Manmathanama year
-
శుభకరం.. మన్మథనామ సంవత్సరం
మచిలీపట్నం : మన్మథనామ సంవత్సరం జిల్లా ప్రజలకు శుభాలు కలుగజేస్తుందని పంచాంగం చెబుతోందని ఘనాపాటి విష్ణుభట్ల సూర్యనారాయణశర్మ అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి, జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యాన టౌన్‌హాలులో శనివారం ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది ప్రజల మంచి కోరికలన్నీ నెరవేరుతాయన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడిపంటలు వెల్లివిరుస్తాయన్నారు. 2015 ఏప్రిల్ 4న చంద్రగ్రహణం, 2016 మే 9న సూర్యగ్రహణం, 2016 ఫిబ్రవరి 8న మహోదయం జరుగుతాయని చెప్పారు. జిల్లా ఆదాయం 112గానూ, వ్యయం 98గానూ ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది సైన్యాధిపతిగా శుక్రుడు ఉండటంతో అంతా శుభకరంగానే ఉంటుందన్నారు. వివిధ రాశుల వారికి సంబధించిన మంచి, చెడులను ఆయన వివరించారు. ఈ ఏడాది గోదావరి పుష్కరాలకు అఖండ గౌతమిలో స్నానం చేస్తే పుణ్యం సమకూరుతుందన్నారు. పుష్కరాలు పూర్తయిన మూడు నెలల అనంతరం శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన - మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల ఆకాంక్షల మేరకు నూతన సంవత్సరంలో పాలన ఉంటుందని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన అధికారులు, పాలకులతో కలిసి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉగాది వేడుకలను ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. బందరుపోర్టు నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని, అయితే తప్పనిసరిగా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఐదెకరాల విస్తీర్ణంలో స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో రుద్రవరంలో మరో స్టేడియం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించినట్లు తెలిపారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉగాది వేడుకలను పురస్కరించుకుని పట్టణం, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, రచయితలతో కవిసమ్మేళనం నిర్వహించారు. కొట్టి రామారావు, గుడిసేవ విష్ణుప్రసాద్, కారుమూరి రాజేంద్రప్రసాద్, దత్తాత్రేయశర్మ, ముదిగొండ సీతారావమ్మ, దండిబొట్ల సత్యనారాయణశర్మ, భవిష్య, వరదా సురేష్‌కృష్ణ, విజయకుమార్, చంద్రిక, మధుబాబు, కోగంటి విజయలక్ష్మి, వక్కలంక రామకృష్ణ, ఎన్వీవీ సత్యనారాయణ, కుందా లక్ష్మీరాఘవేంద్రప్రసాద్, చోడవరపు మాదవి తదితరులు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయిన సౌకర్యాలు, పాలకులు చేసిన కనికట్టు, దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలు తదితర అంశాలను వివరిస్తూ కవితలు వినిపించారు. తొలుత సత్యనారాయణశర్మ, వెంకటపతి అవధాని, ఘనాపాటి విష్ణుభట్ల సూర్యనారాయణశర్మ వేద పఠనం చేశారు. అనంతరం క్రొవ్విడి శివబాబు, ముత్యాలపల్లి నాగబాబు నాదస్వరం వినిపించారు. మంత్రి రవీంద్ర, మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్, డీఆర్వో ఎ. ప్రభావతి, ఆర్డీవో పి .సాయిబాబు, వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం తదితరులను వేదపండితులు ఆశీర్వదించారు. భక్తి టీవీ ప్రచురించిన పంచాంగాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ నాట్యాచార్యుడు వై పూర్ణచంద్రరావు శిష్యబృందం మహ్మద్‌బేగ్ కూచిపూడి నృత్యం, బి. కృష్ణశ్రీయ అన్నమాచార్య కీర్తనలు, నాగార్జున పబ్లిక్ స్కూలు విద్యార్థులు పవన్‌కుమార్, వరప్రసాద్, బాలచంద్రుడు, దుర్యోధన ఏకపాత్రాభినయాలు చేశారు. పంచాంగ శ్రవణం చేసిన వేదపండితులు, కవులు, కళాకారులను మంత్రి ఘనంగా సత్కరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, బందరు ఎంపీపీ కాగిత శ్రీనివాసరావు, మునిసిపల్ కమిషనర్ మారుతీ దివాకర్, జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్ పలువురు కౌన్సిలర్లు ప్రసంగిస్తూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఆకాంక్షించారు. విసిగించిన వ్యాఖ్యాత : ఉగాది వేడుకల అధ్యక్షబాధ్యతను అధికారులు ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి అప్పగించారు. ఆయన విలేకరిగా కూడా పనిచేస్తుండటంతో కార్యక్రమం ఆద్యంతం ఆయన వ్యాఖ్యానంతో ప్రజలు విసిగిపోయారు. కవిసమ్మేళనం సందర్భంగా ఈయన వ్యాఖ్యానం శృతి మించింది. దీంతో వేదికపై ఉన్న భవిష్య మాట్లాడుతూ కవితలకంటే వ్యాఖ్యాత ప్రసంగమే అధికంగా ఉందని సూచించినా ఆయన తీరు మార్చుకోకపోవడం గమనార్హం. -
