Maro Charitra
-
నల్ల పిల్ల హీరోయినా..?
ఇది వెండితెర వెనకాల కథ ఏ ఇంటి అమ్మాయికీ జరగకూడని కథ ఇప్పటివరకూ బయటపడని కథ మగాహంకారం కప్పేసిన కథ ఒక మహిళకు ఉన్న పోరాట గుణం చెప్పే కథ సరైన కథ.. మరో సరిత కథ. వెండితెరపై అద్భుతంగా నటించే సరిత తెర మీద కనిపించే వేరే నటీమణుల పాత్రలకు తెరవెనక తన గొంతుతో ప్రాణం పోస్తుంటారు. ‘మరో చరిత్ర’ ఆమె తొలి చిత్రం. నటిగా 40 ఏళ్లు. 150కి పైగా సినిమాలు, ఎందరో నటీమణులకు డబ్బింగ్.. సరిత ఇప్పుడు తెర మీద కనిపించకపోయినా వినిపిస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ వేడుకలో పాల్గొనడానికి దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమెతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ‘మరో చరిత్ర’లాంటి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమా ద్వారా కథానాయికగా పరిచయమయ్యారు. ఈ రిజల్ట్‌ని ఊహించే వయసు కాదు కాబట్టి ఆశ్చర్యపోయి ఉంటారేమో? సరిత: నిజమే. టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆ సినిమా చేశాను. సినిమా అంటే ఏంటో తెలియదు. ఇక హిట్, ఫ్లాప్ గురించి తెలియని ఏజ్, స్టేజ్. బాలచందర్‌గారితో చేసిన ఆ సినిమా నాకో మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ సక్సెస్ పెద్ద సర్ప్రైజ్. రోజులు కాదు.. సంవత్సరాలు ఆడింది. అలాంటి హిట్ మళ్లీ నా కెరీర్లో రాలేదు. లవ్ స్టోరీస్ అంటే ‘మరోచరిత్ర’లా ఉండాలి అన్నట్లు ఆ సినిమా ఓ బెంచ్‌మార్క్ అయిపోయింది. ఇప్పటికీ ఆ సినిమాలోని సన్నివేశాలను కొన్ని సినిమాల్లో వాడటం భలే అనిపిస్తుంది. అసలు బాలచందర్‌గారి కళ్లలో ఎలా పడ్డారు? మా నాన్నగారు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా, ఫైనాన్షియర్‌గా ఉండేవారు. రైటర్ గణేశ్ పాత్రోగారు మా నాన్నగారికి ఫ్రెండ్. ఆయనోసారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నా. నేను స్కూల్ నుంచి వచ్చి, షూస్ విప్పి లోపలకు వెళ్లిపోయాను. గణేశ్‌గారు మా నాన్నగారిని ‘పాప యాక్ట్ చేస్తుందా? బాలచందర్‌గారు హీరోయిన్ కోసం చూస్తున్నారు. కొత్తమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికి 160 మందిని చూశారు’ అని మా నాన్నగారితో అన్నారట. నాకప్పుడు పధ్నాలుగేళ్లే అయినా వయసుకి మించి కనిపించేదాన్ని. గణేశ్‌గారు నాకు పదహారేళ్లు ఉంటాయనుకున్నారు. మా నాన్న నన్ను పిలిచి, ‘యాక్ట్ చేస్తావా?’ అని అడిగితే, ‘నో’ అన్నాను. ఆయన వెళ్లిపోయాక నాన్నగారు ‘ఇది కమల్‌హాసన్ పిక్చర్’ అన్నారు. నా ముఖం బల్బ్‌లా వెలిగిపోయింది. ఒప్పుకున్నాను. మర్నాడు స్కూల్‌కు సెలవు పెట్టి షాపింగ్‌కు వెళ్లాం. చీర, బ్లౌజ్ కొనడానికి. అది కట్టుకుని ఆడిషన్స్‌కి వెళ్లాలనుకున్నాను. మోడ్రన్ డ్రెస్‌లో వెళ్లాలని ఎందుకు అనుకోలేదు? అంతకుముందు చీర కట్టుకునే అలవాటు ఉందా? చీర అలవాటు లేదు. అయితే మామూలు డ్రెస్‌లో చిన్నపిల్లలా కనిపిస్తే హీరోయిన్ లుక్ లేదని సెలక్ట్ చేయరనుకున్నా. అంతకుముందు ‘అనార్కలి’ అనే సినిమాకు టెస్ట్ చేసి చిన్నపిల్లలా ఉన్నానని తీసుకోలేదు. రిజెక్షన్ అంటే నాకు ఇష్టం ఉండదు. అప్పటికి ‘మరోచరిత్ర’ కోసం 160 మందిని చూశారు. వాళ్లలా రిజెక్ట్ కాకూడదనుకున్నాను. నాకింకా గుర్తు. ‘పర్ఫెక్ట్ టైలర్స్’ అనే టైలరింగ్ షాప్ ఉండేది. అక్కడే నా ఫస్ట్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. చీర కట్టుకుని, నేను నచ్చకుండా ఉండకూడదు అనే ఫీలింగ్‌తో వెళ్లాను. యన్టీఆర్గారి మేకప్‌మేన్ పీతాంబరంగారే మేకప్ చేశారు. బాలచందర్‌గారు ఆడిషన్ చేశారు. సెలక్ట్ అయ్యాను. అయితే ఫస్ట్‌డే సజావుగా సాగలేదు. ఏమైంది? కమల్‌హాసన్‌గారి చేతిని ముద్దుపెట్టుకుని, ‘ఏం? తప్పా?’ అని అడగాలి. అప్పుడు ఆయన ‘ముద్దు పెట్టుకున్న చోటే తప్పు’ అంటారు. నేను సిగ్గుపడుతున్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అది రాలేదు. 