Premaabhishekam
-
వాలెంటైన్స్ డే: వెండితెరే ప్రేమలేఖ
‘ప్రేమ కోసమై వలలో పడెనె పాపం పసివాడు’ అని ‘పాతాళభైరవి’ సినిమా ప్రేమను వినిపించినా మనవారు తలకెక్కించుకోలేదు. ‘మల్లీశ్వరి’, ‘దేవదాసు’ ప్రేమకథల ట్రెండ్‌ను కొనసాగించలేదు. 1965 తర్వాతే ప్రేమ అనే మాట వెండితెర మీద ఎక్కువగా వినిపించింది. 1980ల నాటికి ప్రేమ సినీ ప్రేక్షకుల బ్లడ్గ్రూపుల్లో ఒకటిగా స్థిరపడింది. ‘మరో చరిత్ర’(Maro Charitra) ఇందుకు ఒక కారణమైతే ‘ప్రేమాభిషేకం’(Premaabhishekam) మరో కారణం. వాలెంటైన్స్ డే(Valentine Day) సందర్భంగా ప్రేమరీలు ఫ్లాష్‌బ్యాక్.‘మనసు గతి ఇంతే...’ అని ఆత్రేయ రాశాడుగాని ‘ప్రేమ గతి ఇంతే’ అని రాయలేదు. తెలుగు సినిమాల్లో చాలా కాలం ప్రేమకు బదులుగా ‘మనసు’, ‘మమత’ అనే మాటలే ఉండేవి. ‘మూగ మనసులు’, ‘తేనె మనసులు’... ప్రేమకథలే. వాటిని ‘మూగ ప్రేమలు’, ‘తేనె ప్రేమలు’ అనలేదు. ‘మల్లీశ్వరి’ కళాత్మక ప్రేమకథ. కానీ దాని సెట్టింగ్ వర్తమానంలో లేదు. ‘పాతాళభైరవి’ ప్రేమ కథే. అయితే అది జానపద కథై కూచుంది. ‘దేవదాసు’కు మించిన ప్రేమ కథ ఏముంది? ఇది వర్తమానంలో ఉన్నా సందేశం పరమ చేదైన నిషా కావడంతో ‘ప్రేమ’ మాటెత్తితే ఎక్కడ కుర్రాళ్లు దేవదాసులైపోతారోనని జనం దడుచుకునేవారు. తెలుగు సినిమా రంగం తన కథల్లో కుటుంబంలో ఉండే ప్రేమ గురించి, దాని చుట్టూ ఉండే డ్రామా గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టింది. దానికి కారణం ఇద్దరు సూపర్స్టార్లు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్లు భిన్న పాత్రలు, కథాంశాలతో ముందుకు సాగుతుండటమే.అదీగాక ‘పెద్దలు కుదిర్చే పెళ్లి’ అనే భావన చాలా గట్టిగా ఉన్న కాలంలో ప్రేమను పదేపదే చెప్పడం కుదిరే పని కాదు. 1965లో ‘ప్రేమించి చూడు’ అనే టైటిల్ పెడితే పలకడానికి సంకోచించిన ఆడపిల్లలు ఉన్నారు. ఆ మాటెత్తితే చిర్రుబుర్రుమన్న పెద్దలు ఉన్నారు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా అంత స్థాయిలో తెలుగులో ఆడలేదు. ‘ప్రేమనగర్’ (1971) అంటే ‘ప్రేమసౌధం’ కాబట్టి చెల్లుబాటయ్యింది. తాజ్‌మహల్ కాలం నుంచి ప్రేమసౌధాలు ఉన్నవే. అంటే వెండితెర మీద నుంచి ప్రేక్షకుల్లోకి ప్రేమ అంగీకారం పొందాలంటే చాలా కాలం పట్టింది.దశ మార్చిన ‘మరో చరిత్ర’వయసులో ఉన్న అమ్మాయి, అబ్బాయి... అదే వయసు హీరో హీరోయిన్లు... వారు ప్రేమలో పడ్డారు... జనం ఆశ్చర్యపోయారు. విగ్గులు, మేకప్ అవసరం లేని హీరో, హీరోయిన్లు కావడం వల్ల వారి ప్రేమ కాలానికి తగినట్టుగా ఉండటం వల్ల అందులోని సవాళ్లను వారు అసహజంగా కాకుండా సహజంగా ఎదుర్కొన్నారు కనుక ‘ప్రేమచరిత్ర’ (1978) సూపర్‌హిట్ అయ్యింది. ఇది తెలుగు ప్రేక్షకులకు ప్రేమరోగాన్ని గట్టిగా అంటించింది.1981లో మూడు సినిమాలు ‘ప్రేమాభిషేకం’. ‘సీతాకోక చిలుక’, ‘ముద్దమందారం’... తెలుగు నేల మీద ప్రేమదుమారం రేపాయి. ఈ సంవత్సరంతో తెలుగు సినిమాల్లో ప్రేమ ఒక గట్టి ఫార్ము లాగా స్థిరపడింది. అయితే తమిళం నుంచి డబ్ అయిన ‘ప్రేమ సాగరం’ (1983) పై సినిమాల్లో లేని ‘కాలేజీ’ని ఆకర్షణీయమైన పాత్రగా ప్రవేశపెట్టి కాలేజీ కుర్రాళ్లను ఐడెంటిఫై అయ్యేలా చేసుకోవడంతో తమిళంలో ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్టయ్యింది. ఇక ప్రేమ కథల జైత్రయాత్ర తెలుగులో మొదలైంది.గీతాంజలిఆ తర్వాత అందరు హీరోలు ఏదో ఒక ప్రేమ కథలో నటించారు. లేదా ప్రేమ కథాంశాలు వారికి లాభించాయి. చిరంజీవి ‘ఖైదీ’ (1983), బాలకృష్ణ ‘సాహసమే జీవితం’ (1984), నాగార్జున ‘మజ్నూ’ (1987), వెంకటేశ్ ‘ప్రేమ’ (1989).... ఈ వరుసలో మణిరత్నం ‘గీతాంజలి’ (1989) ప్రేమ నిప్పులోన కాలదు.. నీటిలోన నానదు అని నిరూపించింది.కొత్త పాయింటే సక్సెస్అన్నీ ప్రేమ కథలే. కానీ కొత్త పాయింట్ చెప్పినప్పుడల్లా హిట్ అయ్యాయి. ‘చంటి’ (1991), ‘గులాబీ’ (1996), తొలిప్రేమ (1998) ఇవన్నీ హిట్ అవగా 2000 సంవత్సరంలో వచ్చిన ‘నువ్వే కావాలి’... స్నేహితుల మధ్య కూడా ప్రేమ ఉండొచ్చు అని చెప్పి సూపర్ హిట్టయ్యింది. కొత్త తరం హీరోలు వచ్చాక నాటి నుంచి నేటి వరకు ఎన్నో హిట్ ప్రేమ కథలు ప్రేక్షకుల మధ్యకు వచ్చాయి. ‘జయం’, ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ’ఖుషీ’, ‘బొమ్మరిల్లు’, ‘అర్జున్ రెడ్డి’, ‘ఫిదా’, ‘గీత గోవిందం’, ‘ఉప్పెన’. ‘సీతారామం’, ‘నిన్ను కోరి’... ఇప్పుడు ‘తండేల్’ వరకు ప్రేమ కథకు తిరుగు లేదని నిరూపించాయి.నిజమే... ప్రేమ ఎంత మధురం. -
అక్కినేని బాధ చూసి... నాగ్ కాల్చుకుంటానన్నారు!
దేవదాసు, మేఘసందేశం, ప్రేమాభిషేకం... ఇలా వెండితెరపై అక్కినేని నాగేశ్వరరావు మిగిల్చిన తీపిజ్ఞాపకాలు ఎన్నో. అందుకే, ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినా ఇంకా ఇక్కడే ఉన్నారనే భావనతో చాలామంది ఉన్నారు. ఏ పాత్ర చేసినా, ‘ఈ పాత్రను అక్కినేని మినహా ఇంత అద్భుతంగా ఎవరూ చేయలేరు’ అనిపించుకోగలిగారాయన. నటన అంటే ఏయన్నార్‌కు అంత కమిట్మెంట్, ప్రేమ. అందుకే, ఏ ఆస్పత్రిలోనో కాకుండా షూటింగ్ లొకేషన్లోనే తుదిశ్వాస వదిలేస్తే బాగుండు అని ఆయన అనుకున్నారు. మరికొన్ని రోజుల్లో మృత్యువు ఒడిలోకి చేరడం ఖాయం అని తెలిసినా, చివరి సినిమా ‘మనం’ షూటింగ్లో ఆయన గుండె నిబ్బరంతో పాల్గొన్నారు. ఆరోగ్యం పెద్దగా సహకరించకపోయినా, ఆ చిత్రంలో నటించడంతో పాటు, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. వృత్తిపట్ల ఏయన్నార్‌కి ఉన్న కమిట్మెంట్కి ఇది నిదర్శనం. ‘మనం’ చిత్రంలో ఆయన కాంబినేషన్లో నటించినవాళ్లందరూ, జీవితాంతం గుర్తుండే అనుభూతులు మిగిలాయంటూ ఉంటారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీయ అయితే.. ‘‘మరికొన్ని రోజుల్లో చనిపోతానని తెలిసినా ఏయన్నార్‌గారు ఎంతో పాజిటివ్‌గా ఉండేవారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఏయన్నార్‌గారు మాట్లాడిన ప్రతి మాటా నాకు గుర్తే. ‘మనం’ చిత్రంలో ఏయన్నార్‌గారు రోడ్డు మీద పడిపోయే సీన్ ఒకటుంటుంది. ఆ సీన్లో నా ఒడిలో ఆయన తల ఉంటుంది. ఆయనను కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటాను. క్యాన్సర్ వల్ల అప్పటికే ఆయనకు ఒంట్లో అస్సలు బాగా లేదు. డాక్టర్ల అనుమతి తీసుకొని, రెండు గంటల పాటు ఎలాగోలా షూటింగ్లో పాల్గొంటున్నారు. క్యాన్సర్‌కు అప్పుడే ఆపరేషనైన ఆ పెద్దాయన, ఆ పరిస్థితుల్లో, కష్టమైనా సరే ఇష్టపడి నటిస్తుంటే నాకేమో కంగారుగా ఉంది. అప్పుడాయన, ‘ఎందుకు కంగారుపడుతున్నావ్. ఆస్పత్రిలో చనిపోయే కన్నా, ఇప్పుడు ఇక్కడే కెమెరా ముందు ప్రాణం విడిస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది’ అన్నారు. మరో రెండు నెలలో చనిపోతారనగా, ఈ చిత్రంలో నటించారాయన. సెట్లో ఆయనతో, ‘సార్! ఇంత స్ట్రెయిన్. ఫరవాలేదా’ అని అడిగేదాన్ని. అప్పుడాయన ‘నా గురించి బాధపడొద్దు. నేను చాలా హ్యాపీ మ్యాన్’ని అనేవారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన షూటింగ్ చేయడం చూసి, నాగార్జున చాలా బాధపడేవారు. ఒకసారైతే ‘ఏదైనా గన్ ఉంటే ఇవ్వు. కాల్చుకుంటాను. నాన్నను ఇలా చూడలేకపోతున్నాను’ అని నాగార్జున ఉద్వేగానికి గురయ్యారు. వృత్తిపట్ల ఏయన్నార్‌గారికి ఉన్న అంకితభావం చూసి, నాకు ఆశ్చర్యం అనిపించేది. రాత్రిపూట షూటింగ్ అంటే మా లాంటివాళ్లం ఒక్కోసారి విసుక్కుంటుంటాం. కానీ, ఆయన ఏనాడూ అలా చేయలేదు. సినిమా అంటే ఆయనకు అంత మమకారం. సినిమాలో తన వర్క్, డబ్బింగ్‌తో సహా ముందే పూర్తి చేసేశారు. మనల్ని ఆశీర్వదించడానికి కొన్ని ఆత్మలు మన చుట్టూ ఉంటాయంటారు. అలా ‘మనం’ కోసం ఏయన్నార్ ఆత్మ ఉండి, అందరినీ ఆశీర్వదించిందని అనిపించింది’’ అని శ్రీయ చాలా ఉద్వేగంగా వివరించారు. వృత్తి పట్ల ఏయన్నార్ కమిట్మెంట్ ఏ వృత్తిలో ఉన్నవాళ్ళకైనా పెద్ద లెసన్ కదూ! -
గీత స్మరణం
నేడు అక్కినేని పుట్టినరోజు పల్లవి : అతడు: కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా (2) ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూటొక్క టెంకాయ కొడతానని ఆమె: కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా (2) ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడిచస్తే నూటొక్క టెంకాయ కొడతానని ॥ చరణం : 1 అ: హలో... ఆ: హలో... (2) అ: హలో హలో అనమంటుంది కుర్రమనసు ఆ: చలో చలో పొమ్మంటుంది బుల్లిమనసు అ: పొమ్మని పైపైకి అంటుంది రమ్మని లోలోన ఉంటుంది ॥ ఆ: పొమ్మని రమ్మంటే అది స్వర్గం రమ్మని పొమ్మంటే అది నరకం ఆ స్వర్గంలోనే తేలిపోవాలి ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి ఔనంటే నువ్వు ఊ... అంటే (2) నూటొక్క టెంకాయ కొడతానని ॥ చరణం : 2 అ: గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం ఆ: పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయగీతం కళ్లు కలుసుకుంటే ప్రేమపాఠము కళ్లు కుట్టుకుంటే గుణపాఠము ఆ: కళ్లు కళ్లు కలిపి చూడు ఒక్కసారి ఒళ్లు ఝల్లుమంటుంది తొలిసారి అ: ఆ జల్లుల్లోనే తడిసిపోవాలి ఆ తడి కౌగిల్లో అలిసిపోవాలి ॥॥ చిత్రం: ప్రేమాభిషేకం (1981) రచన: దాసరి నారాయణరావు సంగీతం: చక్రవర్తి, గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల