market trading
-
Saurabh Maurya: విజయ సౌరభం
మంచి ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ సొంతంగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలనేది సౌరభ్ మౌర్య కల. అయితే తన దగ్గర అమ్మ పంపించిన అయిదువేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొన్నాడు. స్టార్టప్‌లు స్టార్ట్ చేసి కోటీశ్వరుడిగా ఎదిగి, ఎంతోమందికి రోల్‌మోడల్ కావడానికి అవసరమైన ప్రయాణం ఈ సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ నుంచే మొదలైంది! ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్ అనే చిన్నగ్రామంలో పుట్టి పెరిగాడు సౌరభ్ మౌర్య. పేదరికంలో ఉన్నప్పటికీ తన పిల్లలను అప్పు చేసైనా పెద్ద చదువులు చదివించాలనుకునేవాడు తండ్రి. సౌరభ్ ఇద్దరు అన్నలు చదువులో మందుండేవారు. పై చదువుల కోసం వారిని బెనారస్‌కు పంపాడు తండ్రి. మొదటి ప్రయత్నంలో ఇద్దరు ‘ఐఐటీ–జెఇఇ’లో ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురు పిల్లలు పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలని కలలు కనేవారు తల్లిదండ్రులు. అయితే సౌరభ్ పరిస్థితి వేరు. తనకు పెద్ద ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనేది కల. కంప్యూటర్ స్టోర్ అనేది ఆ కలలలో ఒకటి. మొదటి ప్రయత్నంలో ‘ఐఐటీ– జెఇఇ’లో ఫెయిలయ్యాడు సౌరభ్. ‘నేను ఫెయిలయ్యాను అనే బాధ కంటే తల్లిదండ్రులను బాధ పెట్టాను అనే ఆలోచన నన్ను ఎక్కువగా బాధ పెట్టింది’ అంటున్న సౌరభ్ కష్టపడి చదివి రెండో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ఐఐటీ–బెనారస్ కాలేజీలోకి వెళ్లిన తరువాత తనకొక కొత్త ప్రపంచం పరిచయం అయింది. తనలాగే ఆలోచించే ఎంతోమందితో పరిచయం ఏర్పడింది. మరో వైపు ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతున్నాయి. జేబు ఖర్చుల కోసం 6–8 తరగతులకు ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. జేబుఖర్చుల మాట ఎలా ఉన్నా పోను పోను ‘బోధన’ అనేది తనకొక ప్యాషన్‌గా మారింది. తల్లి పంపించిన అయిదువేలతో సెకండ్‌హ్యాండ్ సెల్‌ఫోన్ కొనడంతో తన కెరీర్ మొదలు పెట్టడానికి మొదటి అడుగు పడింది. కొద్దిరోజులకు యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఐఐటీ–జెఇఇ పరీక్షలో విఫలమైన తాను రెండో ప్రయత్నంలో ఎలా విజయం సాధించింది మొదలు ఐఐటీకి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ యూట్యూబ్ చానల్ ద్వారా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చానల్‌కు మంచి ఆదరణ లభించడంతో సౌరభ్‌లో ఉత్సాహం వెల్లువెత్తింది. నాలుగు సంవత్సరాల అనుభవం తరువాత స్టాక్ మార్కెట్ ట్రేడర్‌గా సక్సెస్ అయ్యాడు. ‘ఐఐటీయన్ ట్రేడర్’ పేరుతో ట్రేడింగ్ స్ట్రాటజీస్, టెక్నికల్ ఎనాలసిస్...మొదలైన ఆన్లైన్ కోర్సులు ప్రారంభించి సక్సెస్ సాధించాడు. చిన్న వ్యాపారమైనా సరే, సొంతంగా మొదలుపెడితే చాలు అనుకున్న సౌరభ్ 11–12 తరగతుల విద్యార్థులు ‘ఐఐటీ–జెఇఇ’ లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన బలమైన పునాదిని ఏర్పాటు చేయడానికి ప్రారంభించిన ‘రైట్–ర్యాంకర్స్’ స్టార్టప్, ఆన్లైన్ స్టాక్‌మార్కెట్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘ఐఐటీయన్ ట్రేడర్స్’ సక్సెస్ సాధించి తనను 22 కోట్ల క్లబ్‌లోకి చేర్చాయి. ‘ఏదైనా సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు డబ్బు, వనరుల కొరత ఎప్పుడూ అడ్డంకి కాదు. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి’ అంటున్నాడు 22 సంవత్సరాల సౌరభ్ మౌర్య. -
ఇక అర్ధరాత్రి దాకా ట్రేడింగ్!!
