‘ప్రైవసీ కావాలంటే అవి వాడొద్దు’
న్యూఢిల్లీ: ప్రజలు ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్‌లకు తమ వివరాలన్నీ ఇచ్చి వాటిని నమ్ముతున్నారనీ, కానీ సమాచార పరిరక్షణ విషయంలో ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదని ఎస్‌బీఐ ఉప మేనేజింగ్ డైరెక్టర్ మంజు అగర్వాల్ అన్నారు. నిజంగా గోప్యత కావాలనుకునేవారు ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్‌ను వాడకూడదని ఆమె అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యం చేయడం అన్న అంశంపై జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశంలో స్మార్ట్‌ఫోన్లు అందరికీ సమకూరిన తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
గోప్యత అనేది ప్రజలు, ప్రభుత్వాల మధ్య ఉండే నమ్మకానికి సంబంధించినదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నారు. దేశ ప్రజల వివరాలకు గోప్యత లేదనీ, ఒకవేళ ఎవరికైనా ఉన్నా.. అలాంటి వారు క్రెడిట్ కార్డు వాడిన మరుక్షణం వారి వివరాలు బహిర్గతమవుతున్నాయని రాజీవ్ వ్యాఖ్యానించారు. క్రెడిట్ కార్డు ద్వారా ప్రజలేవి కొంటున్నారో తెలుసుకుని వాటి ఆధారంగా వినియోగదారులకు ఫోన్‌కాల్స్ వెళ్తున్నాయనీ, అంటే మనం ఏం కొంటున్నామో టెలీకాలర్స్‌కు కూడా తెలిసిపోతున్నప్పుడు ఇక గోప్యత ఎక్కడున్నట్లని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం, ప్రజల మధ్య ఉన్న అపనమ్మకంపై సమాజం దృష్టి పెడుతున్నందునే గోప్యతపై చర్చ జరగుతోందని రాజీవ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరి వివరాలూ గోప్యంగా లేవనీ, ఒకవేళ ఎవరైనా ఉన్నాయనుకుంటూ ఉంటే అలాంటి వారు భ్రమల నుంచి బయటపడాలని అన్నారు.