ఓటమి తర్వాత హిల్లరీ తొలిసారి..
న్యూయార్క్: ‘కాలం.. విజేతలనే తప్ప పరాజితులను గుర్తుంచుకోదు’ అనే సామెత హిల్లరీ క్లింటన్ విషయంలో తప్పే. రెండున్నర శతాబ్ధాల ప్రజాస్వామిక చరిత్రలో అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీపడిన మొదటి మహిళగా ఆమె పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మంగళవారంనాటి ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన ఆమె బుధవారం అభిమానులను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. ఆ తర్వాత మీడియా కంటికి కనపడలేదు. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన్ ట్రంప్ గురువారం ప్రస్తుత ప్రెసిడెంట్ ఒబామాతో భేటీ అయిన వార్తలు ప్రధానంగా ప్రసారమయ్యాయి. హిల్లరీకి సంబంధించిన సమాచారమేదీ వెలుగులోకి రాలేదు. బహుశా ఆమె తీవ్ర విషణ్నవదనంలో ఉండిపోయారని కొందరు భావించారు. కానీ..
శుక్రవారం అమెరికా సహా ప్రపంచంలోని ప్రధాన వార్త సంస్థలన్నింటికీ హిల్లరీకి సంబంధించిన(ఫలితాల తర్వాత మొదటిసారి వెలుగులోకి వచ్చిన) ఫొటోలను ప్రచురించాయి. ఈ ఫొటోలో కూతుర్ని ఎత్తుకుని ఉన్న మహిళ పేరు మార్కోట్ గెర్స్టర్. హిల్లరీకి డై హార్డ్ ఫ్యాన్. ఉండేది న్యూయార్క్ శివారులోని వెస్ట్ చెస్టర్ కౌంటీలో. అదే కౌంటీలోని చెపాక్ ప్రాంతంలో హిల్లరీ దంపతులు నివసిస్తారు. ఫొటో గురించి మార్కోట్ తన ఫేస్ బుక్ పేజీలో ఇలా రాసింది..‘నా అభిమాన నాయకురాలు(హిల్లరీ) ఓటమి నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇంట్లో కూర్చుని ఎంతో బాధపడ్డా. ఎన్నాళ్లిలా ఉంటామని నా చిన్నారిని తీసుకుని పార్క్ కు వెళ్లా. అక్కడ కాస్త రిలాక్స్ అయి వెనుదిరుగుతుండగా.. నా ఎదురుగా హిల్లరీ!
ఒక్కసారి షాక్ కు గురయ్యా. వెంటనే తేరుకుని తనను ఆలింగనం చేసుకున్నా. బిల్ క్లింటన్ కూడా పక్కనే ఉన్నారు. కుక్కపిల్లను పట్టుకుని ఇద్దరూ వ్యాహ్యాళికి వచ్చినట్టున్నారు. హిల్లరీ మేడం నన్ను ఓదార్చింది. లైఫ్ మస్ట్ గో ఆన్.. తరహా మాటలతో ఊరటనిచ్చింది. ఎక్కువసేపు వాళ్ల సమయం తీసుకోకుండా నమస్కారం చెప్పా..’అని ముగించింది. నిజమేమరి, ఎన్నికల ఫలితాలపై ఒబామా చెప్పినట్లు, సూర్యుడు ఉదయించక మానడు..
న్యూయార్క్ లోని హిల్లరీ ఇల్లు..