ఎన్నికల విధుల్లో మహిళలకు ఊరట!
మారుమూల ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు
పక్క పంచాయతీ లేదా నియోజకవర్గంలో విధులు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : వరుస ఎన్నికలతో కలవరపడుతున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు స్వల్ప ఊరట. ఈ సారి ఎన్నికల్లో మహిళా ఉద్యోగులు మారుమూల ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండవని అధికారులు చెబుతున్నారు. మే నెల వరకు వరుసగా మున్సిపల్, జెడ్పీటీసీ, సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సుమారు 5 వేల మంది, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు 13 వేల మంది, సాధారణ ఎన్నికలకు 25 వేల మంది వరకు ఉద్యోగులను ఎన్నికల విధులకు వినియోగించనున్నారు. ఇప్పటికే ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించి కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు.
ప్రస్తుత ఎన్నికల్లో మహిళలకు మాన్యువల్ పద్ధతిలోనే విధులను అప్పగించే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఎన్నికల సంఘం కూడా కొన్ని మార్గదర్శకాలు చేసింది. దాని ప్రకారం మహిళ ఉద్యోగులకు కొంత ఉపశమనం కలగనుంది. నగర పరిధిలో ఉద్యోగం చేస్తున్న మహిళలు సొంత నియోజకవర్గానికి కాకుండా పక్క నియోజకవర్గాలకు, జిల్లాలో ఉద్యోగం చేస్తున్న మహిళలు సొంత గ్రామం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో విధులను అప్పగించనున్నారు.
మాన్యువల్ పద్ధతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలా లేదా సాఫ్ట్వేర్ ద్వారా చేయాలన్న విషయంపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ సిద్ధంకాని పక్షంలో మాన్యువల్ పద్ధతిలోనే మహిళా ఉద్యోగులకు విధులను అప్పగించనున్నారు. అనంతరం వీరికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.