7 టేక్స్ అయ్యాయి. మా నిర్మాతగారు నన్ను పంపించడానికి టికెట్స్ బుక్ చేయడానికి వెళ్లిపోయారు. సాయంత్రం బాలచందర్‌గారి అసోసియేట్ అనంత్ నాతో ‘కమల్ అంటే ఇష్టమేనా? అని అడిగారు. ‘చాలా’ అన్నాను. ‘అది ఫేస్‌లో చూపించాలి’ అన్నారు. మర్నాడు షూటింగ్లో కమల్‌గారి మీద ఉన్న ఇష్టాన్ని ముఖంలో చూపించాను. సీన్ ఓకే అయింది. ‘మరోచరిత్ర’కు మిమ్మల్ని తీసుకున్నప్పుడు ‘నల్ల పిల్ల హీరోయినా?’ అనే కామెంట్స్ వినబడ్డాయి. మీరేమైనా హర్ట్ అయ్యారా? అలా అన్నారని రియాక్ట్ అవ్వాలని కూడా తెలియదు. సినిమా రిలీజయ్యాక అమ్మాయి వల్లే పిక్చర్ రన్ అవ్వడం లేదు. తనే మైనస్ అని రాశారు. కానీ సెకండ్ వీక్‌కు ఈ అమ్మాయే ఈ సినిమాకు ప్లస్ అన్నారు. యాక్చువల్‌గా హిందీ రీమేక్‌లోనూ కమల్‌హాసన్‌గారు నన్నే చేయమన్నారు కూడా. ఆ సంగతలా ఉంచితే నాకు ఫెయిర్‌గా ఉండేవాళ్లంటే ఇష్టం. కానీ తర్వాత నా రంగే నాకు ప్లస్ అని, టాలెంటే ముఖ్యం అనితెలుసుకున్నాను. రిజెక్షన్ అంటే ఇష్టపడనన్నారు. ఒకవేళ ‘మరో చరిత్ర’కు సెలక్ట్ కాకపోయుంటే? చదువుకునేదాన్ని. అయితే ‘మరో చరిత్ర’ తర్వాత ఇక నాకు చదువుకునే అవకాశం దక్కలేదు. ఎనిమిదో తరగతితోనే చదువు అయిపోయింది. అందుకే మా పిల్లలను బాగా చదివిస్తున్నాను. సౌందర్య, విజయశాంతి, నగ్మా, రమ్యకృష్ణ, సిమ్రాన్, టబు, నదియా.. ఇలా చాలా మందికి డబ్బింగ్ చెప్పారు.. చెబుతున్నారు. అసలు డబ్బింగ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? డబ్బింగ్ జర్నీ బ్యూటిఫుల్ అంటాను. ఫస్ట్ దాసరి నారాయణరావుగారు స్టార్ట్ చేశారు. ‘గోరింటాకు’ పిక్చర్‌కు అడిగారు. అందులో సావిత్రిగారికి డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్‌కి నన్ను ఎందుకు అడుగుతున్నారా? అనుకున్నాను. నా వాయిస్ బాగుంటుందని, డబ్బింగ్ బాగా చెబుతానని నాకు నేను తెలుసుకోవడానికి టైమ్ పట్టింది. సౌందర్య, విజయశాంతి, నగ్మా వాళ్లైతే సరిత డబ్బింగ్ చెబితే బావుంటుందని నా పేరుని సూచించేవారు కూడా. డైరెక్ట్‌గా కాల్ చేసి ‘సరూ.. చెప్పు’ అని అడిగేవారు. హీరోయిన్గా మూడు షిఫ్ట్స్ పని చేసినప్పటికీ రాత్రంతా కూర్చుని డబ్బింగ్ చెప్పేదాన్ని. టఫ్‌గా ఉండేది. కానీ స్నేహితుల కోసమే కదా అని హ్యాపీగా అనిపించేది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. డబ్బింగ్ పూర్తి స్థాయి ప్రొఫెషన్ అయింది. పెళ్లి తర్వాత బ్రేక్ ఎందుకు తీసుకున్నారు? నేను కావాలని తీసుకున్న నిర్ణయం అది. నా పిల్లల్ని ఆయాలకు వదిలేసి, పని చేయలేను. యాక్టింగ్ అంటే 100 శాతం, డబ్బింగ్ అంటే 100 శాతం.. ఇలా ఏ పని చేసినా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను. మా అబ్బాయికి పది నెలల వయసప్పుడు ‘కుట్టయేట్టన్’ అనే మలయాళ సినిమా చేశాను. బాబుకు పాలు పట్టి రండి అని బ్రేక్స్ కూడా ఇచ్చేవాళ్లు. కానీ నా వర్క్‌ని ఎంజాయ్ చేయలేకపోయాను. బిడ్డకు, పనికి నా బెస్ట్ ఇవ్వడం లేదనే ఫీలింగ్ కలిగింది. బాబు ఏం చేస్తున్నాడో అనే ఆలోచన. ఇదే నా లాస్ట్ సినిమా అని నిర్ణయించేసుకున్నాను. అలా బ్రేక్ తీసుకున్నందుకు పశ్చాత్తాపం ఏమైనా? లేదు. యాక్టింగ్‌కు బ్రేకిచ్చినా సినిమాలకు టచ్‌లోనే ఉన్నాను కదా. డబ్బింగ్ చెబుతూనే ఉన్నాను. అయితే కొన్ని మంచి సబ్జెక్ట్స్ మిస్సయ్యాను. వాటిలో తమిళంలో ‘మగళిర్ మట్టుమ్’ (తెలుగులో ‘ఆడవాళ్లకు మాత్రమే’) అనే సినిమా ఒకటి. కమల్‌హాసన్ అయితే ‘వాహినీ స్టూడియోలో ఊయల పెట్టిస్తాను. నువ్వు మాత్రం ఈ సినిమా చేయాల్సిందే’ అన్నారు. నేను మ్యానేజ్ చేయలేనని చెప్పాను. ‘నీకింకా పదిరోజులు టైమ్ ఇస్తాను ఆలోచించుకో’ అని లండన్ వెళ్లిపోయారు. అక్కడినుండి ఫోన్ చేశారు. అప్పుడు నో అన్నాను. తిట్టేశారు. ‘ఇలా అనుకుంటే నువ్విక వర్క్ చేయలేవు’ అని కోప్పడ్డారు (నవ్వుతూ). భర్త (మలయాళ నటుడు ముఖేష్) సపోర్ట్ చేస్తే స్త్రీలకు వాళ్ల వృత్తిలో కొనసాగడం సులువు