Love Story movies
-
ఏ సినిమా ప్రేమలు... ఎవరి స్టయిల్ వారిదే!
ప్రేమించడం నిజజీవితంలో కాస్త అరుదే. అక్కడెవరో వాళ్లెవరో ప్రేమించారట, ఇక్కడెవరో ప్రేమించి పెళ్లి చేసుకున్నారట అంటూ వినడం తప్ప వాస్తవంలో ప్రేమ అందరికీ అంతగా అనుభవంలోకి రాదు. (కాపోతే కాలేజీల్లో విరివిగా కనిపించినా... చదువు ముగిసేనాటికి, మురిగిపోయే జస్ట్ సీజనల్ ప్రేమలవి). సినిమాల్లో అలా కాదు. ప్రతి మూవీలోనూ ప్రేమ ఉండనే ఉంటుంది. పట్టుబట్టి విషాదాంతం తీయాలని భీష్మించుకుంటే తప్ప... హీరో, హీరోయిన్ల ప్రేమ ఫలించి తీరుతుంది. విచిత్రం ఏమిటంటే... హీరోను బట్టి లేదా దర్శకుడిని బట్టి వారి వారి ప్రేమలకూ ఓ శైలి ఉంటుంది. హీరో మ్యానరిజంలాగా అదీ ప్రత్యేకంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఉదాహరణకు ఎన్టీఆర్ సినిమాల్లో అంతా జస్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రేమ. అక్కినేని వారి ప్రేమల్లా ఇక్కడ సంక్లిష్టతలుండవు. కాకపోతే అలనాటి గుండమ్మకథలో ‘కోలుకోలోయమ్మ కోలో నాస్వామి’ అంటూ పాడుతూ... ‘హేయ్ బుల్లెమ్మా...’ ‘ఓయ్ బుల్లెమ్మా’ అంటూ అరుపులు అరిచినా... ఆ తర్వాత ‘త్తిఖ రేగీ థిమ్మిరెఖ్ఖీ’ అంటూ యమగోల చేసినా... అప్పటి అరుపులతో ఇప్పుడు నడుం మీద చరుపులూ కనిపిస్తాయి. వెరసి అవి... దట్టంగా, దిట్టంగా మిళాయించిన మసాళాలా, గ్యాసెక్కువైన సోడాలా ఘాటుగా నాటుగా ఉంటాయంతే. ఎన్టీఆర్ ప్రేమలన్నీ దాదాపుగా ఒక హీరోయిన్‌తోనే... సిక్స్ లేన్స్ హైవే మీద ఎదురెవ్వరూ రాని ట్రాఫిక్‌లా సాఫీగా, హాయిగా సాగిపోయే ప్రేమలే. ఇక ఏఎన్నార్ దగ్గరికి వస్తే ఆయన సినిమా ప్రేమలన్నీ సంక్లిష్టంగా ఉంటాయ్. ఆయన ఎవరినో ప్రేమిస్తాడు... హీరోయిన్ కూడా యథాశక్తి ఏఎన్నార్‌ను లవ్ చేస్తుంది. కానీ మరెవరో సెకండ్ హీరోయిన్ కూడా నాగేస్రావ్నే లవ్ చేయడంతో... కుటుంబంకోసమో, చెల్లెలి ప్రేమ కోసమో... తప్పనిసరి పరిస్థితుల్లో అక్కినేని కూడా ఆమెనే ప్రేమించాల్సొస్తుంది. అంతే...! పాపం అక్కడో ఓ త్రికోణ ప్రేమ ఏర్పడటంతో త్రికోణమితి సూత్రాలూ, లెక్కలూ సినిమాలోకి వచ్చేసి ఈక్వేషన్లను చిక్కుముడుల్లా సంక్లిష్టంగా మార్చేస్తుంది. దాంతో ప్రేక్షకులు కూడా ఆ బెర్ముడా ట్రయాంగిల్లో చిక్కి... పాపం గిలగిల్లాడతారు. జామెట్రీ భాషలో చె΄్పాలంటే ఎన్టీఆర్వన్నీ సరళరేఖ ప్రేమలూ... ఏఎన్ఆర్ వన్నీ ట్రిగనామెట్రీ లెక్కలూ!! శోభన్బాబువి కూడా ఇంచుమించూ త్రికోణమితులేగానీ... ఆయన మనసు మరీ విశాలం కావడంతో ఇద్దరు హీరోయిన్లనీ మితిమీరి సమానంగా ప్రేమిస్తాడు. వారిద్దరి ప్రేమల్నీ తన మనసు సున్నితపు