న్యూఢిల్లీ: ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్ ట్రేడింగ్ వేళలను దాదాపు అర్ధరాత్రి దాకా పెంచుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ‘ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ వేళలను ఉదయం 9 నుంచి రాత్రి 11.55 దాకా పెంచుకునేందుకు స్టాక్ ఎక్స్చేంజిలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నాం‘ అంటూ సెబీ శుక్రవారం ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రస్తుతం కమోడిటీ డెరివేటివ్స్ విభాగం ట్రేడింగ్ వేళలు ఉదయం 10 నుంచి రాత్రి 11.55 దాకా ఉంటుండగా, ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ వేళలు ఉదయం 9.15 గం.ల నుంచి మధ్యాహ్నం 3.30 గం.ల దాకా మాత్రమే ఉంటున్నాయి. సెబీ నిర్ణయంతో ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ వేళలను మరో ఎనిమిది గంటల మేర పొడిగించుకునేందుకు స్టాక్ ఎక్సే్చంజీలకు వెసులుబాటు లభించినట్లవుతుంది. ఇటు స్టాక్స్, అటు కమోడిటీల ట్రేడింగ్ వేళలను అనుసంధానం చేసే ప్రయత్నాల్లో భాగంగా సెబీ తాజా నిర్ణయం తీసుకుంది. ఒకే ఎక్సే్చంజీలో ఈ రెండింటి ట్రేడింగ్‌ను ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రవేశపెట్టేలా సెబీ బోర్డు గత డిసెంబర్లో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కమోడిటీ డెరివేటివ్స్ ప్రస్తుతం ఎంసీఎక్స్, ఎన్సీడీఈఎక్స్లో మాత్రమే ట్రేడవుతున్నాయి. షరతులు వర్తిస్తాయ్.. ట్రేడింగ్ వేళల పొడిగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నియంత్రణ సంస్థ సెబీ... దీనికి కొన్ని షరతులను కూడా విధించింది. స్టాక్ ఎక్సే్చంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు సముచిత రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, మౌలిక సదుపాయాలను(ఇన్ఫ్రా)ను ఏర్పాటు చేసుకుంటేనే ట్రేడింగ్ వేళలు పెంచుకునేందుకు అనుమతి లభిస్తుందని స్పష్టం చేసింది. నిర్ణీత వేళలకు మించి టైమింగ్‌ను పెంచుకోదలచుకుంటే ముందుగా సెబీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. రిస్కు మేనేజ్మెంటు వ్యవస్థ, సెటిల్మెంట్ ప్రక్రియ, మానవవనరుల(సిబ్బంది) లభ్యత, సిస్టమ్ సామర్ధ్యం, పర్యవేక్షణ యంత్రాంగం మొదలైన వివరాలన్నింటితో కూడిన ప్రతిపాదనను స్టాక్ ఎక్సే్చంజీలు సమర్పించాల్సి ఉంటుంది. స్వాగతించిన ఎక్స్చేంజిలు.. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనకు ఆమోదముద్ర లభించడాన్ని స్టాక్ ఎక్సే్చంజీలు స్వాగతించాయి. దేశీ మార్కెట్లను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేసేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నాయి. భారతీయ క్యాపిటల్ మార్కెట్స్ మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడగలదని ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజి (ఐసీఈఎక్స్) ఎండీ సంజిత్ ప్రసాద్ తెలిపారు. ట్రేడింగ్ వేళల్లో వ్యత్యాసాల వల్ల దేశీ మార్కెట్లపై అంతర్జాతీయ పరిణామాలు .. ప్రతికూల ప్రభావాలు చూపే రిస్కులు కూడా తగ్గుతాయన్నారు. అయితే, పొడిగించే వేళలను కేవలం ఇండెక్స్ డెరివేటివ్స్‌కే పరిమితం చేయాలని, స్టాక్స్‌కు కూడా వర్తింపచేస్తే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్చంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాజేశ్ బాహేతి అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్స్‌కు ప్రయోజనకరం.. ట్రేడింగ్ వేళలు పెంచడం దేశీ ఇన్వెస్టర్లకు ప్రయోజనకరం. ప్రతికూలంగానైనా, సానుకూలంగానైనా ప్రభావితం చేసే పరిణామాలు ఉంటే ప్రస్తుతం మన ఇన్వెస్టర్లు తక్షణం స్పందించే పరిస్థితి లేదు. ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే.. సెబీ నిర్ణయం వల్ల పొజిషన్స్‌ను మరింత మెరుగ్గా హెడ్జింగ్ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం విదేశీ ఇన్వెస్టర్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటోంది. అక్టోబర్ 1 నుంచి ట్రేడింగ్ పరిమాణం మరింత పెరగవచ్చు. – విక్రమ్ లిమాయే, ఎన్ఎస్ఈ ఎండీ సానుకూల పరిణామం.. ట్రేడింగ్ వేళలు పెంచడమనేది సానుకూల పరిణామం. అంతర్జాతీయ మార్కెట్లు, దేశీ కమోడిటీ డెరివేటివ్ మార్కెట్స్‌కి అనుగుణంగా దేశీ మార్కెట్లు ట్రేడయ్యేందుకు ఇది దోహదపడుతుంది. అంతర్జాతీయంగా డెరివేటివ్ ఎక్సేంజీలు ఇప్పటికే ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. – ఆశీష్ కుమార్ చౌహాన్, బీఎస్ఈ చీఫ్ -
రూపాయికి ‘రేటింగ్’ బూస్ట్!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువకు ‘మూడీస్ రేటింగ్’ బలాన్నిచ్చింది. సాయంత్రం ఐదు గంటలతో ముగిసే ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్) మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి విలువ శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 31 పైసలు బలపడి 65.01 వద్ద ముగిసింది. గడిచిన వారం రోజుల్లో రూపాయికి ఇదే గరిష్ట స్థాయి. ఒకేరోజు రూపాయి ఈ స్థాయిలో బలపడటం ఆరు వారాల తరువాత ఇదే తొలిసారి. గురువారం రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 65.32. శుక్రవారం ఒక దశలో రూపాయి 64.60 స్థాయిని సైతం చూసింది. ఈ వారం మొత్తంలో రూపాయి విలువ 15 పైసలు బలపడింది. -
స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులు
సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపురోజైన గురువారం మార్కెట్లో ట్రేడింగ్ మందకొడిగా జరిగింది. ఈ నెలలో ఇప్పటికే 9 శాతం మార్కెట్ పెరిగిన నేపథ్యంలో ఫ్యూచర్ కాంట్రాక్టుల స్క్వేర్అప్ చేసుకోవడంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిమగ్నంకావడంతో రోజంతా స్వల్ప శ్రేణిలో స్టాక్ సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 19,826-19,997 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 37 పాయింట్ల లాభంతో 19,894 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5,865-5,918 పాయింట్ల మధ్య కదిలి, తుదకు 8 పాయింట్ల లాభంతో 5,882 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. బీహెచ్ఈఎల్ 5 శాతంపైగా ర్యాలీ జరపగా, సన్‌ఫార్మా 2.5 శాతం పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, గెయిల్‌లు 1 శాతం మేర నష్టాల్ని చవిచూసాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 172 కోట్లు నికర పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 362 కోట్ల నికర అమ్మకాలు నిర్వహించాయి. నిఫ్టీ ఫ్యూచర్లో రోలోవర్స్ జోరు... కార్పొరేట్ ఫలితాల సీజన్ అయిన అక్టోబర్ నెలలో భారీ హెచ్చుతగ్గులను అంచనావేస్తున్న ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులను పెద్దమొత్తంలో వచ్చేనెలకు రోలోవర్ చేసుకున్నారు. ఆగస్టు నెలలో మార్కెట్ నిలువునా పతనంకాగా, సెప్టెంబర్‌లో అనూహ్యమైన ర్యాలీ జరిపింది. అయితే అక్టోబర్ నెలలో హెచ్చుతగ్గుల తీవ్రత వుంటుందన్న అంచనాలతో షార్ట్, లాంగ్ పొజిషన్ల క్రియేషన్ అధికంగా జరిగింది. దాంతో అక్టోబర్ నిఫ్టీ కాంట్రాక్టులో ఈ ఒక్కరోజే 44 లక్షల షేర్ల ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) యాడ్ అయ్యింది. దాంతో మొత్తం ఓఐ 1.80 కోట్ల షేర్లకు చేరింది. సెప్టెంబర్ సిరీస్ ప్రారంభమయ్యే ముందురోజైన ఆగస్టు 29న ఈ నెల కాాంట్రాక్టు ఓఐ 1.46 కోట్ల షేర్లవరకే వుంది. బీహెచ్ఈఎల్ కౌంటర్లో భారీ బిల్డప్... సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ ప్రారంభానికి ముందు సేసా గోవా కౌంటర్లో జరిగిన తరహాలో అక్టోబర్ సిరీస్‌కు పీఎస్‌యూ షేరు బీహెచ్ఈఎల్ కౌంటర్లో భారీ బిల్డప్ క్రియేట్కావడంతో పాటు స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ డిస్కౌంట్‌తో ముగిసింది. గురువారం బీహెచ్ఈఎల్ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 53 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 3.02 కోట్లకు చేరింది. సెప్టెంబర్ సిరీస్ ప్రారంభసమయంలో ఈ కౌంటర్లో 2.34 కోట్ల షేర్ల బిల్డప్ మాత్రమే వుండేది. బీహెచ్ఈఎల్ వరుసగా రెండురోజులపాటు 15 శాతం ర్యాలీ జరిపింది. క్యాష్ మార్కెట్లో భారీ కొనుగోళ్లను సూచిస్తూ ట్రేడింగ్ పరిమాణం పెరిగింది. క్యాష్ మార్కెట్లో జరిపిన కొనుగోళ్లను మార్కెట్ హెచ్చుతగ్గుల సందర్భంగా పరిరక్షించుకునేందుకు ఫ్యూచర్ కాంట్రాక్టులను విక్రయించినట్లు (హెడ్జ్డ్ షార్ట్స్) బీహెచ్ఈఎల్ బిల్డప్ డేటా సూచిస్తున్నది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ధర రూ.5 డిస్కౌంట్‌తో ట్రేడయ్యింది.