ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనంతో నవనవోన్మేషంగా ఉండడం సృష్టి లక్షణం. అనుదినం తన బిడ్డలకు కొత్తదనాలనూ, కొత్త భోగవస్తువులనూ, కొత్త అనుభవాలనూ కానుక చేయడం భగవంతుడికి వాడుక, వేడుక. కాబట్టే తెల్లారేసరికి మన చుట్టూ ఎన్నో కొత్త చిగుళ్లూ, కొత్త మొగ్గలూ, కొత్త ఆరంభాలూ కళకళ లాడుతూ, కిలకిల నవ్వుతూ కనిపిస్తాయి. ఎన్నో కొత్త అందాలూ, పోకడలూ, విచిత్రాలూ, కొత్త వేష భాషలూ, వస్తువాహనాలూ, ప్రయోగాలూ, ధోరణులూ ఎదురౌతాయి.
ప్రకృతి ధర్మంగా వచ్చి పలకరించే కొత్తదనాల సందడిని సుహృద్భావంతో స్వాగతించే ధీరుడు వాటిని ఆనందంగా ఆస్వాదించగలుగుతాడు. పరిచితమైనదనే పక్షపాతంతో పాతనే పట్టుకు పాకులాడుతూ, అపరిచితమైన నవ్యతకు అకారణంగా జంకుతూ ఉండే భీరువు, నిరంతమైన నిరాశతో నిరుత్సాహానికి నెలవుగా ఉంటాడు.
నిన్నటి కొత్తే నేటి పాత. నేటి కొత్త రేపటికి పాత. అయినప్పుడు అన్నీ మన మంచికే. లోక క్షేమం కోసం కొత్త నీరుప్రవహిస్తూ వస్తుంటే భయమెందుకు, కొత్త సమస్యలు మోసు కొస్తుందేమోననా? సమస్య వెంటే పరిష్కారం వస్తుంది అని చరిత్ర మనకు పదే పదే చెప్పిన పాఠం. గతంలో ఇలా అనవసరంగా ముందు భయపెట్టిన సమస్యలెన్నిటినో మనం అలవోకగాదాటివచ్చిన వాళ్ళమే గదా! సృష్టి కర్త ఉన్నాడనీ, ఆయన కరుణామయుడనీ, కాలగమనానికి ఆయనే కారణం గనక కాలగతి కలిగించే ఒడుదొడుకులన్నీ ఆయన అను గ్రహంతో అధిగమించగలమనీ విశ్వసించే వారు, నవ్యతను ఆశాభావంతో ఆహ్వానించకుండా ఉండలేరు.
ఎన్నో కొత్తదనాలు మన ముందు ఆవిష్కరించేందుకు, మరో నూతన సంవత్సరం మన ముంగిట నిలిచిన శుభవేళలో, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాక్ భవేత్ (అందరూ సుఖంగా ఉండాలి, అందరూ అనారోగ్యానికి దూరంగా ఉండాలి, అందరికీ శుభాలు జరగాలి, ఎవ్వరూ దుఃఖానికి ఆశ్రయం కాకూడదు) అన్న ఆర్షేయమైన ఆశీస్సు మనసారా మరోసారి మననం చేసుకొందాం. కొత్త ఏడాదిలో అందరూ ధర్మాన్ని రక్షిస్తూ, దానివల్ల సురక్షితులై సుఖశాంతులతో ఉండాలనీ, దుఃఖహేతువులైన దుర్మార్గాలకు దూరంగా ఉండాలనీ ఆకాంక్షిస్తూ, రెండు వేల ఇరవై మూడుకు సంతోషంగా స్వాగతం పలుకుదాం!
– ఎం. మారుతి శాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment