- ఈ ఏడాది గ్రహస్థితి వల్ల వర్షాలు అంతంతమాత్రమే
- పంటలు తగ్గి కరువు ఛాయలు ఏర్పడే అవకాశం
- ధార్మిక కార్యక్రమాలతో ఉపశమనం.. తెల్ల ధాన్యాలకు అనుకూల వాతావరణం
- పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో పురోగతి.. చెరువుల పునరుద్ధరణతో సత్ఫలితాలు
- దేవాదాయ శాఖ పంచాంగ శ్రవణంలో చంద్రశేఖర సిద్ధాంతి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మన్మథనామ సంవత్సరంలో వానలు అంతంతమాత్రంగానే ఉంటాయని, దీనివల్ల పంటల దిగుబడులు తగ్గి కరువు ఛాయలు ఏర్పడతాయని ప్రముఖ పంచాంగకర్త యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి పేర్కొన్నారు. దేవుడిపై భారం మోపి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే వరుణుడు కొంతమేర కరుణించే అవకాశం ఉంటుందని పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సదనంలో నిర్వహించిన ఉగాది వేడుకలో భాగంగా ఆయన పంచాంగ శ్రవణం నిర్వహించారు.
మన్మథనామ సంవత్సరంలో రాశి ఫలితాలు, పరిస్థితులు ఎలా ఉండబోతాయో వివరించారు. ఈ సంవత్సరం గ్రహస్థితిలో రాజు స్థానంలో శని ఉన్నందున వర్షాలు అంతంత మాత్రంగానే ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 22 నుంచి జూలై 19 వరకు సాధారణ వర్షాలు, జూలై 20 నుంచి ఆగస్టు 30 వరకు పెద్ద వానలు, సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మేఘాధిపతిగా చంద్రుడు ఉండటంతో విపరీతమైన గాలుల వల్ల మేఘాలు తేలిపోయి వానలకు ఇబ్బంది ఏర్పడుతుందని, ఆ గాలులు చివరకు పంటలను కూడా నాశనం చేస్తాయని చెప్పారు.
వర్షాల కోసం వరుణ, రుద్రయాగాలు, రుద్రాభిషేకాలు నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి సూచించారు. ఈ ఏడాది ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుందని, పసుపు, వేరుశనగ ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. తెల్లని ధాన్యాలు, పొట్టు ధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, వాటి ధరలు తగ్గుతాయని చెప్పారు. మంత్రి స్థానంలో కుజుడు ఉన్నందున హక్కుల కోసం పోరాడాల్సి వస్తుందని, సేనాధిపతిగా కూడా కుజుడే ఉన్నందున వాటిని సాధించుకునేందుకు పోరాడే శక్తి లభిస్తుందని తెలిపారు.
పారిశ్రామికంగా రాష్ర్టం చాలా పురోగతి సాధించేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని, విద్యుత్ సమస్యలను అధిగమించే అవకాశాలు చాలా మెరుగవుతాయని, చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తాయని వివరించారు. హైకోర్టు విభజనతోపాటు దీర్ఘకాలం పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే నిర్మాణాత్మక చర్యల వల్ల ప్రజలకు ఊరట లభిస్తుందన్నారు.
నేరాలు పెచ్చుమీరే ప్రమాదం ఉన్నందున సర్కారు దీనిపై దృష్టి సారించాల్సి ఉంటుందని, పర్యాటక, రవాణా రంగాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఆదాయ-వ్యయాలు సమంగా ఉంటాయని, ఆదాయం 93గా ఉంటే వ్యయం కూడా అంతే ఉందన్నారు. కాగా వైద్య, చలనచిత్ర రంగాల్లో దేశానికి కీర్తి లభిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో ఆర్థికమాంద్యం తలెత్తుతుందని కూడా చంద్రశేఖర సిద్ధాంతి తెలిపారు.
ప్రముఖులకు సన్మానం
సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, చిత్రకళ, శిల్పకళ, పేరిణి నృ త్యం, జానపద సంగీతం, జానపద కళారూప ప్రదర్శన, హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, మిమిక్రీ, టీవీ, సినిమా రంగం, జానపద చిత్రకళ, హస్తకళ తదితర రంగాలకు చెందిన 31 మంది ప్రముఖులను జ్ఞాపికలు, పోచంపల్లి పట్టు శాలువాలతో సీఎం కేసీఆర్ సత్కరించారు. రాష్ర్టంలోని దేవాలయాలకు చెందిన 34 మంది వేదపండితులు, అర్చకులను సన్మానించారు. ఈ సందర్భంగా నల్లా విజయ్ అనే నిపుణుడు అరటినారతో నేసిన శాలువాను సీఎంకు బహూకరించారు. భద్రాచల దేవాలయం పక్షాన శ్రీరామనవమి వేడుకల ఆహ్వాన పత్రికను ఆలయ వేదాచార్యులు కేసీఆర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు ఈటెల, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని, పోచారం, తలసాని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, అధికారులు పాల్గొన్నారు.