'ప్రేమంటే ఏమిటంటే.. నిను ప్రేమించినాక తెలిసే..', 'ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..' ఈ రెండు పాటలు ఈ రోజు మార్మోగడం ఖాయం.. ఈరోజు వాలంటైన్స్ డే కదా.. సక్సెస్ అయిన జంటలు బ్యాగ్రౌండ్‌లో హుషారైన ప్రేమపాటలు వేసుకుంటారు. ప్రపోజల్ రిజెక్ట్ అయిన వన్ సైడ్ లవర్స్ బ్రేకప్ సాంగ్స్ వింటూ బాధతో గడిపేస్తారు. ఇలా రిజెక్ట్ చేయడానికి కారణాలు అనేకం! అందులో లవ్వంటే ఇంట్రస్ట్ లేదు అనేది మొదటి స్థానంలో ఉంటుంది.
రంగు, ఎత్తు పొడుగు, శరీర సౌష్ఠవం, బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తిపాస్తులు, ఫిట్‌నెస్.. ఇవి కూడా ఆ జాబితాలోనివే! సరే.. వాళ్లు నో చెప్పారే అనుకో.. ప్రపంచమే అంతరించిపోతున్నట్లు బాధపడాలా? అక్కర్లేదు.. బాహ్య సౌందర్యానికి, కరెన్సీ నోట్లకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చేవాళ్లు మనకవసరమే లేదని చిల్ అయిపోవాలి. ఒకరి ప్రేమ కోసం పరితపించడానికి ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్ గురించే ఈ కథనం..
నవ్వులాట..
ఫెయిల్ అనేది రేపటి విజయానికి పునాది.. ఇప్పుడు తిట్టేవాళ్లే ఒకస్థాయి వస్తే చప్పట్లు కొడుతుంటారు. 12th ఫెయిల్ ఇందుకు అతిపెద్ద ఉదాహరణ. ఇంట్లో ఉండే ఆడవాళ్లను చులకన చేసి మాట్లాడుతుంటారు. కానీ ఆమె తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అద్భుతాలూ సృష్టించగలదు. అందుకు ఇంగ్లీష్ - వింగ్లీష్ బెస్ట్ ఎగ్జాంపుల్. బొద్దుగా ఉన్నావ్.. రెండడుగులు నడిస్తే ఆయాసం, కూర్చుంటే నిలబడలేవు.. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? ఇలాంటి మాటలకైతే లెక్కలేదు.
లావుగా ఉంటే అందవిహీనంగానా?
లావుగా ఉన్నవాళ్లు కనిపిస్తేనే కొందరు ఫక్కుమని నవ్వుతుంటారు. ఏం పాపం? వాళ్లేం తప్పు చేశారు? లావుగా ఉండటం నేరమా? కొందరు ఆహారపు అలవాట్ల వల్ల లావెక్కితే మరికొందరు జెనిటిక్స్ వల్ల అలా ఉంటారు! అయినా అందానికి అసలైన నిర్వచనమేంటో సైజ్ జీరో చూస్తే అర్థమవుతుంది. అందం అంటే ఆత్మవిశ్వాసమే! అని అప్పుడు మీరే ఒప్పుకుంటారు. ఛామనచాయ, నలుపు రంగు ఉన్నవాళ్లను కొందరు హీనంగా చూస్తారు. ఎగతాళి చేస్తారు. అవి ఏ రేంజ్‌లో ఉంటాయో కలర్ ఫోటో సినిమా చూస్తే తెలిసిపోతుంది.
మనల్ని మనం ప్రేమించుకుంటే చాలు
అయినా తక్కువరంగు ఉన్నవారు ఊసరవెల్లిలా రంగులు మార్చరే! మరి ఈ నలుపు రంగు వల్ల ఎవరికి హాని? ఎవరికి ఇబ్బంది? దీనికి ఎప్పటికీ సమాధానం దొరకదు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయ్.. ముందు మనల్ని మనం ప్రేమించుకుంటేనే అవతలివారి విమర్శలకు గట్టి సమాధానాలు ఇవ్వగలం. లేదంటే అక్కడే ఆగిపోతాం! జీవితమన్నాక అన్నీ ఉంటాయ్.. కష్టాలు కూడా క్లాస్‌మేట్స్ అనుకుని ముందుకు సాగిపోవాల్సిందే! కామెంట్స్ అంటారా.. డోంట్ కేర్ అంటూ లైట్ తీసుకోవాల్సిందే! ఆత్మవిశ్వాసమే అసలైన అందం అని మర్చిపోకండి.. ఎవరినైనా ప్రేమించేముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి..
చదవండి: భార్య కోసం ప్రేమను త్యాగం చేసిన స్టార్ హీరో.. ఆయన మరణం కూడా మిస్టరీనే
- పోడూరి నాగ ఆంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment