ఎల్బీటీ ఎత్తివేతపై త్వరలో ప్రకటన
ముఖ్యమంత్రి ఫడణ్‌వీస్
కోల్హాపూర్: స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ)ని ఎత్తివేస్తామన్న తమ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ చెప్పారు. అయితే త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడుతుందని అన్నారు. రాష్ట్రంలోని వ్యాపారులందరూ మూకుమ్మడిగా ఎల్బీటీని వ్యతిరేకిస్తున్నారు.
ఆక్ట్రాయ్ స్థానంలో పూర్వ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బీటీని ప్రవేశపెట్టింది. ఎల్బీటీని రద్దు చేసే విషయమై తమ ప్రభుత్వం అన్ని విధాల చర్చలు జరిపిందన్నారు. అయితే ఎల్బీటీ స్థానంలో మరో ప్రత్యామ్నాయ పన్ను ప్రతపాదనలు చేయాల్సి ఉందని చెప్పారు. ఎల్బీటీ రద్దుపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ఫడణ్‌వీస్ అన్నారు. ఇక్కడ శనివారం జరిగిన మరాఠీ దినపత్రిక ‘పుధారీ’ ప్లాటినం జూబిలీ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, సురేశ్ ప్రభు, రాష్ట్ర సహకార శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. రోడ్లపై వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్‌కు కూడా ప్రత్యామ్నాయాన్ని వెతికేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్ర చెప్పారు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేశామని, త్వరలోనే ఓ పరిష్కారాన్ని కనుగొంటామని పేర్కొన్నారు. ఏ పరిష్కారమైనా అది ప్రజలకు లబ్ధి చేకూర్చేదిగా ఉంటుందని చెప్పారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి ఫడణ్‌వీస్ ప్రయత్నిస్తారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘గతంలో ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్లారు. వారి ఎదుట కూడా ప్రజలు తమ డిమాండ్లను ఉంచారు. కానీ ఈయన దేవేంద్ర ఫడణ్‌వీస్. ఆయన నుంచి ప్రజలు ఆకాంక్షిస్తున్న ఆశలను తప్పక నెరవేరుస్తారన్న నమ్మకం నాకుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.