Manju Agarwal
-
సీఎంఎస్ ఇన్ఫోలో మహిళా డైరెక్టర్లు
న్యూఢిల్లీ: క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తాజాగా ఇద్దరు మహిళా డైరెక్టర్లను నియమించుకుంది. కార్పొరేట్ పాలన నిబంధనలకు అనుగుణంగా స్వతంత్ర డైరెక్టర్ల హోదాలో మంజు అగర్వాల్, ఎస్.వసంత్ కారన్‌జ్‌కర్‌లను ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్‌టెక్ విభాగాలలో వీరికి సీనియారిటీ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో బోర్డులో మహిళా డైరెక్టర్ల సంఖ్య మూడుకు చేరినట్లు తెలియజేసింది. ఆరుగురు సభ్యుల బోర్డుకు చైర్‌పర్శన్, నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామలా గోపీనాథ్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ సుపరిపాలన విషయంలో కంపెనీ పాటిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలకు తాజా ఎంపికలు నిదర్శనాలని సీఎంఎస్ ఇన్ఫో పేర్కొంది. తద్వారా ముగ్గురు లేదా అంతకుమించి మహిళా డైరెక్టర్లు కలిగిన ఎన్ఎస్ఈ టాప్–10 శాతం లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించినట్లు వివరించింది. బ్యాక్‌గ్రౌండ్..: అగర్వాల్ ఎస్బీఐలో 34ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. దేశ, విదేశాలలో రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్, కస్టమర్ సర్వీసులు, వ్యూహాలు, నిర్వహణ తదితర విభాగాలలో విధులు చేపట్టారు. ఇక వసంత్ కారన్‌జ్‌కర్ కన్జూమర్ లెండింగ్ సంస్థ పేసెన్స్‌కు సహవ్యవస్థాపకురాలిగా వ్యవహరించారు. బిజినెస్, వృద్ధి, నిర్వహణ విభాగాలకు అధికారిణిగా బాధ్యతలు నిర్వహించారు. పేయూ క్రెడిట్ ఇండియాకు చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. పేసెన్స్ పురోగతి సాధించాక పేయూ ఇండియాకు చెందిన నాస్పెర్స్‌కు విక్రయించారు. -
‘ప్రైవసీ కావాలంటే అవి వాడొద్దు’
న్యూఢిల్లీ: ప్రజలు ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్‌లకు తమ వివరాలన్నీ ఇచ్చి వాటిని నమ్ముతున్నారనీ, కానీ సమాచార పరిరక్షణ విషయంలో ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదని ఎస్బీఐ ఉప మేనేజింగ్ డైరెక్టర్ మంజు అగర్వాల్ అన్నారు. నిజంగా గోప్యత కావాలనుకునేవారు ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్‌ను వాడకూడదని ఆమె అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యం చేయడం అన్న అంశంపై జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశంలో స్మార్ట్ఫోన్లు అందరికీ సమకూరిన తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గోప్యత అనేది ప్రజలు, ప్రభుత్వాల మధ్య ఉండే నమ్మకానికి సంబంధించినదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నారు. దేశ ప్రజల వివరాలకు గోప్యత లేదనీ, ఒకవేళ ఎవరికైనా ఉన్నా.. అలాంటి వారు క్రెడిట్ కార్డు వాడిన మరుక్షణం వారి వివరాలు బహిర్గతమవుతున్నాయని రాజీవ్ వ్యాఖ్యానించారు. క్రెడిట్ కార్డు ద్వారా ప్రజలేవి కొంటున్నారో తెలుసుకుని వాటి ఆధారంగా వినియోగదారులకు ఫోన్‌కాల్స్ వెళ్తున్నాయనీ, అంటే మనం ఏం కొంటున్నామో టెలీకాలర్స్‌కు కూడా తెలిసిపోతున్నప్పుడు ఇక గోప్యత ఎక్కడున్నట్లని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం, ప్రజల మధ్య ఉన్న అపనమ్మకంపై సమాజం దృష్టి పెడుతున్నందునే గోప్యతపై చర్చ జరగుతోందని రాజీవ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరి వివరాలూ గోప్యంగా లేవనీ, ఒకవేళ ఎవరైనా ఉన్నాయనుకుంటూ ఉంటే అలాంటి వారు భ్రమల నుంచి బయటపడాలని అన్నారు.