markets shutdown
-
ప్రపంచ మార్కెట్లకు యాపిల్ ‘కోత’!
స్టాక్ మార్కెట్ నష్టాలు గురువారం కూడా కొనసాగాయి. యాపిల్ కంపెనీ ఆదాయ అంచనాల తగ్గింపుతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం, ప్రభుత్వం రైతులకు ప్యాకేజీ ఇవ్వనున్నదన్న వార్తల నేపథ్యంలో ద్రవ్యలోటు మరింతగా విస్తరిస్తుందనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమనడం, డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం ప్రతికూల ప్రభావం చూపించాయి. నిఫ్టీ కీలకమైన 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. 120 పాయింట్లు తగ్గి 10,672 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 378 పాయింట్లు పతనమై 35,514 పాయింట్ల వద్ద ముగిసింది. లోహ, వాహన, బ్యాంక్ షేర్ల నష్టాలు రెండో రోజూ కొనసాగాయి. రైతులకు కేంద్రం ప్యాకేజీ ! యాపిల్ కంపెనీ తన ఆదాయ అంచనాల్లో కోత విధించింది. గత పన్నెండేళ్ల కాలంలో ఈ కంపెనీ ఆదాయ అంచనాలను తగ్గించడం ఇదే మొదటిసారి. దీంతో అమెరికా మార్కెట్ పతనం కాగా, గురువారం ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా నష్టపోయాయి. ఇది మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపించింది. రైతులకు ఒక్కో ఎకరానికి రూ.4,000 వరకూ ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వార్తలు హల్చల్ చేశాయి. ఫలితంగా ఖజానాపై భారీగా భారం పడనున్నదన్న ఆందోళనతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వచ్చే వారం నుంచి కంపెనీల క్యూ3 ఫలితాలు వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు, దేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకాలు జరపడం, ముడి చమురు ధరలు పెరగడంతో డాలర్‌తో రూపాయి మారకం మళ్లీ 70ను దాటిపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. 524 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 108 పాయింట్లు లాభపడింది. ఆసియా మార్కెట్ల నష్టాలు పెరగడంతో మన మార్కెట్ కూడా నష్టాల్లోకి జారిపోయింది. అమ్మకాలు కొనసాగడంతో ఒక దశలో 416 పాయింట్ల వరకూ నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 524 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 22 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 131 పాయింట్లు పతనమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌ల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సంబంధిత బ్యాంక్ షేర్లపై ప్రభావం చూపించింది. షేర్ల మార్పిడి నిష్పత్తి సరిగ్గా లేదన్న కారణంగా దేనా బ్యాంక్ 20% పతనమై రూ.14.40 వద్ద, విజయ బ్యాంక్ 7% తగ్గి రూ.47.60 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో పెరిగినప్పటికీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలాంటి మార్పు లేకుండా రూ.119.4 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.27 లక్షల కోట్లు ఆవిరైంది. మొత్తం 2 రోజుల్లో రూ.2.66 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఆదాయం తగ్గుతుంది: యాపిల్ చైనా మందగమనం యాపిల్ ఆదాయ అంచనాల కోతకు దారి తీసింది. యాపిల్ ఆదాయ అంచనాల కోత ప్రపంచ మార్కెట్ల నష్టాలకు దారితీసింది. ఐఫోన్లు తయారు చేసే యాపిల్ కంపెనీ ఈ ఏడాది తొలి క్వార్టర్ ఆదాయ అంచనాలను తగ్గించింది. తమ ఆదాయం 9,100 కోట్ల డాలర్ల నుంచి 8,400 కోట్ల డాలర్లకు తగ్గుతుందని యాపిల్ అంచనా వేసింది. చైనా, వర్ధమాన దేశాల్లో ఆర్థిక క్షీణత అంచనాల కంటే అధికంగా ఉండటంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. యాపిల్ కంపెనీ ఆదాయ అంచనాలను తగ్గించడం గత పన్నెండేళ్లలో ఇదే మొదటిసారి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ గ్యాడ్జెట్ల అమ్మకాలు తగ్గుతాయనే ఆందోళనను యాపిల్ వెలిబుచ్చింది. బుధవారం మార్కెట్ ముగిసిన తర్వాత కోత అంచనాలను యాపిల్ వెల్లడించింది. చైనాకు చెందిన హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మెంగ్ వాంఝూను కెనడాలో అరెస్ట్‌చేసి అమెరికా తరలించడం చైనాలో ఐఫోన్ అమ్మకాలపై ప్రభావం చూపగలదని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్‌కుక్ పేర్కొన్నారు. జాతీయవాద సెంటిమెంట్‌తో చైనీయులు ఐఫోన్లను కొనడం మానేసే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లకు తాజాగా రాసిన లేఖలో ఆయన తెలిపారు. ఈ కోత ప్రభావం గురువారం నాడు యాపిల్ షేర్‌పై తీవ్రంగానే పడింది. ఈ షేర్ ధర గురువారం ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 11.30) 10% క్షీణించి 142 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత ఏడాది ఈ షేర్ ఆల్ టైమ్ హై, 233 డాలర్లను తాకింది. అప్పటి నుంచి చూస్తే, దాదాపు 40 శాతం పతనమైంది. -
ప్రపంచ పరిణామాలు కీలకం..!