వానలకు దేవుడిపైనే భారం
ఈ ఏడాది గ్రహస్థితి వల్ల వర్షాలు అంతంతమాత్రమే పంటలు తగ్గి కరువు ఛాయలు ఏర్పడే అవకాశం ధార్మిక కార్యక్రమాలతో ఉపశమనం.. తెల్ల ధాన్యాలకు అనుకూల వాతావరణం పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో పురోగతి.. చెరువుల పునరుద్ధరణతో సత్ఫలితాలు దేవాదాయ శాఖ పంచాంగ శ్రవణంలో చంద్రశేఖర సిద్ధాంతి వెల్లడి సాక్షి, హైదరాబాద్: మన్మథనామ సంవత్సరంలో వానలు అంతంతమాత్రంగానే ఉంటాయని, దీనివల్ల పంటల దిగుబడులు తగ్గి కరువు ఛాయలు ఏర్పడతాయని ప్రముఖ పంచాంగకర్త యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి పేర్కొన్నారు. దేవుడిపై భారం మోపి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే వరుణుడు కొంతమేర కరుణించే అవకాశం ఉంటుందని పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సదనంలో నిర్వహించిన ఉగాది వేడుకలో భాగంగా ఆయన పంచాంగ శ్రవణం నిర్వహించారు. మన్మథనామ సంవత్సరంలో రాశి ఫలితాలు, పరిస్థితులు ఎలా ఉండబోతాయో వివరించారు. ఈ సంవత్సరం గ్రహస్థితిలో రాజు స్థానంలో శని ఉన్నందున వర్షాలు అంతంత మాత్రంగానే ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 22 నుంచి జూలై 19 వరకు సాధారణ వర్షాలు, జూలై 20 నుంచి ఆగస్టు 30 వరకు పెద్ద వానలు, సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మేఘాధిపతిగా చంద్రుడు ఉండటంతో విపరీతమైన గాలుల వల్ల మేఘాలు తేలిపోయి వానలకు ఇబ్బంది ఏర్పడుతుందని, ఆ గాలులు చివరకు పంటలను కూడా నాశనం చేస్తాయని చెప్పారు. వర్షాల కోసం వరుణ, రుద్రయాగాలు, రుద్రాభిషేకాలు నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి సూచించారు. ఈ ఏడాది ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుందని, పసుపు, వేరుశనగ ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. తెల్లని ధాన్యాలు, పొట్టు ధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, వాటి ధరలు తగ్గుతాయని చెప్పారు. మంత్రి స్థానంలో కుజుడు ఉన్నందున హక్కుల కోసం పోరాడాల్సి వస్తుందని, సేనాధిపతిగా కూడా కుజుడే ఉన్నందున వాటిని సాధించుకునేందుకు పోరాడే శక్తి లభిస్తుందని తెలిపారు. పారిశ్రామికంగా రాష్ర్టం చాలా పురోగతి సాధించేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని, విద్యుత్ సమస్యలను అధిగమించే అవకాశాలు చాలా మెరుగవుతాయని, చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తాయని వివరించారు. హైకోర్టు విభజనతోపాటు దీర్ఘకాలం పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే నిర్మాణాత్మక చర్యల వల్ల ప్రజలకు ఊరట లభిస్తుందన్నారు. నేరాలు పెచ్చుమీరే ప్రమాదం ఉన్నందున సర్కారు దీనిపై దృష్టి సారించాల్సి ఉంటుందని, పర్యాటక, రవాణా రంగాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఆదాయ-వ్యయాలు సమంగా ఉంటాయని, ఆదాయం 93గా ఉంటే వ్యయం కూడా అంతే ఉందన్నారు. కాగా వైద్య, చలనచిత్ర రంగాల్లో దేశానికి కీర్తి లభిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో ఆర్థికమాంద్యం తలెత్తుతుందని కూడా చంద్రశేఖర సిద్ధాంతి తెలిపారు. ప్రముఖులకు సన్మానం సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, చిత్రకళ, శిల్పకళ, పేరిణి నృ త్యం, జానపద సంగీతం, జానపద కళారూప ప్రదర్శన, హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, మిమిక్రీ, టీవీ, సినిమా రంగం, జానపద చిత్రకళ, హస్తకళ తదితర రంగాలకు చెందిన 31 మంది ప్రముఖులను జ్ఞాపికలు, పోచంపల్లి పట్టు శాలువాలతో సీఎం కేసీఆర్ సత్కరించారు. రాష్ర్టంలోని దేవాలయాలకు చెందిన 34 మంది వేదపండితులు, అర్చకులను సన్మానించారు. ఈ సందర్భంగా నల్లా విజయ్ అనే నిపుణుడు అరటినారతో నేసిన శాలువాను సీఎంకు బహూకరించారు. భద్రాచల దేవాలయం పక్షాన శ్రీరామనవమి వేడుకల ఆహ్వాన పత్రికను ఆలయ వేదాచార్యులు కేసీఆర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు ఈటెల, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని, పోచారం, తలసాని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, అధికారులు పాల్గొన్నారు.