డీ-రాడికలైజేషన్ ఎలా?
సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియా ద్వారా విస్తరిస్తూ అనేక మందిని ఆకర్షిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ను (ఐసిస్) కట్టడి చేయడం ఎలా అనే ప్రధాన ఎజెండాతో ఈ ఏడాది అఖిల భారత డీజీపీల సదస్సు జరగనుంది. గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న ధూర్డో ప్రాంతంలో శుక్రవారం ప్రారంభం కానున్న ఈ సదస్సు మూడు రోజులు జరుగుతుంది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు అన్ని నిఘా, పోలీసు విభాగాలు ఇందులో పాల్గొనున్నాయి. ఆన్‌లైన్ ద్వారా రాడికలైజ్ అవుతూ ఐసిస్ బాటపడుతున్న యువతను డీ-రాడికలైజేషన్ చేయడం ఎలా? అన్న దానిపై ప్రధానంగా చర్చించనున్నారని తెలిసింది. ఈ సదస్సు నేపథ్యంలో తెలంగాణ పోలీసు విభాగం ఓ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
దక్షిణాదిలో ఐసిస్ ప్రభావం హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంది. ఇప్పటికే సల్మాన్ మొయినుద్దీన్, నిక్కీ జోసెఫ్‌లను అరెస్టు చేసిన అధికారులు.. దాదాపు 25 మంది ఆకర్షితుల్ని గుర్తించి కౌన్సెలింగ్ చేశారు. మావోయిస్టుల్ని ఎదుర్కోవడంలో ప్రదర్శించిన స్ట్రాటజీలోని లోపాలను సరిచేసుకుంటున్న తెలంగాణ పోలీసులు ఐసిస్‌పై విభిన్న పోరు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆకర్షితులవుతున్న వారికి సంబంధించిన సమాచారం కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాల మాదిరిగా ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయకుండా.. వారిలోని రాడికలైజేషన్ భావాలను పరిగణనలోకి తీసుకునే చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానం వల్ల మత పెద్దలు, కుటుంబాల నుంచి మద్దుతు వస్తోందని, కొందరు సానుభూతిపరుల వివరాలను వారి కుటుంబీకులే అందించారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ స్ట్రాటజీపై రూపొందిం చిన ప్రత్యేక ప్రజెంటేషన్‌ను సదస్సులో ప్రదర్శించనున్నారని తెలిసింది. ఇప్పటి వరకు ప్రతి ఏడాదీ ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న డీజీపీల సదస్సును తొలిసారిగా మరో ప్రాంతంలో ఏర్పాటు చేశారు.