న్యూఢిల్లీ: అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లను పావు శాతం పెంచడం, ప్రభుత్వ షట్‌డౌన్ వంటి ప్రతికూల పరిణామాలు గతవారంలో అంతర్జాతీయ మార్కెట్లను కుంగదీశాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ గతవారంలో 1,655 పాయింట్లు (6.8 శాతం) పతనంకాగా, నాస్‌డాక్ 8.3 శాతం మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశీ సూచీలు సైతం భారీ పతనాన్ని నమోదుచేశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 10,754 వద్ద ముగిసింది. 10,800 మార్కును కోల్పోయింది.
ఈ నేపథ్యంలో ఈవారం ప్రధాన సూచీలు ఏ దిశగా ప్రయాణం చేస్తాయనే అంశంపై మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన మరోసారి పాక్షికంగా స్తంభించడం.. అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండా, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెల్లడికాకుండానే కాంగ్రెస్ వాయి దా పడడం వంటి ప్రతికూలతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే విధంగా ఉన్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు.
వృద్ధి రేటు మందగించవచ్చని కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ చేసిన వ్యాఖ్యలు, ట్రంప్‌కు కాంగ్రెస్‌కు మధ్య కొనసాగుతున్న విభేదాలు, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించకపోవడం వంటి ప్రతికూలతలు ఈవారంలో ప్రభావం చూపనున్నట్లు భావిస్తున్నారు. ఇక గురువారం వెల్లడికానున్న నవంబర్ నెల గృహ నిర్మాణ, అమ్మకాల సమాచారం మరో కీలక అంశంగా ఉందని చెబుతున్నారు. కాగా, 25న(మంగళవారం) క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు.
సానుకూలంగా దేశీ పరిణామాలు
అంతర్జాతీయ పరిణామాలు పూర్తి ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. దేశీయంగా మాత్రం సానుకూల అంశాలు కొనసాగుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ముడిచమురు ధరలు గతవారం 11 శాతం పతనం కావడం వల్ల కరెంట్ ఖాతా లోటు భారాన్ని తగ్గిస్తుంది. పారిశ్రామికోత్పత్తి ఊపందుకుంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచకుండా ఉండేందుకు సహకరిస్తోంది.
ఈ పరిణామాలతో ఆర్‌బీఐ సైతం కఠిన వైఖరి నుంచి తటస్థ వైఖరికి మారింది. ఈ అంశాలు సూచీలకు సానుకూలంగా ఉన్నాయి.’ అని వ్యాఖ్యానించారు. క్రిస్మస్ కానుక కింద మధ్య తరగతి ప్రజలు వినియోగించే 23 వస్తు, సేవలపై పన్నును జీఎస్‌టీ మండలి తగ్గించడం మరో పాజిటివ్ అంశమన్నారాయన. అయితే, మరోవైపు డిసెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈ గురువారం ముగియనున్న కారణంగా అధిక ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
10,550 వద్ద కీలక మద్దతు..
ఈవారంలో నిఫ్టీకి 10,550 పాయింట్ల వద్ద కీలక మద్దతు స్థాయి ఉందని ప్రభుదాస్ లీలాధర్ టెక్నికల్ విశ్లేషకులు వైశాలి పరేఖ్ అన్నారు. ఈసూచీ కీలక నిరోధం 10,930 పాయింట్ల వద్ద ఉందని విశ్లేషించారు.
ఎఫ్‌పీఐల నికర పెట్టుబడి రూ.4,000 కోట్లు
డిసెంబర్ 3–21 మధ్యకాలంలో ఎఫ్‌పీఐలు రూ.3,884 కోట్లను నికరంగా పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల సమాచారం ద్వారా వెల్లడైంది. రూ.1,332 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్‌చేసిన వీరు రూ.2,552 కోట్లను డెట్ మార్కెట్‌లో పెట్టుబడిపెట్టినట్లు డేటా ద్వారా వెల్లడైంది. ముడి ధరలు తగ్గడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలపడిన కారణంగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఇదే విధంగా కొనసాగితే, ఏడాది చివర్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment