స్టార్టప్ లకు పన్ను దెబ్బ తగలనుందా...?
ముంబై : మార్కెట్ వాల్యుయేషన్ తక్కువున్న స్టార్టప్ లకు పన్ను దెబ్బ తగలనుంది. ఫండింగ్ లు ఎక్కువగా వస్తూ.. మార్కెట్ వాల్యుయేషన్ పెంచుకోలేని స్టార్టప్ లకు పన్నులు వేయాలని ఆదాయపు పన్ను విభాగం యోచిస్తోంది. మార్కెట్ వాల్యుయేషన్ పడిపోతున్న స్టార్టప్ లతో ఆదాయపు పన్ను విభాగం చర్చిస్తోందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో చాలా స్టార్టప్ కంపెనీలు వాల్యుయేషన్ పెంచుకోలేకపోతున్నాయి.. లాభాలు, వృద్ధితో పాటు పోటీని తట్టుకోలేక స్టార్టప్ లకి ఈ దెబ్బ తగులుతోంది. మార్కెట్లో ఇష్యూ చేసిన షేర్ల కంటే ఫేర్ వాల్యు ఎక్కువ కలిగిఉంటే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56 ప్రకారం పన్నులు విధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు స్టార్టప్ కంపెనీల వాల్యుయేషన్ పై ఆదాయపు పన్ను అధికారులు రిపోర్టులు నివేదించమని ఆదేశిస్తున్నారు.
సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా, ఏంజెల్ ఇన్వెస్టర్లు దగ్గర నమోదుకాని స్టార్టప్ లకు ఈ పన్ను ప్రభావం ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. ఆదాయపు పన్ను విభాగం ప్రతిపాదిస్తున్న ఈ పన్ను విధానంపై స్టార్టప్ కమ్యూనిటీ ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఈ ప్రతిపాదనపై ఆదాయపు పన్ను విభాగం నుంచి ఎలాంటి నోటీసులు అధికారికంగా జారీ కాలేదు. గతంలో చాలా స్టార్టప్ కంపెనీలు నల్లధనాన్ని ప్రీమియంకు ఆఫర్ చేస్తూ వైట్ మనీగా మార్చుకునే దుర్వినియోగాలకు పాల్పడినట్టు పన్ను అధికారులు చెప్పారు. ఈ దుర్వినియోగాలను దృష్టిలో ఉంచుకుని, మార్కెట్ వాల్యుయేషన్ పై దృష్టిసారించామని అధికారులు చెబుతున్నారు. రాండమ్ గా అడ్ జస్ట్ మెంట్లను తాము చూడటం లేదని, కానీ వాల్యుయేషన్‌లో పారదర్శకత కోల్పోతుండటం సీరియస్ గా తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే చాలా స్టార్టప్ కంపెనీలు పన్ను నోటీసులు అందుతాయేమోననే ఆందోళనతో, వారి కన్సల్టెన్సుతో, లాయర్లతో సంప్రదింపులు ప్రారంభించారు.