305 కిలోల గంజాయి పట్టివేత
జి.మాడుగుల : మైదాన ప్రాంతానికి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జి.మాడుగుల ఎస్ఐ శేఖరం కథనం ప్రకారం జి.మాడుగుల-పాడేరు ఆర్అండ్బి రోడ్డులో సంతబయలు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. పెదబయలు మండలంలో మారుమూల గ్రామాల్లో 75 కిలోల గంజాయి కొనుగోలు చేసి ఆర్టీసీ బస్సులో మైదాన ప్రాంతాలకు తరలిస్తుండగా అందిన సమాచారంతో బస్సును సోదా చేశారు.
ఇందులో తమిళనాడు నూరూర్ జిల్లా కరూర్కు చెందిన మురియప్పన్, థానే జిల్లా ఉటియాపాలేనికి చెందిన మోహన్ కరియప్ప, మణిగౌతమ్, ముకెన్కచ్చమ్మ, రాససరస్వతిలను అరెస్టు చేసినట్టు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 2 లక్షలుంటుందన్నారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, రూ.4700ల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
డుంబ్రిగుడలో 20 కిలోలు
డుంబ్రిగుడ : పాడేరు నుంచి అరకు వైపు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 20 కిలోల గంజాయిని పర్యటక కేంద్రం చాపరాయి జలపాతం వద్ద బుధవారం పట్టుకున్నట్టు డుంబ్రిగుడ ఎస్ఐ రామకృష్ణ తెలిపా రు. బస్సులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో చాపరాయిలో మాటువేసి నిందితులను అదుపులో తీసుకొన్నామన్నారు. పట్టుబడిన వారిలో హుకుంపేట మండలం ఒల్డాకి చెందిన ఈశ్వరావు, భానుప్రకాష్లున్నారని ఆయన చెప్పారు. వీరిని రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు.
నర్సీపట్నంలో...
నర్సీపట్నం టౌన్ : ఏజెన్సీ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న రూ.15 లక్షల విలువైన 210 కిలోల గంజాయిని, వాహనాన్ని ఎక్సైజ్ పోలీసులు బుధవారం స్వాధీనం చేస్తున్నారు. ముందుస్తు సమాచారంతో ఎక్సైజ్ సీఐ ఎం.జగన్మోహన్రావు తన సిబ్బందితో గురంధరపాలెం పనుకుల వద్ద మాటు వేశారు. తమను గమనించిన వాహనదారుడు వదిలి పారిపోయాడని, వాహన రికార్డుల ఆధారంగా యజమాని హైదరాబాద్, బాలనగర్కు చెందిన జి.నాగరాజుగా గుర్తించామని సీఐ చెప్పారు. వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై ఫణింద్ర, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.