హెలికాప్టర్ కూలి 12 మంది దుర్మరణం
రియాద్ : సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలకు చెందిన హెలికాప్టర్ ఒకటి మంగళవారం యెమన్‌లో కూలిపోయిన ఘటనలో నలుగురు అధికారులు సహా 12 మంది సైనికులు దుర్మరణం చెందారు. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ పాటిస్ సౌదీ పర్యటనలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. యెమన్లోని మరిబ్ ప్రావిన్సులో తమ బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలిపోయిందని, ఇందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు యెమన్ రాజధాని సనాతో పాటు పలు నగరాలను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు అధ్యక్షుడు అబేద్ మన్సూర్‌కు మద్దతుగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ 10 వేల మంది ప్రజలు చనిపోగా, దాదాపు 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.