న్యూఢిల్లీ: అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లను పావు శాతం పెంచడం, ప్రభుత్వ షట్‌డౌన్ వంటి ప్రతికూల పరిణామాలు గతవారంలో అంతర్జాతీయ మార్కెట్లను కుంగదీశాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ గతవారంలో 1,655 పాయింట్లు (6.8 శాతం) పతనంకాగా, నాస్డాక్ 8.3 శాతం మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశీ సూచీలు సైతం భారీ పతనాన్ని నమోదుచేశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 10,754 వద్ద ముగిసింది. 10,800 మార్కును కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈవారం ప్రధాన సూచీలు ఏ దిశగా ప్రయాణం చేస్తాయనే అంశంపై మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన మరోసారి పాక్షికంగా స్తంభించడం.. అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండా, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెల్లడికాకుండానే కాంగ్రెస్ వాయి దా పడడం వంటి ప్రతికూలతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే విధంగా ఉన్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. వృద్ధి రేటు మందగించవచ్చని కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ చేసిన వ్యాఖ్యలు, ట్రంప్‌కు కాంగ్రెస్‌కు మధ్య కొనసాగుతున్న విభేదాలు, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించకపోవడం వంటి ప్రతికూలతలు ఈవారంలో ప్రభావం చూపనున్నట్లు భావిస్తున్నారు. ఇక గురువారం వెల్లడికానున్న నవంబర్ నెల గృహ నిర్మాణ, అమ్మకాల సమాచారం మరో కీలక అంశంగా ఉందని చెబుతున్నారు. కాగా, 25న(మంగళవారం) క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. సానుకూలంగా దేశీ పరిణామాలు అంతర్జాతీయ పరిణామాలు పూర్తి ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. దేశీయంగా మాత్రం సానుకూల అంశాలు కొనసాగుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ముడిచమురు ధరలు గతవారం 11 శాతం పతనం కావడం వల్ల కరెంట్ ఖాతా లోటు భారాన్ని తగ్గిస్తుంది. పారిశ్రామికోత్పత్తి ఊపందుకుంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచకుండా ఉండేందుకు సహకరిస్తోంది. ఈ పరిణామాలతో ఆర్బీఐ సైతం కఠిన వైఖరి నుంచి తటస్థ వైఖరికి మారింది. ఈ అంశాలు సూచీలకు సానుకూలంగా ఉన్నాయి.’ అని వ్యాఖ్యానించారు. క్రిస్మస్ కానుక కింద మధ్య తరగతి ప్రజలు వినియోగించే 23 వస్తు, సేవలపై పన్నును జీఎస్టీ మండలి తగ్గించడం మరో పాజిటివ్ అంశమన్నారాయన. అయితే, మరోవైపు డిసెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈ గురువారం ముగియనున్న కారణంగా అధిక ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 10,550 వద్ద కీలక మద్దతు.. ఈవారంలో నిఫ్టీకి 10,550 పాయింట్ల వద్ద కీలక మద్దతు స్థాయి ఉందని ప్రభుదాస్ లీలాధర్ టెక్నికల్ విశ్లేషకులు వైశాలి పరేఖ్ అన్నారు. ఈసూచీ కీలక నిరోధం 10,930 పాయింట్ల వద్ద ఉందని విశ్లేషించారు. ఎఫ్‌పీఐల నికర పెట్టుబడి రూ.4,000 కోట్లు డిసెంబర్ 3–21 మధ్యకాలంలో ఎఫ్‌పీఐలు రూ.3,884 కోట్లను నికరంగా పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల సమాచారం ద్వారా వెల్లడైంది. రూ.1,332 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్‌చేసిన వీరు రూ.2,552 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టినట్లు డేటా ద్వారా వెల్లడైంది. ముడి ధరలు తగ్గడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలపడిన కారణంగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఇదే విధంగా కొనసాగితే, ఏడాది చివర్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
సాంకేతిక సమస్యతో మూతపడ్డ బీఎస్ఈ సెన్సెక్స్
బీఎస్ఈ ఆగిపోయింది. వరుసగా రెండో రోజు కూడా సాంకేతిక సమస్య కారణంగా దాని ఇండెక్సులన్నీ నిలిచిపోయాయి. బుధవారం ఉదయం కొద్దిసేపు కనెక్టివిటీ సమస్య కారణంగా నిలిచిపోయి, మళ్లీ మొదలైంది. అయితే, గురువారం ఉదయం సెన్సెక్స్ 26 వేలకు సమీపంలో ఉండగా మళ్లీ కనెక్టివిటీ సమస్య తలెత్తడంతో స్టాక్ మార్కెట్లను మూసేయాలని బీఎస్ఈ నిర్ణయించింది. షేరు ధరలు, ఇండెక్సులు అన్నీ ఆగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హెచ్‌సీఎల్ బృందం కృషి చేస్తోందని.. సమస్య పరిష్కారం అయితే మళ్లీ మార్కెట్లు తెరుచుకుంటాయని బీఎస్ఈ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంట్రాడే ట్రేడర్లకు ఇది కాస్త చేదువార్తే అవుతుంది. బీఎస్ఈలో షేర్లను అమ్మడం, కొనడం చేసే ఇంట్రా డే ట్రేడర్లు ఇలా ట్రేడింగ్ ఆగిపోయినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అయితే.. ఇప్పటికే డెలివరీగా స్టాకులు ఉన్నవాళ్లు మాత్రం వాటిని ఎన్ఎస్ఈ లేదా ఎంసీఎక్స్-ఎస్ఎక్స్లో అమ్ముకోవచ్చు. కేవలం పావుగంట పాటు ట్రేడింగ్ జరిగిన తర్వాత సెన్సెక్స్ ఆగిపోయింది. ఉదయం 9.53 గంటల సమయంలో మార్కెట్లు మూతపడ్డాయి.