అవుతుంది. మీ భర్త సహకారం అందలేదా? మా ఆయన సపోర్ట్ అస్సలు లేదు. ముఖేష్‌గారు, మీరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా? నాకు ఆయన కరెక్ట్ కాదు. ఆ తర్వాత తెలిసింది. ఆప్యాయత, అనురాగాలు ఏం లేవు మా మధ్యలో. దేవుడు నాకు బంగారం లాంటి ఇద్దరి పిల్లల్ని ఇచ్చాడు. అది చాలని అనుకుంటున్నాను. ఆయన మీద డిపెండ్ కూడా అవ్వడం లేదు. ఎందుకంటే బాధ్యతలు పంచుకోవడంలో ఆయనెప్పుడూ మాతో లేరు. మనసులు కలవలేదనే విడాకులు తీసుకున్నారా? నాకు డైవర్స్ ఇవ్వకుండానే ఆయన వేరే పెళ్ళి చేసుకున్నాడు. ఫ్రాడ్ చేసి డైవర్స్ పేపర్స్ తీసుకున్నాడు. మేమిద్దరం సెలబ్రిటీలం. డైవర్స్ తీసుకున్నా, డైవర్స్‌కు అప్లై చేసినా కచ్చితంగా మీడియాలో వస్తుంది. కానీ మేమిద్దరం విడాకులు తీసుకోవాలనుకుంటున్నామని, తీసుకున్నామని న్యూస్ వచ్చిందా? ఎందులోనూ రాలేదు. ఒకవేళ నేను ఈ విషయం మీద కేసు పెడితే ఏడేళ్లు జైలులో ఉండిపోతాడు. కానీ అలా చేయలేను. ఎందుకంటే నేను ఏ లాయర్‌ను అపాయింట్ చేసుకున్నా వాళ్లను కొనేస్తున్నాడు. ఎవరూ నిలబడలేదు. నిలబడనివ్వలేదు. నాకు ఇలా జరిగిందనే బాధకంటే ఈ వ్యవస్థ ఇలా ఉన్నందుకు ఎక్కువ బాధ కలిగింది. మన పిల్లలు ఈ సమాజం నుంచి ఏం నేర్చుకుంటారు? అనే బాధ. ఈ సిస్టమ్ తప్పుని తప్పు అని ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే ఆయన చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన్ని ఏమీ చేయలేం. నువ్వు నన్ను కేరళాలో ఏమీ చేయలేవు అని డైరెక్ట్‌గా చాలెంజ్ కూడా విసిరాడు. దాంతో ఆ విషయాన్ని దేవుడికి వదిలేశాను. నా ఇద్దరు కొడుకులే నా ధైర్యం. పిల్లలకు బాధ లేదా? ఉండకుండా ఎలా ఉంటుంది? కానీ వాళ్లు నాతోనే ఉండాలనుకున్నారు. నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. వాళ్ల కోసం బతుకుతున్నాను. నా బాధ అంతా సెలబ్రిటీస్‌కే ఇలా ఉంటే మామూలు అమ్మాయిల పరిస్థితి ఏంటి? మీడియాను కూడా తనవైపే తిప్పుకుంటున్నాడు. కేరళలో ఉన్న ఓ ప్రముఖ దినపత్రిక వాళ్లు నన్ను ఓ 5 గంటలు ఇంటర్వ్యూ చేశారు. మా పిల్లలతో కూడా మాట్లాడారు. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి కాల్ చేసి మా ఎడిటర్‌గారికి మీ ఆయన ఫోన్ చేశారు అని చెప్పింది. ఆ ఇంటర్వ్యూ బయటకు రాదని అర్థమైంది. ఇంటర్వ్యూ బయటకు రాకూడదని ఎందుకు అంటారు? తప్పు వాళ్ల వైపు ఉండబట్టే కదా. ఆయన లా చదువుకున్నాడు. ఆయన క్లాస్మేట్స్ అందరూ లాయర్లు, జడ్జీలు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సంఘటన వల్ల పిల్లలను పెంచే విధానంలో ఏదైనా మార్పు వచ్చిందా? మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి మనం మన పిల్లలను పెంచుతాం. నా జీవితం నాకిప్పటి వరకూ నేర్పిన పాఠాలను పిల్లల పెంపకానికి ఉపయోగిస్తున్నాను. అయితే సిస్టమ్‌ను నేనెలా మార్చగలను? పెళ్లి విషయంలో నాకు జరిగినది తెలుసుకుని, ‘మమ్మీ.. డబ్బులుంటే న్యాయాన్ని కొనేయొచ్చుగా’ అంటున్నారు. అది ఎంత ప్రమాదకరమైన ఆలోచన? ఆ ఆలోచనతో పిల్లలు పెరగకూడదు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణిలో ఉంటారు. మేం మాట్లాడుకున్న లాయర్ వాళ్ల వైపు వెళ్లేసరికి మా పిల్లలు బాగా అప్సెట్ అయ్యారు. ఆ టైమ్‌లో నేను కూడా అలా అయిపోతే పిల్లలు వీక్ అవుతారు. అందుకే నా బాధను బయటకు చూపించలేదు. ఎందుకంటే ఏం జరిగినా ధైర్యంగా ఉండాలని వాళ్లు నేర్చుకోవాలనుకున్నా. ఇప్పుడు కూడా పిల్లల కోసం దుబాయ్‌లోనే ఉంటున్నారు. సినిమా చాన్సులు వస్తే? నా పిల్లలు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. నా ఫస్ట్ ప్రయారిటీ వాళ్లే. ఒక అబ్బాయి డాక్టర్, రెండో అబ్బాయి ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. నా జీవితాన్ని సంపూర్ణం చేసేది వాళ్లే కాబట్టి నేనూ పిల్లలతోపాటు దుబాయ్‌లో ఉంటున్నాను. మంచి సినిమాకి అవకాశం వస్తే షూటింగ్ చేసి మళ్లీ వెళ్లిపోతాను. ఒక్కసారి మళ్లీ మేకప్ వేసుకుంటే బ్యాక్ ఆన్ ట్రాక్‌లా ఉండాలి. అంత మంచి క్యారెక్టర్ రావాలి. ఎందులో అయినా కాంప్రమైజ్ అవుతాను కానీ పాత్ర విషయంలో కాంప్రమైజ్ కాను. ఇప్పటికీ డబ్బింగ్ చెబుతున్నాను. మీ పిల్లలకు సినిమాల మీద ఆసక్తి ఉందా? ఉంది. కచ్చితంగా వస్తారు. ఇద్దరూ ఆరడుగుల పైనే ఉంటారు. హీరోలుగానే వస్తారు. ఈ ఏడాదిలోనే వద్దాం అనుకుంటున్నారు. దేవుడి దయ వల్ల మంచి బ్రేక్ రావాలి. వ్యక్తిగతంగా పెళ్లి విషయంలో చేదు అనుభవం ఎదురైంది. వృత్తిపరంగా ఏమైనా? కెరీర్‌వైజ్‌గా అలాంటిదేం లేదు. కానీ ఇప్పుడు కొందరు ఆర్టిస్టులు చేదుఅనుభవాలు ఎదురయ్యాయని చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బాధగా కూడా ఉంది. ఆ రోజుల్లో పని వాతావరణం ఎలా ఉండేది? ప్రతి ఒక్కరూ వేరేవాళ్లను గౌరవించుకునేవాళ్లం. షూటింగ్లో ఒక్కచోటే కూర్చునేవాళ్లం. ఇప్పుడు ఎవరి కార్‌వ్యాన్‌లో వాళ్లు ఉంటున్నారు. డబ్బింగ్ చెబుతూ ఇంకా ఇండస్ట్రీతో టచ్‌లోనే ఉన్నాను కాబట్టి ఈ మార్పులు తెలుస్తున్నాయి. మద్రాస్‌లో వాహినీ, ఏవీయం స్టూడియోస్‌లో ఎక్కువగా షూటింగ్స్ జరిగేవి. ఎవరి షూటింగ్లో వాళ్లు ఉన్నా లంచ్ టైమ్‌లో కలిసేవాళ్లం. శ్రీదేవి అమ్మగారైతే లంచ్ ప్రిపేర్ చేసి, దేవుడికి నైవేద్యం పెట్టి మా అందరికీ కలిపి ముద్దలు పెట్టేవారు. అంత బాగుండేవాళ్లం. మీకు వంట వచ్చా? షూటింగ్స్‌కు వండి తీసుకెళ్లిన సందర్భాలున్నాయా? బాగా వచ్చు. ‘అర్జున్’ సినిమా అప్పుడు బిర్యానీ చేశాను. దర్శకుడు గుణశేఖర్‌గారి దగ్గర ‘మధ్యాహ్నం ఆవిడను వదిలేయండి .. మనకు బిర్యానీ వండి పెడతారంట’ అని ప్రకాశ్ రాజ్‌గారు పర్మిషన్ ఇప్పించారు. మహేశ్ కూడా టేస్ట్ చేశారు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? సావిత్రిగారు. సినిమాల్లోకి రాకముందు నేను ఆవిడ సినిమాలు ఎక్కువగా చూడలేదు. తమిళంలో పని చేసేటప్పుడు చాలామంది నన్ను ఆవిడతో పోల్చేవారు. సావిత్రిలా.. అంటూ నా గురించి రివ్యూస్‌లో రాసేవారు. దాంతో ఆవిడ సినిమాలన్నీ చూడటం మొదలెట్టాను. అప్పుడు ఆవిడ ఏ రేంజ్ యాక్టరో అర్థం అయింది. ఆమె అంత పేరు రాకపోయినా కొంచెం అయినా తెచ్చుకోవాలనుకునేదాన్ని. ఆవిడ లైఫ్‌ను చూసి మీరు నేర్చుకున్నదేంటి? ఆవిడ గురించి వినడమే తప్ప నేను సావిత్రిగారి జీవితాన్ని చూడలేదు. ‘గోరింటాకు’ సినిమాలో ఆమె చేసిన పాత్రకు డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమాలో ఆవిడ లుక్ మారిపోయింది. బాధ అనిపించింది. నటిగా, వ్యక్తిగా అద్భుతమైన మనిషి సావిత్రిగారు. కానీ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆవిడ జీవితం తెలుసుకున్నాక ఈ విషయం నా మనసులో నాటుకుపోయింది. ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఎవరితో కష్టసుఖాలు షేర్ చేసుకుంటారు? నాకు అందరూ ఫ్రెండ్సే. ఆనందం, బాధ రెండూ నేనే పంచుకుంటాను. నా పెళ్లి విషయాలు షేర్ చేసుకోవడం సిగ్గనిపించింది. దేవుడున్నాడని నమ్ముతారా? కచ్చితంగా. ఏదో పవర్ ఉందని నమ్ముతాను. నేను సాయిబాబా భక్తురాలిని. మద్రాస్‌లో మైలాపూర్‌లో సాయిబాబా గుడి ఉంది. అక్కడకు తరచూ వెళ్లేదాన్ని. షిరిడీకి కూడా వెళుతుంటాను. కష్టాల్లో బాబా తోడుంటాడని నమ్ముతాను. ‘అర్జున్’లో విలనిజమ్ షేడ్ ఉన్న అత్త పాత్ర చేసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ చేయడానికి సంకోచించాను. ఆ తర్వాత ఆ టీమ్ నన్ను కన్విన్స్ చేసింది. మహేశ్‌బాబు, గుణశేఖర్గార్ల కాంబినేషన్ అంటే చిన్న విషయం కాదు. కథ, నా పాత్ర బాగుంటాయి. నటిగా నా పర్ఫార్మెన్స్ మీద నాకు నమ్మకం ఉంది. అయితే అంత బాగా విలనిజమ్ పండించగలనని ‘అర్జున్’ చేసిన తర్వాతే తెలిసింది (నవ్వుతూ). తమిళ సినిమా ‘అగ్ని సాక్షి’లో పాట పాడారు. ఆ తర్వాత సింగర్‌గా కంటిన్యూ కాలేదేం? నేను సింగర్‌ని అవుదామనుకున్నాను. అయితే ట్రైన్డ్ సింగర్ కాదు. అందుకే కంటిన్యూ కాలేదు. ఇప్పుడంటే పాటలో ఒకటీ రెండూ లైన్లు కూడా పాడిస్తున్నారు. అప్పుడు పాట అంటే ఫుల్ సాంగ్ పాడాల్సిందే. ఫైనల్లీ ఇప్పుడు మీకు మీరే అండ.. పిల్లలకు మీరే అండ. ఎలా ఉన్నారు? హెల్త్ బావుంటే అంతా సెట్ అవుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేవు. పాజిటివ్‌గా ఉంటాను. ఫైనాన్షియల్‌గా ఆహా ఓహో అని చెప్పను కానీ మాకు సరిపడినంత ఉన్నాయి. ఐయామ్ హ్యాపీ. – డి.జి. భవాని -
