‘తీగ’ సీఐఏది.. ‘డొంక’ ఎన్‌ఐఏది! | isis social media accounts key evidence for cia, nia | Sakshi
Sakshi News home page

‘తీగ’ సీఐఏది.. ‘డొంక’ ఎన్‌ఐఏది!

Published Tue, Jan 26 2016 1:04 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

isis social media accounts key evidence for cia, nia

 కీలక ఆధారాలుగా మారిన సోషల్‌మీడియా అకౌంట్స్
 ‘ఏయూటీ’ మాడ్యూల్‌ను తొలుత గుర్తించిన అమెరికా
 కేంద్ర హోం శాఖకు అధికారిక సమాచారం ఇచ్చిన సీఐఏ

 
 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఏ ఆన్‌లైన్‌ను వినియోగించుకుని విస్తరిస్తోందో.. దానికి అనుబంధంగా ఏర్పడిన జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ గుట్టు ఆ ఆన్‌లైన్ ద్వారానే వెలుగులోకి వచ్చింది. భారత్‌లో విస్తరిస్తున్న ఈ నెట్‌వర్క్‌ను తొలుత అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) గుర్తించింది. అక్కడ నుంచి వచ్చిన అధికారిక సమాచారంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ).. ఏయూటీ మాడ్యూల్ గుట్టురట్టు చేయడమేకాక ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసింది. శుక్ర-శనివారాల్లో హైదరాబాద్‌లో పట్టుబడిన మహ్మద్ నఫీస్ ఖాన్, మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్, మహ్మద్ ఒబేదుల్లా ఖాన్, అబు అన్స్ ఈ మాడ్యూల్‌కు చెందిన వారే.

 పారిస్ ఎఫెక్ట్‌తో ప్రత్యేక నిఘా

 పారిస్ ఉగ్రదాడుల నేపథ్యంలో సీఐఏ సాంకేతిక నిఘాను పెంచి, కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంది. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులు, అనుమానితుల కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు చెందిన ఐపీ అడ్రస్‌లు సేకరించింది. కర్ణాటకలోని భత్కల్ నుంచి వెళ్లి ప్రస్తుతం యూసుఫ్ పేరుతో సిరియా కేంద్రంగా ఐసిస్‌కు అనుబంధంగా పని చేస్తున్న షఫీ ఆర్మర్.. అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇతడే ముంబైకి చెందిన ముదాబిర్ ముస్తాఖ్ షేక్‌ను ఆన్‌లైన్ ద్వారా ఉగ్రబాట పట్టించాడు. భారత్‌లో విధ్వంసాల కోసం జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు.

 డీకోడ్ చేయడంతో..

 మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న షఫీ ఆర్మర్.. ముదాబిర్‌తో సోషల్‌మీడియాలో చాటింగ్ చేస్తున్న విషయం గత ఏడాది గుర్తించిన సీఐఏ లోతుగా ఆరా తీసింది. వీరిద్దరూ ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నారని గుర్తించిన సీఐఏ అప్పటి నుంచి నిశితంగా గమనిస్తూ వచ్చింది. విధ్వంసాలకు రంగంలోకి దిగుతున్నారని గుర్తించింది. ముదాబిర్‌తో షఫీ వాట్సాప్ ద్వారా జరిగిన చాటింగ్‌లో ‘సాత్ కలాష్ రఖ్ దో’ అంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఈ కోడ్‌ను డీకోడ్ చేసింది. దేశంలోని ఏడు ప్రాంతాల్లో విధ్వంసాలకు రెక్కీ సహా అన్ని ఏర్పాట్లు చేయాలన్నది దాని అర్థంగా తేల్చింది.

 డీజీపీల సదస్సు నుంచి ఫీల్డ్ ఆపరేషన్

 సీఐఏ సమాచారంతో అప్రమత్తమైన హోంశాఖ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా డిసెంబర్ 9న ఎన్‌ఐఏకు ఆదేశాలతో(ఆర్డర్ నం.11034/111/2015-ఐఎస్-4) లేఖ రాసింది. స్పందించిన ఢిల్లీ ఎన్‌ఐఏ కార్యాలయం అదే రోజు కేసు (నం.ఆర్సీ-14/2015/ఎన్‌ఐఏ/డీఎల్‌ఐ) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. టై నెట్‌వర్క్ దేశ వ్యాప్తంగా విస్తరించిందని గుర్తించిన ఎన్‌ఐఏ అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర నిఘా వర్గాలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. గుజరాత్‌లో డిసెంబర్‌లో మూడు రోజుల పాటు అఖిల భారత డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సు జరిగింది. ఇందులోనే విస్తరిస్తున్న విషవృక్షం వ్యవహారాన్ని బయటపెట్టిన హోంశాఖ, ఐబీలు వేట ముమ్మరానికి ఆదేశించడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇది ఫలితాన్నివ్వడంతోనే గత వారం హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లోని 14 ప్రాంతాల్లో 13 మంది ముష్కరులు చిక్కడంతో పాటు జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ గుట్టురట్టయ్యింది.
 
 కస్టడీకి ‘జునూద్’ ఉగ్రవాదులు

 దేశవ్యాప్తంగా విధ్వంసాలకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ సంస్థకు చెందిన 14 మంది ఉగ్రవాదులను తదుపరి దర్యాప్తు నిమిత్తం పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని పటియాలా కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణకు అధికారులు మరోసారి నలుగురు ముష్కరుల్ని హైదరాబాద్ తీసుకువచ్చే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement