స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులు
సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపురోజైన గురువారం మార్కెట్లో ట్రేడింగ్ మందకొడిగా జరిగింది. ఈ నెలలో ఇప్పటికే 9 శాతం మార్కెట్ పెరిగిన నేపథ్యంలో ఫ్యూచర్ కాంట్రాక్టుల స్క్వేర్‌అప్ చేసుకోవడంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిమగ్నంకావడంతో రోజంతా స్వల్ప శ్రేణిలో స్టాక్ సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 19,826-19,997 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 37 పాయింట్ల లాభంతో 19,894 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5,865-5,918 పాయింట్ల మధ్య కదిలి, తుదకు 8 పాయింట్ల లాభంతో 5,882 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. బీహెచ్‌ఈఎల్ 5 శాతంపైగా ర్యాలీ జరపగా, సన్‌ఫార్మా 2.5 శాతం పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, గెయిల్‌లు 1 శాతం మేర నష్టాల్ని చవిచూసాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 172 కోట్లు నికర పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 362 కోట్ల నికర అమ్మకాలు నిర్వహించాయి.
నిఫ్టీ ఫ్యూచర్లో రోలోవర్స్ జోరు...
కార్పొరేట్ ఫలితాల సీజన్ అయిన అక్టోబర్ నెలలో భారీ హెచ్చుతగ్గులను అంచనావేస్తున్న ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులను పెద్దమొత్తంలో వచ్చేనెలకు రోలోవర్ చేసుకున్నారు. ఆగస్టు నెలలో మార్కెట్ నిలువునా పతనంకాగా, సెప్టెంబర్‌లో అనూహ్యమైన ర్యాలీ జరిపింది. అయితే అక్టోబర్ నెలలో హెచ్చుతగ్గుల తీవ్రత వుంటుందన్న అంచనాలతో షార్ట్, లాంగ్ పొజిషన్ల క్రియేషన్ అధికంగా జరిగింది. దాంతో అక్టోబర్ నిఫ్టీ కాంట్రాక్టులో ఈ ఒక్కరోజే 44 లక్షల షేర్ల ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) యాడ్ అయ్యింది. దాంతో మొత్తం ఓఐ 1.80 కోట్ల షేర్లకు చేరింది. సెప్టెంబర్ సిరీస్ ప్రారంభమయ్యే ముందురోజైన ఆగస్టు 29న ఈ నెల కాాంట్రాక్టు ఓఐ 1.46 కోట్ల షేర్లవరకే వుంది.
బీహెచ్‌ఈఎల్ కౌంటర్లో భారీ బిల్డప్...
సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ ప్రారంభానికి ముందు సేసా గోవా కౌంటర్లో జరిగిన తరహాలో అక్టోబర్ సిరీస్‌కు పీఎస్‌యూ షేరు బీహెచ్‌ఈఎల్ కౌంటర్లో భారీ బిల్డప్ క్రియేట్‌కావడంతో పాటు స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ డిస్కౌంట్‌తో ముగిసింది. గురువారం బీహెచ్‌ఈఎల్ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 53 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 3.02 కోట్లకు చేరింది. సెప్టెంబర్ సిరీస్ ప్రారంభసమయంలో ఈ కౌంటర్లో 2.34 కోట్ల షేర్ల బిల్డప్ మాత్రమే వుండేది. బీహెచ్‌ఈఎల్ వరుసగా రెండురోజులపాటు 15 శాతం ర్యాలీ జరిపింది. క్యాష్ మార్కెట్లో భారీ కొనుగోళ్లను సూచిస్తూ ట్రేడింగ్ పరిమాణం పెరిగింది. క్యాష్ మార్కెట్లో జరిపిన కొనుగోళ్లను మార్కెట్ హెచ్చుతగ్గుల సందర్భంగా పరిరక్షించుకునేందుకు ఫ్యూచర్ కాంట్రాక్టులను విక్రయించినట్లు (హెడ్జ్‌డ్ షార్ట్స్) బీహెచ్‌ఈఎల్ బిల్డప్ డేటా సూచిస్తున్నది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ధర రూ.5 డిస్కౌంట్‌తో ట్రేడయ్యింది.