ప్రాణం తీసిన అప్పులు
గోపాల్పేట, అమ్రాబాద్ : ఇంటి భారాన్ని మోయడానికి అరకకట్టి వ్యవసాయ పనులు చేస్తున్న ఇద్దరు మహిళారైతులు అప్పుల బాధకు బల య్యారు. గోపాల్పేట మండలం మున్ననూరుకు చెందిన తులిసె లక్ష్మీదేవమ్మ(48), అమ్రాబాద్ మండలం పదర గ్రామవాసి మన్నెం నర్సమ్మ(40)లు ఖరీఫ్‌లో సాగుచేసిన పంటపై చేసిన అప్పులు తీరుద్దామనుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు చేతికి రాకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలిలా.. మన్ననూరుకు చెందిన తులిసె పెంటయ్య పొలం పనులు చేయకపోవడంతో ఆమె భార్య లక్ష్మీదేవమ్మ ఆడిపిల్లల పెళ్లిళ్లు చేయడానికి పొలంపనులు ప్రారంభించింది. ఉన్న మూడెకరాల్లో నీటి ఆధారం లేకపోవడంతో విడతల వారీగా నాలుగు బోర్లు వేసింది.
వాటిలో మూడు ఎండిపోయాయి. ఒకదాంట్లో అరకొరగా నీరు వస్తుండగా దానిపై ఆధారపడి ఖరీఫ్‌లో మొక్కజొన్న పంటను సాగు చేసింది. కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో ఈ సారి సేద్యానికి దూరమైంది. బోర్లకోసం చేసిన * 2 లక్షలు, మహిళా సంఘాల ద్వారా తీసుకున్న * 50 వేలు అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. వడ్డీ కట్టేందుకు భర్త పెంటయ్య ఇటీవలే హైదరాబాద్‌కు వెళ్లి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అప్పు లు భారమై ఎలా తీర్చాలనే దిగులుతో లక్ష్మీదేవమ్మ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గుళికల ముందు తాగింది. ఇది గమనించిన కుమారుడు శ్రీను జిల్లా ఆస్పత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. ఈ సంఘటనపై ఎస్సై కోట కరుణాకర్ కేసు నమోదు చేశారు.
పంట దిగుబడికి రాక..
అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన పంట చేతికంద కపోవడంతో అమ్రాబాద్ మండలం పదర గ్రామానికి చెందిన మన్నెం నర్సమ్మ(40) మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఉన్న రెండెకరాల పొలంలో ఈ ఏడాది పత్తిపంటను సాగు చేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంట ఎండిపోగా *40వేల వరకు అప్పులయ్యాయి. కుటంబ అవసరాల కోసం మరో *50 వేల వరకు అప్పులున్నాయి. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక మంగళవారం ఉదయం నర్సమ్మ చేన్లోనే పురుగుల మందు తాగింది. చాలాసేపటి తర్వాత పక్క పొలం వారు గమనించి ఇంటికి తీసుకొచ్చేలోపే చనిపోయింది. మృతురాలికి భర్త మల్లయ్యతో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధిత కుటుంబాలను పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు.