manmad
-
మా నీళ్లను దొంగలించారు సారూ!
సాక్షి ముంబై: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి, కరువు కారణంగా నీటి దొంగలు కూడా తయారయ్యారు. నాసిక్‌జిల్లా మన్మాడ్‌లో 300 లీటర్ల నీటిని దుండగులు దొంగిలించారు. మన్మాడ్‌లోని శ్రావస్తినగర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరికొందరి ఇళ్లలో కూడా ఇలాగే జరిగిందని తెలుస్తోంది. మన్మాడ్కు నీటి సరఫరా చేసే జలాశయాల్లో అడుగంటిపోయాయి. దీంతో మన్మాడ్‌లో తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఉండటంతో నీటి సరఫరా సుమారు 20 రోజులకు ఒకసారి అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో అనేక మంది డ్రమ్ములతోపాటు ట్యాంకులు కొనుగోలు చేసి నీటిని నిల్వ చేసుకుంటున్నారు. శ్రావస్థినగర్లో నివసించే విలాస్ ఆహిరే కూడా అందరి మాదిరిగానే ఓ 500 లీటర్ల ట్యాంకు బంగ్లాపై ఉంచి నీటిని నిల్వచేసుకుని వినియోగించుకోసాగారు. అయితే మన్మాడ్ మున్సిపాలిటీ కుళాయిలో నీటి సరఫరా చేయడంతో ఆ ట్యాంకును పూర్తిగా నింపుకుని నీటిని నిల్వచేసుకున్నాడు. కానీ, ఊహించని విధంగా మరుసటి రోజు ఉదయం పరిశీలిస్తే ట్యాంకులోని నీరు దొంగతతనానికి గురైందని తెలిసింది. ఈ ట్యాంకులో నుంచి సుమారు 300 లీటర్లకుపైగా నీటిని ఎవరో దొంగిలించుకుపోయారు. ఈ విషయంపై మన్మాడ్ పట్టణ పోలీసు స్టేషన్లో ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సదరు నీటి దొంగలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని విలాస్ ఆహిర్ కోరారు. తీవ్ర కరువు సమీపిస్తోంది! రాష్ట్రంలో రోజురోజుకి నీటి సమస్య జఠిలమవుతోంది. మరాఠ్వాడా, విదర్బ, పశ్చిమ మహారాష్ట్రతోపాటు అనేక ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. దీంతో అనేక ప్రాంతాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో కరువు తాండవిస్తోంది. మరోవైపు జలాశయాలు, బావులు అడుగంటిపోతున్నాయి. ఊష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో జలాశయాల్లోని నీరు త్వరగా తగ్గుతోంది. పరిణామంగా అనేక ప్రాంతాల్లో సాగునీటితోపాటు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక గ్రామాల్లో వివాహాలతోపాటు ఇతర ఏదైనా కార్యాలు చేయాలంటే ప్రజలు భయపడుతున్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో అనేక మంది పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకుంటున్నట్టు తెలిసింది. దీన్నిబట్టి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది మనకు స్పష్టం అవుతుంది. లాతూరులో సర్పంచిని చితకబాదిన గ్రామస్థులు.. లాతూరు జిల్లాలోని ఓ గ్రామంలో నీటి సమస్య పరిష్కారంపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ సర్పంచిని స్థానిక ప్రజలు చితక బాదారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. లాతూరు జిల్లా హాలసీ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరాఠ్వాడాలోని లాతూర్ జిల్లాల్లో నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఉన్న నీటి వనరులను కాపాడునేందుకు గ్రామస్థులు, ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే హాలసీ గ్రామంలో బావుల కోసం ప్రజలందరు కలిసి డబ్బులు జమచేశారు. అయితే ఎన్నికల నియమావలి ఉందంటూ జాప్యం చేస్తూ వచ్చిన హాలసీ గ్రామ సర్పంచిని గ్రామస్థులు వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. అయితే ఏవో సాకులు చెబుతుండటంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు సర్పంచిని చితక బాదారు. ఈ సంఘటన తీవ్ర కలకలంతోపాటు భయాందోళనలను రేకేత్తించింది. నీటి కోసం ఇలా గోడవలు జరగడం ఆందోళన కలిగించే విషయమని పలువురు పేర్కొంటున్నారు. -
రెండు రోడ్డు ప్రమాదాల్లో 15 మంది మృతి
సాక్షి, ముంబై: కొత్త వాహనం కొన్నామన్న ఆనందంతో షిర్డీ బయలుదేరిన సాయిభక్తులను కాలం కాటేసింది. తమ ఇష్టదైవాన్ని దర్శించుకోకముందే వీరి వాహనం నాసిక్ జిల్లా మన్మాడ్ తాలూకాలో శనివారం ఉదయం ఘోరరోడ్డు ప్రమాదానికి గురయింది. స్కార్పియో వాహనం, కంటెయినర్ ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ఎనిమిది మంది సాయిభక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయలయ్యాయి. మృతుల్లో ఓ బాలుడితోపాటు నలుగురు మహిళలున్నారు. దర్యాప్తు అధికారి, చన్‌వాడ్ ఎస్ఐ ముండే ‘సాక్షి’కి అందించిన వివరాల మేరకు... శనివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో మాన్మాడ్-మాలేగావ్ మార్గంపై కుందగావ్ శివార్లలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఠాకూర్ కుటుంబీకులు కొత్తగా స్కార్పియో వాహనం కొన్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి చెందిన 10 మంది షిర్డీకి బయల్దేరారు. నాసిక్ జిల్లా కుందల్‌వాడ్‌లో ఉదయం 11.45 గంటల ప్రాంతంలో స్కార్పియోను కంటెయినర్ వేగంగా ఢీకొట్టింది. దీంతో స్పార్పియో వాహనంలోని ఎనిమిది మంది విగత జీవులయ్యారు. మరోవైపు స్కార్పియో ముందుభాగం కంటెయినర్ కింద ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ఘటనాస్థలం రక్తంమడుగుగా మారింది. చుట్టుపక్కల వారు వీరిని కాపాడేందుకు ప్రయత్నించారు. బాధితుల్లో ఇద్దరు ప్రాణాలతో ఉన్నట్టు తెలుసుకుని వారిని మన్మాడ్‌లోని ఆస్పత్రికి తరలించారని ముండే వివరించారు. విషాదంగా మారిన విహారయాత్ర షోలాపూర్, న్యూస్లైన్ః విహారయాత్రకు బయలుదేరిన కొల్హాపూర్ సాంగవడేలోని ఉన్నత పాఠశాల విద్యార్థుల మినీబస్సు శనివారం రోడ్డు ప్రమాదానికి గురయింది. తుల్జాపూర్‌కు బయలుదేరిన ఈ బస్సును 15 కిలోమీటర్ల దూరంలో మాలంబ్రా గ్రామం సమీపంలో వోల్వో బస్సు ఢీకొట్టింది. షోలాపూర్-తుల్జాపూర్ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించగా మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. మరణించినవారిలో ఆరుగురు విద్యార్థులున్నారు. గాయలైనవారిలోనూ నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. సాంగవడేలోని ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఓ మినీబస్సు విహారయాత్రకు బయలుదేరింది. ముందుగా తుల్జాపూర్లో దేవీమాతను దర్శించుకుని ముందుకు సాగించాలని భావించారు. అక్కడికి చేరుకోకముందే మాలంబ్రా గ్రామంలోని ఓ మలుపు వద్ద ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఎదురుగా వేగంగా వస్తున్న ఓ వోల్వో బస్సు బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు నుజ్జునుజ్జయింది. విద్యార్థుల మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని విధంగా మారాయి. మృతులను బస్సు డ్రైవర్ ప్రతాప్ సుర్వేతోపాటు గణేష్ కుంబార్, ఆకాశ్ శిర్కే, సూరజ్ పాటిల్, పంకజ్ కుంబార్ , అక్షయ్ పాటిల్, వల్లభ్ కాంబ్లేగా గుర్తించారు. విద్యార్థులంతా 16 సంవత్సరాలలోపు వారేనని తెలిసింది గాయపడిన వారిని షోలాపూర్‌లోని అశ్వనీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. పరామార్శించిన మంత్రులు... ఈ దారుణం గురించి తెలుసుకున్న విద్యార్థుల కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకొని బోరున విలపించారు. రాష్ట్ర మంత్రులు మధుకర్ చవాన్, దిలీప్ సోపల్ ఘటనాస్థలానికి చేరుకోవడంతోపాటు ఆస్పత్రిలో క్షతగాత్రులు, వారి కుటుంబీకులను పరామర్శించారు.