నేను... స్వప్న... ప్రసాద్
ఇన్నాళ్లూ నేనేమిటో నాకు తెలియజెప్పడానికి చాలామంది ట్రై చేసినా ఈ మట్టిబుర్రకి అర్థం కాలేదు. కానీ... నిన్న ఓ చూపు చూసి, ఓ నిట్టూర్పు విడిచి ‘స్వప్న’అలా అనేసరికి ‘నేనేంటో’ తెలిసొచ్చింది! స్వప్న ఏం అన్నదో చెప్పాలంటే... ముందు ‘స్వప్న’ గురించి చెప్పాలి! స్వప్న గురించి చెప్పాలంటే, ‘ప్రసాద్’ గురించి చెప్పాలి! ప్రసాద్ గురించి చెప్పాలంటే, నా గురించి చెప్పాలి! నా గురించి చెప్పాలంటే ముప్ఫై ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అవి తెలుగుతెరను నలుగురు అగ్రహీరోలు నాలుగు వైపుల నుంచి అప్రతిహతంగా ఏలుతున్న రోజులు! ఆ సమయంలో... అంతులేని కథ, మరో చరిత్ర, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం అంటూ నాలుగు వైపుల నుంచి విరుచుకుపడ్డాడు బాలచందర్! సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య నలిగిపోతున్న ఆ సంధి కాలపు రోజుల్లో అప్పటి మా యువతకు పై సినిమాల ప్రభావాన్ని తట్టుకోవడం కష్టమైంది కానీ... ‘మరో చరిత్ర’ ప్రభావం నుంచి బయట పడటం దాదాపు అసాధ్యమైంది! అజ్ఞానం, ఆకలి, నిరుద్యోగం, నిస్సహాయతల మధ్య నలిగిపోతున్న సమాజానికి మా వంతుగా ఏదైనా చేయాలని, సమాజాన్ని సమూలంగా మార్చి ‘మరో చరిత్ర’ సృష్టించాలన్న కసితో మొదలుపెట్టాం ‘మరో చరిత్ర’ ట్యూషన్ సెంటర్లు! అప్పటికింకా విద్య వ్యాపారంగా అభివృద్ధి (?) చెందకపోవడంతో స్కూల్ ముగిసిన వెంటనే పిల్లలు ఇప్పట్లా రెసిడెన్షియల్ బోనుల్లో కాకుండా వీధుల్లో ఉండేవారు! సాయంత్రం అయ్యేసరికి పిల్లల కేరింతలతో వీధులు దద్దరిల్లిపోతుంటే, పెద్దలు పిల్లల్ని మురిపెంగా కోప్పడుతుండేవారు! ముందుగా పిల్లల్ని తద్వారా పెద్దల్ని సంస్కరించాలన్న తాపత్రయంతో మా యువత అంతా కలిసి సాయంత్రం అయిదు నుంచి ఎనిమిది గంటల వరకూ అన్ని తరగతుల వారికీ ఉచితంగా ట్యూషన్లు చెప్పేవాళ్లం! అప్పటికి ఇరవై, ఇరవై రెండు మధ్యనున్న నేను, మా యువతకు లీడర్ని! అప్పుడు మాతో కలిశాడు... ప్రసాద్! మా ఊరి పిల్ల జమీందార్! రాచరికం పోయి ప్రజాస్వామ్యానికి బాటలు పరిచిన మొదటి దశాబ్దానికి చివరి ప్రతినిధి అయిన ప్రసాద్, వెనకా ముందూ ఏమీ లేకపోయినా సమాజానికి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్న మమ్మల్ని చూసి ఆకర్షితుడై, మాతో చేరి, వాళ్ల దివాణం అరుగుమీద ట్యూషన్లు చెప్పుకోమనడమే కాక, రోజూ మాకు కాఫీ, టిఫిన్లు కూడా ఏర్పాటు చేశాడు! వాడు మాత్రం పాఠాలు చెప్పడానికి ప్రయత్నించలేదు. ఇలా జరుగుతుండగా ఒకరోజు... ‘మా తమ్ముణ్ని కూడా ట్యూషన్లో చేర్చుకోండి’ అంటూ వచ్చింది స్వప్న! వెండితెరను చీల్చుకుని బయటకు వచ్చినట్లుగా... నా కలలలోంచి నేరుగా నడచి వచ్చినట్లుగా... ఆమె అసలు పేరు తెలియదు కానీ... ‘మరో చరిత్ర’ హీరోయిన్లా ఉండటంతో ఆ పేరే ఫిక్సయిపోయాన్నేను! చెప్పడం మరిచా! చిన్నప్పుడు బంతిలా ఉండేవాణ్నట. అందుకని నన్నందరూ ‘బాలూ’ అని పిలుస్తారు! స్వప్న... పద్దెనిమిదికి అటూ ఇటూగా వయసు... నేరేడు పండు నిగారింపుతో, నల్ల కలువను తెల్ల రేకులో చుట్టినట్లు, తెల్ల చీరలో నుదుట బొట్టు లేకుండా ఉంది! వాళ్ల నాన్న రైల్వేలో చిరుద్యోగట! తల్లి లేదు. ఆరుగురి పిల్లల్లో తనే పెద్ద. ట్రాన్స్ఫర్ నిమిత్తం ఈ ఊరు వచ్చారట. స్వప్నకు సంవత్సరం కిందటే పెళ్లయిందట! అయినా మూడు నెలలకే ‘అన్నీ’ అయిపోయాయట! ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లుగా చెప్పిందే కానీ, జరిగినదానికి ఏమీ బాధ పడుతున్నట్లు లేదు. రోజూ తమ్ముడి వెంట వచ్చే స్వప్న, తనూ క్లాసులు తీసుకొనేది. పది వరకూ చదివిందట! ఆశయాల గురించి, ఆదర్శాల గురించి మాతో ధైర్యంగా చర్చిస్తుండేది! అప్పుడే నిర్ణయించుకున్నాను - పెళ్లంటూ చేసుకుంటే స్వప్ననే చేసుకోవాలని! కానీ నా ఆశ, ఆశయం అమలు కాకుండా పెళ్లికెదిగిన నా చెల్లెళ్లు! కులాంతరం. అందునా వితంతు వివాహం చేసుకుంటే, నా ఆశయం సిద్ధిస్తుంది కానీ, ఆ ప్రభావం నా చెల్లెళ్ల పెళ్లిళ్లపై పడుతుందని ధైర్యం చేయలేకపోయాను. కానీ స్వప్నకు న్యాయం జరగాలి. ఆమెకు కొత్త జీవితం రావాలి! ఎలా?! ఆలోచించాను... ఎస్. ప్రసాద్! ఆర్థికంగాను, సామాజికంగాను బలమైన కుటుంబం! మమ్మల్ని చూసి వాడూ ఆశయాలపై మోజు పెంచుకుంటున్నాడు. అందుకే ఓ శుభోదయాన వాణ్ని కలిసి - ‘‘స్వప్న గురించి నీ అభిప్రాయం ఏమిటి?’’ అంటే, ‘‘సదభిప్రాయమే’’ అన్నాడు ప్రశ్నార్థకంగా. ‘‘అయితే, స్వప్నను పెళ్లి చేసుకోవచ్చు కదా’’ అన్నాను. చిరాగ్గా మొహం పెట్టి, ‘‘అదేదో నువ్వే చేసుకోవచ్చు కదా’’ అన్నాడు పెడసరంగా! నేను నా బాధ్యతల గురించి చెప్పాను. దానికి వాడు నావైపొకసారి వింతగా చూసి, ‘‘ఆదర్శాలు పాటించడం అంటే వాటిని వల్లె వేయడం కాదు. ప్రతికూల పరిస్థితుల్లో ఎదురీదడం. పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తి తనకుమాలిన ధర్మం భుజాన వేసుకోకు. అన్నట్లు నా మేనకోడలితో నా పెళ్లి నిశ్చయమైంది’’ అంటూ విసవిసా వెళ్లిపోయాడు! వెధవ! ఆస్తులు బయటకు పోకుండా కాపాడుకోవడానికి మేనరికం చేసుకుంటున్నాడు. ఆ సాయంత్రం స్వప్నతో ప్రసాద్గాడి నిర్వాకం గురించి చెప్పిన నాకు, స్వప్న ప్రతిస్పందన ఇంకా విచిత్రంగా అనిపించింది! ‘‘నా పెళ్లి విషయం నిన్నెవరు మాట్లాడమన్నారు బాలూ. అతను ఒప్పుకున్నా, నేనెలా ఒప్పుకుంటాననుకొన్నావ్?’’ ఇంచుమించు ప్రసాద్‌లానే ప్రతిస్పందించింది! తర్వాత ప్రసాద్గాడి పెళ్లయిపోయి, పెళ్లాం ద్వారా వచ్చిన ఆస్తులు చూసుకోవడానికి మద్రాసు వెళ్లిపోయాడు. ‘మరో చరిత్ర’ వేడి తగ్గిపోయింది. మా ట్యూషన్ సెంటర్ పలచబడింది. ఓ రోజు రాత్రి ఎనిమిదౌతుందనుకొంటా. వసారాలో కూర్చొని షార్ట్‌హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తున్న నా దగ్గరకు వచ్చింది స్వప్న! వాళ్ల నాన్నకు ట్రాన్స్ఫర్ అయిందని, ఊరు వదిలి పోతున్నామని చెప్పింది. ఆ తర్వాత స్వప్న కనపడదు అన్న భావనకు గుండె బరువెక్కింది. ఇన్నాళ్లూ తన తమ్ముడికి ట్యూషన్ చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పి, వెళ్లబోతూ ఒక్కసారిగా వెనుదిరిగి, నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని, నా పెదాలను చుంబించి, వేగంగా వెళ్లిపోయింది. ఒక్కసారిగా నా మెదడు అచేతనమైంది! నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొన్నప్పుడు, ఎడం చేత్తో ఆమె నడుం పట్టుకొని, కుడి చేతిలోనికి ఆమె శిరస్సు తీసుకొని... చాలాసార్లు అనుకొన్నాను. ఏం చెయ్యను! నేను పెరిగిన వాతావరణం నా చేతులను కట్టేసింది. తర్వాత నాకు ఉద్యోగం రావడం, మా పెద్ద చెల్లి పెళ్లి, మా నాన్నగారు పోవడం, నేను పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. స్వప్న జాడ తెలియదు. ప్రసాద్గాడు తన ఆస్తులు చూసుకోవడానికి అప్పుడప్పుడూ వస్తుండేవాడు. అప్పుడే నా జీవితంలో ఊహించని దెబ్బ తగిలింది! నేను ఎంతో జాగ్రత్తగా పెంచిన మా మూడో చెల్లి ప్రేమ వివాహం చేసుకుని పోతే, నేను ఏరి కోరి చేసిన పెళ్లి కాదని, రెండో చెల్లి నా దగ్గరకు వచ్చేసింది. నా చెల్లికి చాలావిధాలుగా నచ్చజెప్పాను. ఆ అబ్బాయిని కూడా కలిశాను. ఇద్దరూ మొండి ఘటాలే. ఒక్కటే సమాధానం - ‘తమ అభిప్రాయాలు వేరట!’ ‘అయినా సర్దుకుపోవాలని’ నేనంటే, ‘‘మేమేం శత్రువులం కాదన్నయ్యా. మా మనసులు కలవలేదు. విడిగా ఉందామనుకొంటున్నాం. అయినా నీ దగ్గర ఉండనులే. సిటీలో జాబ్‌కి ట్రై చేస్తున్నాను. వస్తూ పోతాను’’ అంది. దాన్ని డిగ్రీ చదివించి ఎంత తప్పుచేశానో అర్థమైంది! ఈ దెబ్బ నుండి కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది నాకు. ఈసారి ఊహించని షాక్ మా ఆవిడ ఇచ్చింది! రోజులాగే ఆఫీస్ నుంచి వచ్చిన నాకు, ‘నేను మా ఇంటికి పోతున్నాను’ అన్న మా ఆవిడ లెటర్ చూసి ఒళ్లు జలదరించింది! నా అనుమతి లేనిదే గడప దాటడానికి సాహసించని నా భార్య... పిల్లాణ్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది! వెంటనే నేను వెళ్లేసరికి గుమ్మంలో కూర్చుని బాబుకి పాలు పడుతోంది. ‘‘ఏమిటీ పిచ్చి పని. పద.’’ ‘‘ఎక్కడికి?’’ అంది అర్థం కానట్లు! ‘‘ఎక్కడికేంటి? మనింటికి.’’ ‘‘ఇది నా ఇల్లే.’’ ‘‘నీకేవన్నా పిచ్చి పట్టిందా?’’ కోపాన్ని ఆపుకోవడం కష్టంగా ఉంది నాకు! ‘‘వదిలింది. అందుకే వచ్చేశాను’’ కూల్‌గా అంది. చాచిపెట్టి కొట్టాను. అంతే! ‘‘ఇది నా ఊరు. ఇక్కడంతా నా జనాలు. మీ మర్యాద దక్కాలంటే హద్దుల్లో ఉండటం మంచిది’’ అంది. ‘‘ప్లీజ్. నీకే ఇబ్బందీ రానివ్వను’’ ‘‘ఇబ్బందులున్నాయని అన్లేదే! మీతో ఉండటం ఇష్టం లేదు’’ స్థిరంగా అంది. ‘‘నాతో ఉండటం ఇష్టం లేనప్పుడు, నా కొడుకుని ఎందుకు తెచ్చుకున్నావ్?’’ ‘‘రేపు జడ్జిగారికి ఓ మాట చెప్పి...’’ రాక్షసి తెగించింది. ఆడది ఏ మాటకు విలవిల్లాడుతుందో ఆ బాణం వదిలాను. ‘‘అంతగా రానంటున్నావ్. ఇక్కడ ఎవణ్నయినా మరిగావా?’’ ఆ మాటకు ఒక్కసారిగా రోషంతో ముక్కుపుటాలెగరేస్తూ నావైపు చూసి, ‘‘అవును. ఇన్నాళ్లకు నాకో మగాడు దొరికాడు’’ పిల్లాణ్ని చంక మార్చుకుంటూ అని మొహం మీదే తలుపు వేసేసింది! * చూస్తుండగానే కాలం ఇంకొన్ని సంవత్సరాలు మింగేసింది! ఓ రోజు ప్రసాద్ ఓ వంద మంది పిల్లల్ని తీసుకుని వేసవి సెలవుల నిమిత్తం మా ఊరు వచ్చాడు. ఏదో ట్రస్ట్ కూడా పెట్టాడట. ట్యాక్స్ ఎగవేత కోసమేమో! విషయం ఏంటో తెలుసుకుందామని వాడింటికి వెళ్లాను. వాడు, వాడి భార్య సాదరంగా ఆహ్వానించారు. వృద్ధాశ్రమం కూడా ఉందట. భోజనాల సమయం కావడంతో వాడి భార్య మా ఇద్దరికీ వడ్డిస్తుంటే, ప్రసాద్ ఆమెతో ‘‘తిన్నాడా?’’ అని అడిగాడు ఎవర్నో ఉద్దేశించి! ‘లేదంటూ’ లోపలికి వెళ్లి, ఓ ఐదేళ్ల పసివాణ్ని తీసుకొచ్చింది. అన్నం తినకుండా అలిగాడట. గిటార్ కొనాలట! వచ్చిన విజిటర్స్ నుంచి డొనేషన్లు వసూలు చేయడానికి ఇదో పద్ధతేమో! ప్రసాద్ ఆ పసివాణ్ని బుజ్జగిస్తూ, ‘‘నువ్వు చిన్నపిల్లాడివి కదా. పెద్దయ్యాక కొంటాను. అన్నం తిను’’ అన్నాడు. విననట్లు తల తిప్పేశాడు పిల్లాడు. బంగారు రంగులో బాలకృష్ణునిలా ఉన్న పసివాణ్ని చూస్తే ముచ్చటేసింది. ‘‘నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే, గిటార్ కొనిస్తాను’’ అన్నాను. వాడు నావైపు చూసి, ‘‘మా క్లాస్‌కి నేనే ఫస్ట్’’ అన్నాడు కొంచెం గర్వంగా! ఆ మాటకు ప్రసాద్ నవ్వుతూ, ‘‘సర్లే. రేపు కొంటాను. అన్నం తిను’’ అన్నాడు. మెరుస్తున్న కళ్లతో పిల్లాడు ప్రసాద్‌ను చూస్తూ, ‘ప్రామిస్’ అని చెయ్యి చాపాడు. ‘‘ఆ డబ్బు నేనిస్తాను’’ అన్నాను పిల్లాడి చేతిలో చెయ్యి వేసి! ‘‘తీసుకెళ్లి అన్నం పెట్టు’’ అంటూ పిల్లాణ్ని ఆయాకు అప్పగించాడు ప్రసాద్! ఆ పసివాణ్ని చూసిన తన్మయత్వంలో నేను, ప్రసాద్‌ను ‘‘నీకెంతమంది పిల్లలు?’’ అని అడిగాను. దానికి వాడు చిన్నగా నవ్వుతూ, ‘‘పిల్లలు వద్దనుకొన్నాం బాలూ. మొదటి నుంచీ మా ఇద్దరికీ సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉండేది. మేం ప్రేమించుకోవడానికి అదో కారణం. అందుకే పెళ్లయిన వెంటనే కుటుంబ నియంత్రణ చేయించుకొన్నాం’’ అన్నాడు. నాకు షాకింగ్‌గా ఉంది. నా అంచనా తప్పుతోంది! ‘‘పిల్లలు లేకపోవడం ఏమిటి? డజను మంది మనవలు కూడా ఉన్నారు. నా పిల్లలు ఇప్పుడు విదేశాల్లో కూడా ఉన్నారు తెలుసా?’’ మొహంలో ఆనందం తొణికిసలాడుతుండగా చెప్తోంది ప్రసాద్ భార్య! భోజనాల తర్వాత, నేను గిటార్ డబ్బుకు చెక్కు ఇవ్వబోతుంటే, ‘‘డొనేషన్లు తీసుకోం బాలూ. కేవలం మా ఆస్తులతోనే వీటిని రన్ చేయాలనుకున్నాం’’ గర్వంగా చెబుతున్న వాడి కళ్లలో ఏదో చైతన్యం! మాటల సందర్భంలో స్వప్న కనిపించిందని, రైల్వేలో జాబు చేస్తోందని చెప్పాడు. నా గుండె గొంతులోకి వచ్చినట్లయింది! ‘‘పెళ్లయిందా?’’ ఆతృతగా అడిగితే, ‘‘తెలీదు’’ అన్నాడు ఆ విషయానికి అంత ప్రాముఖ్యం లేనట్లు! నాకు వెంటనే స్వప్నను చూడాలని ఉంది. వాడి దగ్గర అడ్రెస్ తీసుకుని వెతుక్కుంటూ వెళ్లాను. స్వప్నే తలుపు తీసింది. మనిషి ఏం మారలేదు కానీ, తల కొంచెం నెరసి హుందాగా ఉంది. ఆశ్చర్యంతో రిసీవ్ చేసుకుంది! తండ్రి పోయిన తర్వాత ఆ ఉద్యోగం ఆమెకు ఇచ్చారట. చెల్లెళ్లని, తమ్ముళ్లని చదివించి, అందరికీ పెళ్లిళ్లు చేసిందట. ప్రస్తుతం ఇక్కడే ఒంటరిగా ఉంటోందట! జీవన సాగరాన్ని ఈదిన పరిణతి ఆమె మొహంలో ప్రతిఫలిస్తోంది. ‘‘పెళ్లి చేసుకోలేదేం?’’ అని అడిగితే, ‘‘ఆ ఊహే రాలేదు... ఈ పనులలో పడి’’ అంది నవ్వుతూ. నా గురించి పూర్తిగా చెప్పి, ‘‘మనం పెళ్లి చేసుకుందామా?’’ అడిగాను. నా కళ్లలోకి చూసి నవ్వుతూ, ‘‘నువ్వేం మారలేదు బాలూ’’ అంది. ‘‘అది కాదు. అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని గ్రహించలేకపోయాను.’’ ‘‘నువ్వింకా అక్కడే ఉన్నావా బాలూ? తలచుకొంటే ఇప్పుడు సిల్లీగా ఉంటోంది. ఇంత జీవితం గడిపాక, వెనక్కి చూసుకుంటే ఆ భావాలు, ప్రేమలు, పెళ్లిళ్లు... ఎంత అల్ప విషయాలో తెలుస్తోంది.’’ ఆడదై ఉండి ఒంటరి జీవితం గడుపుతున్న స్వప్నను చూసి, నేనెందుకు ఒంటరిగా ఉండలేను అనిపించి వచ్చేశాను. అలా ఒంటరితనానికి అలవాటుపడిన నా దగ్గరకు ఓ రోజు మా రెండో చెల్లి వచ్చింది. మాటల సందర్భంలో, ‘‘మొన్న ఆఫీస్ నుండి వస్తుంటే, వదిన కనిపించింది. ఇంటికి తీసుకెళ్లి టీ పెట్టి ఇచ్చింది’’ అంది. నాకు చాలా కోపం వచ్చింది. ‘‘అది ఇంటికి పిలిస్తే వెళతావా? తను నన్ను కాదని పోయింది తెలుసా?’’ ‘‘మీ ఇద్దరికీ పొసగలేదు. విడిపోయారు. మధ్యలో మాకు శతృత్వం ఏమిటి? అయినా మా విడాకుల విషయంలోనూ నువ్వు ఇలానే స్పందించావ్. ప్రతి ఒక్కరినీ నీ కోణంలోంచి చూడటం మానుకో అన్నయ్యా’’ అంది. నా కళ్ల ముందు పుట్టిన పిల్ల నాకు తత్వం బోధిస్తుంటే, బాధగా అనిపించింది. ఓ విధమైన విరక్తితో మిగిలిన జీవితాన్నైనా ప్రశాంతంగా గడుపుదామని ప్రసాద్ ఆశ్రమంలో చేరడానికి వెళ్లాను. నన్ను రిసీవ్ చేసుకొన్న ఆయా - ‘‘సార్ ఢిల్లీ వెళ్లారు. మేడమ్‌ను పిలుస్తాను కూర్చోండి’’ అని లోపలికి వెళ్లింది. గోడకి ఉన్న మదర్ థెరిస్సా ఫొటో చూస్తూ కూర్చున్నాను. కర్టెన్ తొలగించుకుంటూ కాళ్లకి మెట్టెలు, మెళ్లో సూత్రాలతో నిండు ముత్తయిదువలా గదిలోకి ప్రవేశించింది... స్వప్న! ఒక్కసారిగా షాకయ్యాను. ‘‘చెప్పండి’’ అంటూ నన్ను చూసి ఆశ్చర్యపోయి, ‘‘ఏంటి ఇలా వచ్చావ్?’’ అంది ప్రసాద్ కూర్చునే సీట్లో కూర్చుంటూ. గోడకి ఉన్న మదర్ థెరిస్సా ఫొటో చూస్తూ కూర్చున్నాను. కర్టెన్ తొలగించుకుంటూ కాళ్లకి మెట్టెలు, మెళ్లో సూత్రాలతో నిండు ముత్తయిదువలా గదిలోకి ప్రవేశించింది... స్వప్న! ఒక్కసారిగా షాకయ్యాను. ‘‘నువ్వేంటి ఇక్కడ?’’ నా గొంతు పొడిబారుతోంది. ‘‘ప్రసాద్‌ని పెళ్లి చేసుకున్నాను.’’ బాంబ్ పేలినట్లుగా వినబడింది నాకు! ‘‘నెలరోజుల కిందట ప్రసాద్ భార్య చనిపోయింది. చాలా రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. అంతిమ సంస్కారాలు చేయవద్దనీ, తన శరీరాన్ని ఏదైనా హాస్పిటల్‌కు దానం చేయమనీ ఆమె కోరడంతో ఎవరికీ చెప్పలేదు.’’ ‘‘మరి ప్రసాద్ నిన్ను చేసుకోవడమేంటి?’’ ‘‘ప్రసాద్ నన్ను చేసుకోలేదు. నేనే ప్రసాద్‌ని చేసుకున్నాను.’’ రెంటికీ తేడా అర్థం కాని నేను, ‘‘నీకు పెళ్లి ఇష్టం లేదనీ, అది చాలా స్వల్ప విషయం అన్నావ్’’ అన్నాను. అందుకామె నావైపు నిర్లిప్తంగా చూస్తూ, ఓ నిట్టూర్పు విడిచి, ‘‘నువ్వు మారవు బాలూ’’ అంది. జీవితంలో మొదటిసారి నాకు, నా గురించి తెలిసింది! - . దొడ్డిగల్లు నారాయణరావు