![Greatest Love Story Movie in Tollywood: Valentine Day Special Story](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/kamal.jpg.webp?itok=6RGNPAce)
‘ప్రేమ కోసమై వలలో పడెనె పాపం పసివాడు’ అని ‘పాతాళభైరవి’ సినిమా ప్రేమను వినిపించినా మనవారు తలకెక్కించుకోలేదు. ‘మల్లీశ్వరి’, ‘దేవదాసు’ ప్రేమకథల ట్రెండ్‌ను కొనసాగించలేదు. 1965 తర్వాతే ప్రేమ అనే మాట వెండితెర మీద ఎక్కువగా వినిపించింది. 1980ల నాటికి ప్రేమ సినీ ప్రేక్షకుల బ్లడ్‌గ్రూపుల్లో ఒకటిగా స్థిరపడింది. ‘మరో చరిత్ర’(Maro Charitra) ఇందుకు ఒక కారణమైతే ‘ప్రేమాభిషేకం’(Premaabhishekam) మరో కారణం. వాలెంటైన్స్ డే(Valentine Day) సందర్భంగా ప్రేమరీలు ఫ్లాష్‌బ్యాక్.
‘మనసు గతి ఇంతే...’ అని ఆత్రేయ రాశాడుగాని ‘ప్రేమ గతి ఇంతే’ అని రాయలేదు. తెలుగు సినిమాల్లో చాలా కాలం ప్రేమకు బదులుగా ‘మనసు’, ‘మమత’ అనే మాటలే ఉండేవి. ‘మూగ మనసులు’, ‘తేనె మనసులు’... ప్రేమకథలే. వాటిని ‘మూగ ప్రేమలు’, ‘తేనె ప్రేమలు’ అనలేదు.
‘మల్లీశ్వరి’ కళాత్మక ప్రేమకథ. కానీ దాని సెట్టింగ్ వర్తమానంలో లేదు. ‘పాతాళభైరవి’ ప్రేమ కథే. అయితే అది జానపద కథై కూచుంది. ‘దేవదాసు’కు మించిన ప్రేమ కథ ఏముంది? ఇది వర్తమానంలో ఉన్నా సందేశం పరమ చేదైన నిషా కావడంతో ‘ప్రేమ’ మాటెత్తితే ఎక్కడ కుర్రాళ్లు దేవదాసులైపోతారోనని జనం దడుచుకునేవారు. తెలుగు సినిమా రంగం తన కథల్లో కుటుంబంలో ఉండే ప్రేమ గురించి, దాని చుట్టూ ఉండే డ్రామా గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టింది. దానికి కారణం ఇద్దరు సూపర్‌స్టార్‌లు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌లు భిన్న పాత్రలు, కథాంశాలతో ముందుకు సాగుతుండటమే.
అదీగాక ‘పెద్దలు కుదిర్చే పెళ్లి’ అనే భావన చాలా గట్టిగా ఉన్న కాలంలో ప్రేమను పదేపదే చెప్పడం కుదిరే పని కాదు. 1965లో ‘ప్రేమించి చూడు’ అనే టైటిల్ పెడితే పలకడానికి సంకోచించిన ఆడపిల్లలు ఉన్నారు. ఆ మాటెత్తితే చిర్రుబుర్రుమన్న పెద్దలు ఉన్నారు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా అంత స్థాయిలో తెలుగులో ఆడలేదు. ‘ప్రేమనగర్’ (1971) అంటే ‘ప్రేమసౌధం’ కాబట్టి చెల్లుబాటయ్యింది. తాజ్‌మహల్ కాలం నుంచి ప్రేమసౌధాలు ఉన్నవే. అంటే వెండితెర మీద నుంచి ప్రేక్షకుల్లోకి ప్రేమ అంగీకారం పొందాలంటే చాలా కాలం పట్టింది.
దశ మార్చిన ‘మరో చరిత్ర’
వయసులో ఉన్న అమ్మాయి, అబ్బాయి... అదే వయసు హీరో హీరోయిన్లు... వారు ప్రేమలో పడ్డారు... జనం ఆశ్చర్యపోయారు. విగ్గులు, మేకప్ అవసరం లేని హీరో, హీరోయిన్లు కావడం వల్ల వారి ప్రేమ కాలానికి తగినట్టుగా ఉండటం వల్ల అందులోని సవాళ్లను వారు అసహజంగా కాకుండా సహజంగా ఎదుర్కొన్నారు కనుక ‘ప్రేమచరిత్ర’ (1978) సూపర్‌హిట్ అయ్యింది. ఇది తెలుగు ప్రేక్షకులకు ప్రేమరోగాన్ని గట్టిగా అంటించింది.
1981లో మూడు సినిమాలు ‘ప్రేమాభిషేకం’. ‘సీతాకోక చిలుక’, ‘ముద్దమందారం’... తెలుగు నేల మీద ప్రేమదుమారం రేపాయి. ఈ సంవత్సరంతో తెలుగు సినిమాల్లో ప్రేమ ఒక గట్టి ఫార్ము లాగా స్థిరపడింది. అయితే తమిళం నుంచి డబ్ అయిన ‘ప్రేమ సాగరం’ (1983) పై సినిమాల్లో లేని ‘కాలేజీ’ని ఆకర్షణీయమైన పాత్రగా ప్రవేశపెట్టి కాలేజీ కుర్రాళ్లను ఐడెంటిఫై అయ్యేలా చేసుకోవడంతో తమిళంలో ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్టయ్యింది. ఇక ప్రేమ కథల జైత్రయాత్ర తెలుగులో మొదలైంది.
గీతాంజలి
ఆ తర్వాత అందరు హీరోలు ఏదో ఒక ప్రేమ కథలో నటించారు. లేదా ప్రేమ కథాంశాలు వారికి లాభించాయి. చిరంజీవి ‘ఖైదీ’ (1983), బాలకృష్ణ ‘సాహసమే జీవితం’ (1984), నాగార్జున ‘మజ్నూ’ (1987), వెంకటేశ్ ‘ప్రేమ’ (1989).... ఈ వరుసలో మణిరత్నం ‘గీతాంజలి’ (1989) ప్రేమ నిప్పులోన కాలదు.. నీటిలోన నానదు అని నిరూపించింది.
కొత్త పాయింటే సక్సెస్
అన్నీ ప్రేమ కథలే. కానీ కొత్త పాయింట్ చెప్పినప్పుడల్లా హిట్ అయ్యాయి. ‘చంటి’ (1991), ‘గులాబీ’ (1996), తొలిప్రేమ (1998) ఇవన్నీ హిట్ అవగా 2000 సంవత్సరంలో వచ్చిన ‘నువ్వే కావాలి’... స్నేహితుల మధ్య కూడా ప్రేమ ఉండొచ్చు అని చెప్పి సూపర్ హిట్టయ్యింది. కొత్త తరం హీరోలు వచ్చాక నాటి నుంచి నేటి వరకు ఎన్నో హిట్ ప్రేమ కథలు ప్రేక్షకుల మధ్యకు వచ్చాయి. ‘జయం’, ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ’ఖుషీ’, ‘బొమ్మరిల్లు’, ‘అర్జున్ రెడ్డి’, ‘ఫిదా’, ‘గీత గోవిందం’, ‘ఉప్పెన’. ‘సీతారామం’, ‘నిన్ను కోరి’... ఇప్పుడు ‘తండేల్’ వరకు ప్రేమ కథకు తిరుగు లేదని నిరూపించాయి.
నిజమే... ప్రేమ ఎంత మధురం.
Comments
Please login to add a commentAdd a comment