శుభకరం.. మన్మథనామ సంవత్సరం | Subhakaram manmathanama year .. | Sakshi
Sakshi News home page

శుభకరం.. మన్మథనామ సంవత్సరం

Published Sun, Mar 22 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

Subhakaram manmathanama year ..

మచిలీపట్నం : మన్మథనామ సంవత్సరం జిల్లా ప్రజలకు శుభాలు కలుగజేస్తుందని పంచాంగం చెబుతోందని ఘనాపాటి విష్ణుభట్ల సూర్యనారాయణశర్మ అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి, జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యాన టౌన్‌హాలులో శనివారం ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది ప్రజల మంచి కోరికలన్నీ నెరవేరుతాయన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడిపంటలు వెల్లివిరుస్తాయన్నారు.

2015 ఏప్రిల్ 4న చంద్రగ్రహణం, 2016 మే 9న సూర్యగ్రహణం, 2016 ఫిబ్రవరి 8న మహోదయం జరుగుతాయని చెప్పారు. జిల్లా ఆదాయం 112గానూ, వ్యయం 98గానూ ఉంటుందని చెప్పారు.  ఈ ఏడాది సైన్యాధిపతిగా శుక్రుడు ఉండటంతో అంతా శుభకరంగానే ఉంటుందన్నారు. వివిధ రాశుల వారికి సంబధించిన మంచి, చెడులను ఆయన వివరించారు. ఈ ఏడాది గోదావరి పుష్కరాలకు అఖండ గౌతమిలో స్నానం చేస్తే పుణ్యం సమకూరుతుందన్నారు. పుష్కరాలు పూర్తయిన మూడు నెలల అనంతరం శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉందన్నారు.
 
ప్రజల ఆకాంక్షల మేరకు పాలన
 - మంత్రి కొల్లు రవీంద్ర
ప్రజల ఆకాంక్షల మేరకు నూతన సంవత్సరంలో పాలన ఉంటుందని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన అధికారులు, పాలకులతో కలిసి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉగాది వేడుకలను ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నామన్నారు.

బందరుపోర్టు నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని, అయితే తప్పనిసరిగా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఐదెకరాల విస్తీర్ణంలో స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో రుద్రవరంలో మరో స్టేడియం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించినట్లు తెలిపారు.
 
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఉగాది వేడుకలను పురస్కరించుకుని పట్టణం, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, రచయితలతో కవిసమ్మేళనం నిర్వహించారు. కొట్టి రామారావు, గుడిసేవ విష్ణుప్రసాద్, కారుమూరి రాజేంద్రప్రసాద్, దత్తాత్రేయశర్మ, ముదిగొండ సీతారావమ్మ, దండిబొట్ల సత్యనారాయణశర్మ, భవిష్య, వరదా సురేష్‌కృష్ణ, విజయకుమార్, చంద్రిక, మధుబాబు, కోగంటి విజయలక్ష్మి, వక్కలంక రామకృష్ణ, ఎన్‌వీవీ సత్యనారాయణ, కుందా లక్ష్మీరాఘవేంద్రప్రసాద్, చోడవరపు మాదవి తదితరులు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయిన సౌకర్యాలు, పాలకులు చేసిన కనికట్టు, దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలు తదితర అంశాలను వివరిస్తూ కవితలు వినిపించారు.

తొలుత సత్యనారాయణశర్మ, వెంకటపతి అవధాని, ఘనాపాటి విష్ణుభట్ల సూర్యనారాయణశర్మ వేద పఠనం చేశారు. అనంతరం క్రొవ్విడి శివబాబు, ముత్యాలపల్లి నాగబాబు నాదస్వరం వినిపించారు. మంత్రి రవీంద్ర, మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్, డీఆర్వో ఎ. ప్రభావతి, ఆర్డీవో పి .సాయిబాబు, వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం తదితరులను వేదపండితులు ఆశీర్వదించారు. భక్తి టీవీ ప్రచురించిన పంచాంగాన్ని ఆవిష్కరించారు.

ప్రముఖ నాట్యాచార్యుడు వై పూర్ణచంద్రరావు శిష్యబృందం మహ్మద్‌బేగ్ కూచిపూడి నృత్యం, బి. కృష్ణశ్రీయ అన్నమాచార్య కీర్తనలు, నాగార్జున పబ్లిక్ స్కూలు విద్యార్థులు పవన్‌కుమార్, వరప్రసాద్, బాలచంద్రుడు, దుర్యోధన ఏకపాత్రాభినయాలు చేశారు. పంచాంగ శ్రవణం చేసిన వేదపండితులు, కవులు, కళాకారులను మంత్రి ఘనంగా సత్కరించారు.  టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, బందరు ఎంపీపీ కాగిత శ్రీనివాసరావు, మునిసిపల్ కమిషనర్ మారుతీ దివాకర్, జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్ పలువురు కౌన్సిలర్లు ప్రసంగిస్తూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఆకాంక్షించారు.
 
విసిగించిన వ్యాఖ్యాత :
 ఉగాది వేడుకల అధ్యక్షబాధ్యతను అధికారులు ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి అప్పగించారు. ఆయన విలేకరిగా కూడా పనిచేస్తుండటంతో కార్యక్రమం ఆద్యంతం ఆయన వ్యాఖ్యానంతో ప్రజలు విసిగిపోయారు. కవిసమ్మేళనం సందర్భంగా ఈయన వ్యాఖ్యానం శృతి మించింది. దీంతో వేదికపై ఉన్న భవిష్య మాట్లాడుతూ కవితలకంటే వ్యాఖ్యాత ప్రసంగమే అధికంగా ఉందని సూచించినా ఆయన తీరు మార్చుకోకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement