాగైనా పట్టుకుని తీరాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జుబర్ అహ్మద్ ఖాన్ కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ముంబై పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్ ఉరికి సానుభూతిని వ్యక్తం చేస్తూ జుబర్ అహ్మద్ ఖాన్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేశాడు. అంతేకాకుండా తాను ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ప్రతినిధిగా వ్యవహరించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. యాకూబ్ మెమన్ మృత వీరుడుగా అభివర్ణించాడు. దీనిపై ఓ వ్యక్తి పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.
దేశంలో ఉగ్రవాదుల దాడులు, పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాటు వార్తల నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ముంబై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా ఆ జర్నలిస్టు నవీ ముంబైలో నివసిస్తున్నట్టుగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా తృటిలో తప్పించుకున్నట్టు సమాచారం.