స్టాక్ మార్కెట్ నష్టాలు గురువారం కూడా కొనసాగాయి. యాపిల్ కంపెనీ ఆదాయ అంచనాల తగ్గింపుతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం, ప్రభుత్వం రైతులకు ప్యాకేజీ ఇవ్వనున్నదన్న వార్తల నేపథ్యంలో ద్రవ్యలోటు మరింతగా విస్తరిస్తుందనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమనడం, డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం ప్రతికూల ప్రభావం చూపించాయి. నిఫ్టీ కీలకమైన 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. 120 పాయింట్లు తగ్గి 10,672 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 378 పాయింట్లు పతనమై 35,514 పాయింట్ల వద్ద ముగిసింది. లోహ, వాహన, బ్యాంక్ షేర్ల నష్టాలు రెండో రోజూ కొనసాగాయి.
రైతులకు కేంద్రం ప్యాకేజీ !
యాపిల్ కంపెనీ తన ఆదాయ అంచనాల్లో కోత విధించింది. గత పన్నెండేళ్ల కాలంలో ఈ కంపెనీ ఆదాయ అంచనాలను తగ్గించడం ఇదే మొదటిసారి. దీంతో అమెరికా మార్కెట్ పతనం కాగా, గురువారం ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా నష్టపోయాయి. ఇది మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపించింది. రైతులకు ఒక్కో ఎకరానికి రూ.4,000 వరకూ ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వార్తలు హల్‌చల్ చేశాయి. ఫలితంగా ఖజానాపై భారీగా భారం పడనున్నదన్న ఆందోళనతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వచ్చే వారం నుంచి కంపెనీల క్యూ3 ఫలితాలు వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు, దేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకాలు జరపడం, ముడి చమురు ధరలు పెరగడంతో డాలర్‌తో రూపాయి మారకం మళ్లీ 70ను దాటిపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
524 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్
సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 108 పాయింట్లు లాభపడింది. ఆసియా మార్కెట్ల నష్టాలు పెరగడంతో మన మార్కెట్ కూడా నష్టాల్లోకి జారిపోయింది. అమ్మకాలు కొనసాగడంతో ఒక దశలో 416 పాయింట్ల వరకూ నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 524 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 22 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 131 పాయింట్లు పతనమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌ల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సంబంధిత బ్యాంక్ షేర్లపై ప్రభావం చూపించింది. షేర్ల మార్పిడి నిష్పత్తి సరిగ్గా లేదన్న కారణంగా దేనా బ్యాంక్ 20% పతనమై రూ.14.40 వద్ద, విజయ బ్యాంక్ 7% తగ్గి రూ.47.60 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో పెరిగినప్పటికీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలాంటి మార్పు లేకుండా రూ.119.4 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.27 లక్షల కోట్లు ఆవిరైంది. మొత్తం 2 రోజుల్లో రూ.2.66 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది.
ఆదాయం తగ్గుతుంది: యాపిల్
చైనా మందగమనం యాపిల్ ఆదాయ అంచనాల కోతకు దారి తీసింది. యాపిల్ ఆదాయ అంచనాల కోత ప్రపంచ మార్కెట్ల నష్టాలకు దారితీసింది. ఐఫోన్లు తయారు చేసే యాపిల్ కంపెనీ ఈ ఏడాది తొలి క్వార్టర్ ఆదాయ అంచనాలను తగ్గించింది. తమ ఆదాయం 9,100 కోట్ల డాలర్ల నుంచి 8,400 కోట్ల డాలర్లకు తగ్గుతుందని యాపిల్ అంచనా వేసింది. చైనా, వర్ధమాన దేశాల్లో ఆర్థిక క్షీణత అంచనాల కంటే అధికంగా ఉండటంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. యాపిల్ కంపెనీ ఆదాయ అంచనాలను తగ్గించడం గత పన్నెండేళ్లలో ఇదే మొదటిసారి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ గ్యాడ్జెట్‌ల అమ్మకాలు తగ్గుతాయనే ఆందోళనను యాపిల్ వెలిబుచ్చింది. బుధవారం మార్కెట్ ముగిసిన తర్వాత కోత అంచనాలను యాపిల్ వెల్లడించింది.
చైనాకు చెందిన హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మెంగ్ వాంఝూను కెనడాలో అరెస్ట్‌చేసి అమెరికా తరలించడం చైనాలో ఐఫోన్ అమ్మకాలపై ప్రభావం చూపగలదని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్‌కుక్ పేర్కొన్నారు. జాతీయవాద సెంటిమెంట్‌తో చైనీయులు ఐఫోన్లను కొనడం మానేసే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లకు తాజాగా రాసిన లేఖలో ఆయన తెలిపారు. ఈ కోత ప్రభావం గురువారం నాడు యాపిల్ షేర్‌పై తీవ్రంగానే పడింది. ఈ షేర్ ధర గురువారం ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 11.30) 10% క్షీణించి 142 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత ఏడాది ఈ షేర్ ఆల్ టైమ్ హై, 233 డాలర్లను తాకింది. అప్పటి నుంచి చూస్తే, దాదాపు 40 శాతం పతనమైంది.
Comments
Please login to add a commentAdd a comment