సాంకేతిక సమస్యతో మూతపడ్డ బీఎస్ఈ సెన్సెక్స్
బీఎస్ఈ ఆగిపోయింది. వరుసగా రెండో రోజు కూడా సాంకేతిక సమస్య కారణంగా దాని ఇండెక్సులన్నీ నిలిచిపోయాయి. బుధవారం ఉదయం కొద్దిసేపు కనెక్టివిటీ సమస్య కారణంగా నిలిచిపోయి, మళ్లీ మొదలైంది. అయితే, గురువారం ఉదయం సెన్సెక్స్ 26 వేలకు సమీపంలో ఉండగా మళ్లీ కనెక్టివిటీ సమస్య తలెత్తడంతో స్టాక్ మార్కెట్లను మూసేయాలని బీఎస్ఈ నిర్ణయించింది. షేరు ధరలు, ఇండెక్సులు అన్నీ ఆగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హెచ్సీఎల్ బృందం కృషి చేస్తోందని.. సమస్య పరిష్కారం అయితే మళ్లీ మార్కెట్లు తెరుచుకుంటాయని బీఎస్ఈ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇంట్రాడే ట్రేడర్లకు ఇది కాస్త చేదువార్తే అవుతుంది. బీఎస్ఈలో షేర్లను అమ్మడం, కొనడం చేసే ఇంట్రా డే ట్రేడర్లు ఇలా ట్రేడింగ్ ఆగిపోయినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అయితే.. ఇప్పటికే డెలివరీగా స్టాకులు ఉన్నవాళ్లు మాత్రం వాటిని ఎన్ఎస్ఈ లేదా ఎంసీఎక్స్-ఎస్ఎక్స్లో అమ్ముకోవచ్చు. కేవలం పావుగంట పాటు ట్రేడింగ్ జరిగిన తర్వాత సెన్సెక్స్ ఆగిపోయింది. ఉదయం 9.53 గంటల సమయంలో మార్కెట్లు మూతపడ్డాయి.