
అక్కినేని బాధ చూసి... నాగ్ కాల్చుకుంటానన్నారు!
దేవదాసు, మేఘసందేశం, ప్రేమాభిషేకం... ఇలా వెండితెరపై అక్కినేని నాగేశ్వరరావు మిగిల్చిన తీపిజ్ఞాపకాలు ఎన్నో. అందుకే, ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినా ఇంకా ఇక్కడే ఉన్నారనే భావనతో చాలామంది ఉన్నారు. ఏ పాత్ర చేసినా, ‘ఈ పాత్రను అక్కినేని మినహా ఇంత అద్భుతంగా ఎవరూ చేయలేరు’ అనిపించుకోగలిగారాయన.
నటన అంటే ఏయన్నార్‌కు అంత కమిట్‌మెంట్, ప్రేమ. అందుకే, ఏ ఆస్పత్రిలోనో కాకుండా షూటింగ్ లొకేషన్లోనే తుదిశ్వాస వదిలేస్తే బాగుండు అని ఆయన అనుకున్నారు. మరికొన్ని రోజుల్లో మృత్యువు ఒడిలోకి చేరడం ఖాయం అని తెలిసినా, చివరి సినిమా ‘మనం’ షూటింగ్‌లో ఆయన గుండె నిబ్బరంతో పాల్గొన్నారు. ఆరోగ్యం పెద్దగా సహకరించకపోయినా, ఆ చిత్రంలో నటించడంతో పాటు, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. వృత్తిపట్ల ఏయన్నార్‌కి ఉన్న కమిట్‌మెంట్‌కి ఇది నిదర్శనం.
‘మనం’ చిత్రంలో ఆయన కాంబినేషన్‌లో నటించినవాళ్లందరూ, జీవితాంతం గుర్తుండే అనుభూతులు మిగిలాయంటూ ఉంటారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీయ అయితే.. ‘‘మరికొన్ని రోజుల్లో చనిపోతానని తెలిసినా ఏయన్నార్‌గారు ఎంతో పాజిటివ్‌గా ఉండేవారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఏయన్నార్‌గారు మాట్లాడిన ప్రతి మాటా నాకు గుర్తే. ‘మనం’ చిత్రంలో ఏయన్నార్‌గారు రోడ్డు మీద పడిపోయే సీన్ ఒకటుంటుంది. ఆ సీన్లో నా ఒడిలో ఆయన తల ఉంటుంది. ఆయనను కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటాను. క్యాన్సర్ వల్ల అప్పటికే ఆయనకు ఒంట్లో అస్సలు బాగా లేదు. డాక్టర్ల అనుమతి తీసుకొని, రెండు గంటల పాటు ఎలాగోలా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
క్యాన్సర్‌కు అప్పుడే ఆపరేషనైన ఆ పెద్దాయన, ఆ పరిస్థితుల్లో, కష్టమైనా సరే ఇష్టపడి నటిస్తుంటే నాకేమో కంగారుగా ఉంది. అప్పుడాయన, ‘ఎందుకు కంగారుపడుతున్నావ్. ఆస్పత్రిలో చనిపోయే కన్నా, ఇప్పుడు ఇక్కడే కెమెరా ముందు ప్రాణం విడిస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది’ అన్నారు. మరో రెండు నెలలో చనిపోతారనగా, ఈ చిత్రంలో నటించారాయన. సెట్‌లో ఆయనతో, ‘సార్! ఇంత స్ట్రెయిన్. ఫరవాలేదా’ అని అడిగేదాన్ని. అప్పుడాయన ‘నా గురించి బాధపడొద్దు. నేను చాలా హ్యాపీ మ్యాన్’ని అనేవారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన షూటింగ్ చేయడం చూసి, నాగార్జున చాలా బాధపడేవారు. ఒకసారైతే ‘ఏదైనా గన్ ఉంటే ఇవ్వు. కాల్చుకుంటాను.
నాన్నను ఇలా చూడలేకపోతున్నాను’ అని నాగార్జున ఉద్వేగానికి గురయ్యారు. వృత్తిపట్ల ఏయన్నార్‌గారికి ఉన్న అంకితభావం చూసి, నాకు ఆశ్చర్యం అనిపించేది. రాత్రిపూట షూటింగ్ అంటే మా లాంటివాళ్లం ఒక్కోసారి విసుక్కుంటుంటాం. కానీ, ఆయన ఏనాడూ అలా చేయలేదు. సినిమా అంటే ఆయనకు అంత మమకారం. సినిమాలో తన వర్క్, డబ్బింగ్‌తో సహా ముందే పూర్తి చేసేశారు. మనల్ని ఆశీర్వదించడానికి కొన్ని ఆత్మలు మన చుట్టూ ఉంటాయంటారు. అలా ‘మనం’ కోసం ఏయన్నార్ ఆత్మ ఉండి, అందరినీ ఆశీర్వదించిందని అనిపించింది’’ అని శ్రీయ చాలా ఉద్వేగంగా వివరించారు. వృత్తి పట్ల ఏయన్నార్ కమిట్‌మెంట్ ఏ వృత్తిలో ఉన్నవాళ్ళకైనా పెద్ద లెసన్ కదూ!