Manipur police
-
మణిపూర్ హింసాకాండలో 175 మంది బలి
ఇంఫాల్: జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ ఏడాది మే నెలలో హింసాకాండ మొదలైంది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 175 మంది మరణించారని, 32 మంది అదృశ్యమయ్యారని, 1,108 మంది గాయపడ్డారని మణిపూర్ పోలీసు శాఖ వెల్లడించింది. మరణించిన 175 మందిలో 96 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు ఇంకా తీసుకెళ్లలేదని, అవి వివిధ ఆసుపత్రుల్లో మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది. అలాగే 9 మృతదేహాలను గుర్తించలేదని వివరించింది. దాడులు, ప్రతి దాడుల్లో 4,786 ఇళ్లు దహనమయ్యాయని తెలియజేసింది. మణిపూర్‌లో హింస మొదలైనప్పటి నుండి ఆయుధగారాల నుంచి 5,668 ఆయుధాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వీటిలో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు మళ్లీ స్వా«దీనం చేసుకున్నాయి. అల్లరి మూకల నుంచి భారీగా మందుగుండు సామగ్రి, బాంబులను కూడా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గృహ దహనాలకు సంబంధించి పోలీసులు 5,172 కేసులు నమోదు చేశారు. హింసాకాండకు సంబంధించి మొత్తం 9,332 కేసులు నమోదు చేశారు. 325 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని మణిపూర్ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అస్సాం రైఫిల్స్‌ను ఉపసంహరించాలి తమ రాష్ట్రం నుంచి అస్సాం రైఫిల్స్ దళాలను వెంటనే ఉపసంహరించాలని మణిపూర్ పౌర సమాజ సంస్థలతో కూడిన మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ(కాకోమీ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. అస్సాం రైఫిల్స్ జవాన్లు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాకోమీ ప్రతినిధులు తాజాగా ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. -
హక్కుల ఉల్లంఘనలను సహించబోం
న్యూఢిల్లీ: మానవ హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటువంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేసింది. మణిపూర్‌లో సైన్యం, అస్సాం రైఫిల్స్, పోలీసు బలగాలు పాల్పడిన నాలుగు నకిలీ ఎన్కౌంటర్లపై ఈ నెల 27లోగా తుది నివేదిక ఇవ్వాలని సీబీఐను ఆదేశించింది. ఈ ఎన్కౌంటర్లలో పౌరులు ప్రాణాలు కోల్పోయినందున తీవ్ర ప్రాముఖ్యత గల విషయంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ యుయు లలిత్‌ల బెంచ్ గురువారం ఈ కేసు విచారణ చేపట్టింది. తమ విచారణ పూర్తయిందని, తుది నివేదిక రూపొందించే పనిలో ఉన్నామని సీబీఐ ప్రత్యేక విచారణ బృందం(సిట్) కోర్టుకు తెలిపింది. దీంతోపాటు మణిపూర్‌లో జరిగిన 41 ఎన్కౌంటర్లపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందనీ, ఇప్పటివరకు 20 కేసుల్లో దర్యాప్తు పూర్తికావొచ్చిందని అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) మణీందర్ సింగ్ తెలిపారు. స్పందించిన న్యాయస్థానం ‘మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాత్రమే కాదు, మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. అవి హత్యలా? కాదా? మానవ హక్కుల కంటే ఈ అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని పేర్కొంది. -
వేధింపుల కేసులో బాక్సర్ డింకో సింగ్ అరెస్ట్
ఇంపాల్ : ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ డింకో సింగ్‌ను మణిపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళా వెయిట్ లిఫ్టర్‌ను వేధించాడన్న ఆరోపణలపై డింకోను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టు ముందు హాజరు పరచనున్నారు. ఇంపాల్లోని లంపాక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 13న 17 ఏళ్ల మహిళా వెయిట్ లిఫ్టర్‌ను డింకో వేధించాడు. అతని కారుపై ఓజా డింకో అని రాసినందుకు తనను కర్రతో తీవ్రంగా కొట్టాడని సదరు లిఫ్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ మహిళా లిఫ్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 1998లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో డింకో సింగ్ గోల్డ్ మెడల్ గెలిచి పేరు సంపాదించాడు. అనంతరం అతన్ని కేంద్రం అర్జున, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. గతేడాది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. అతన్ని కోచ్‌గా నియమించింది. అలాంటి వ్యక్తి ఇంటువంచి చర్యలకు పాల్పడటాన్ని వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. డింకోపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.