త్రాసులో సమానంగా తూస్తాడు. అద్దిగ్గో... అక్కడొస్తుంది కథలో బలం. నిజానికి ట్రిగనామెట్రీలన్నీ శోభన్బాబువే. నిజం చె΄్పాలంటే ఏఎన్నార్వి ‘సుడిగుండాలే’! ఇక సూపర్‌స్టార్ కృష్ణ ప్రేమలు కూడా దాదాపు ఎన్టీఆర్ ప్రేమల్లా స్ట్రెయిట్‌గా ఉంటాయి. కాకపోతే హీరోయినే ప్రేమించి ప్రేమించి పైపైన పైపైన పడిపోతుంటుంది. ఈమె తప్పనిసరిగా విలన్ కూతురే అయి ఉంటుంది. అంతగా పైపైన పడిపోయినందుకు కృష్ణ కూడా రుణం ఉంచుకోడు. పరిహారంగా డ్యూయెట్లలో ఈయన కూడా ఏదో ఓ టైమ్‌లో ఆమె ఎద మీద తలవాల్చి బదులు తీర్చుకుంటాడు. ఆ దృశ్యమే వాల్‌పోస్టర్‌గా మారి ప్రేక్షకుల్ని సినిమాకు ఆహ్వానిస్తుంది. చిరంజీవి హీరోయిన్ల తీరు కూడా ఇంచుమించూ సూపర్‌స్టార్ కృష్ణ స్టైల్లోనే ఉంటది. ఈయన కూడా కృష్ణలాగే హీరోయిన్ను ‘హేయ్ తింగరిబుచ్చి’ అంటూ తీసిపారేస్తూనో... ‘చెయ్యి చూశావా.. ఎంత రఫ్‌గా ఉందో’ అంటూ సరదా బెదిరింపులతో సందడి చేస్తుంటాడు. చిరంజీవి బెదిరిస్తాడు. హీరోయిన్ ప్రేమకోసం దేబిరిస్తుంది. ఇంకో విశేషం... చిరంజీవి సినిమాల్లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అయితే వాళ్లిద్దరూ తమ శక్తికొద్దీ హీరోని ప్రేమించినప్పటికీ... ఏఎన్నార్, శోభన్‌బాబు ప్రేమల్లోలా ఇక్కడ సంక్లిష్టతలుండవ్. ఆ ఇద్దరి ప్రేమలూ గ్లామర్ కోసమే. కాబట్టి ఈ ప్రేమల్లో సంఘర్షణలూ ఉండవు. ఇవన్నీ అందంగా చెదిరిపడ్డ సరళరేఖలే కావడంతో ప్రేక్షకులు అదిరిపడ్డానికి ఆస్కారాలుండవ్. ∙∙ హీరోల ప్రేమలకే కాదు... తెర మీద ప్రేమను చూపడంలోనూ దర్శకులకూ ఓ స్టైలుంటుందీ, ఓ మేనరిజముంటుంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాలో హీరోయిన్ ప్రేమలన్నీ చాలా ఉదాత్తంగా ఉంటాయ్. నిజజీవితంలో ఏ హీరోయిన్లు కూడా ప్రవర్తించనంత ఉన్నతంగా ఉంటాయ్. అంతెందుకు... మన జీవితాల్లో మన చెల్లెలికో, మన కూతురికో విశ్వనాథ్ సినిమాలో లాంటి హీరో సంబంధం వస్తే స్ట్రెయిటవే వద్దనేస్తాం. అలాంటి హీరోకి మనింటి ఆడబిడ్డనివ్వం. డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమాలకు వద్దాం. ఇక్కడ ప్రేమలన్నీ ఫ్రూట్ జ్యూసులంత మధురంగా, పండ్లు తింటే సమకూరేంత ఆరోగ్యంగా నవనవలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా డ్యూయెట్లలో!. అప్పటిదాకా తీసిపారేసే హీరో కూడా... హీరోయిన్ ఎద మీద నడుములిరిగిపోయినట్టు వాలిపోయినట్టే... నడుములిరగకపోయినా ప్రేక్షకులూ ఆమె మీద అంతే మోతాదులో మనసు పారేసుకుంటారు. ∙∙ హీరో హీరోయిన్లకు తోడు, సపోర్టింగ్ క్యారెక్టర్లూ మేమూ ఉన్నామంటూ తగుదునమ్మా అంటూ వచ్చేస్తారు. వాళ్లూ హీరోయిన్ని ప్రేమిస్తారు. హీరోయిన్ దక్కాల్సింది హీరోకే కదా. అందుకే ప్రేమించిన పాపానికి... పాపం వాళ్లు తగిన మూల్యం చెల్లించి శంకరగిరి మాన్యాలకు ట్రైన్ టిక్కెట్టు అడ్వాన్సు బుకింగ్ చేయించుకుంటారు. అందరికీ తెలిసినా క్లైమాక్స్ వరకూ వాళ్లకా విషయం తెలియకపోవడమే ఇక్కడ విశేషం. ఉదాహరణకు... మాయాబజార్లో లక్ష్మణకుమారుడైన రేలంగి కూడా శశిరేఖ సావిత్రి మీద మనసు పడతాడు. కానీ నాగేస్రావ్కే కదా సావిత్రి దక్కాల్సిందీ! కాబట్టి... దర్శకుడు రేలంగిని ముప్పుతిప్పలు పెట్టిస్తాడు. చేతులు ఠక్కున అంటుకుపోవడంతో... చప్పట్లు కొట్టడానికి కూడా జంకేలా భయపడతాడు. పులిని చూసినట్టు భయపడటమనేది రేలంగికి నిజంగానే అనుభవంలోకొస్తుంది. అప్పుడు రేలంగైనా అంతే... ఇప్పుడు అదుర్స్‌లో బ్రహ్మానందానికైనా ఇంతే. సినిమాలు మారతాయి. హీరోలూ, హీరోయిన్లలో కొత్త తరాలు వస్తాయి. కానీ ప్రేమమాత్రం అజరామరంగా ఉండిపోతుంది. కాకపోతే ఒకనాటి పాత సినిమాల్లో ప్రేమ ఉదాత్తంగా ఉంటుంది. ఈ తర్వాత చిరంజీవి నాటి మధ్యయుగాల్లో కాస్త రఫ్‌గా ఉన్నా సరదా సరదాగా ఉంటుంది. ఇక ఈ తరం అర్జున్‌రెడ్డిలకు వచ్చేసరికి అప్పటి మేన్లీ మేన్ కాస్తా... ఇంకాస్త హార్ష్ అండ్ పవర్ఫుల్ అవుతాడు. యాంగ్రీయంగ్ కాస్తా యానిమల్ అయిపోతాడు. సినీ విమర్శకులంతా డార్విన్లాగా వచ్చేసి... పరిణామక్రమంలో ఆల్జీబ్రాలూ, ఆల్ కెన్ బి అఛీవ్డ్ బై హీరోలనే ఆ ధీరోదాత్తులు తమకు ఉన్న టైటిల్లోని ఉదాత్తత కోల్పోయి... ఆల్ఫా మేల్స్‌గా యానిమల్స్గా ప్రవర్తిస్తుంటారని సెలవిచ్చేస్తారు. హీరోయిన్లు మాత్రం అప్పుడూ ఇప్పుడూ డిల్లమొహాలేసుకుని, తెల్లబోతూ, జెల్లకొట్టే ఆ హీరోనే అనాదిగా, అనంతంగా, ఆత్రంగా అలా ప్రేమిస్తూనే ఉండిపోతారు. – యాసీన్ -
ఈ ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు!
సినిమాల్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ఒకసారి హారర్ది హవా అయితే ఇంకోసారి కామెడీది.. మరోసారి యాక్షన్ ఇరగదీస్తుంది.. అయితే ట్రెండ్‌తో సంబంధం లేని జానర్ ఏదంటే అది ‘లవ్’. అందుకే ఏడాది పొడవునా ‘ఇట్స్ లవ్ టైమ్’ అంటూ లవ్‌స్టోరీస్ రూపొందుతుంటాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవాటిలో, ఆన్ సెట్‌కి వెళ్లనున్న చిత్రాల్లో చాలా ప్రేమకథలు ఉన్నాయి. కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం. పీరియాడికల్ లవ్... యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అందులోనూ ఎక్కువగా యాక్షన్ సినిమాలే. జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టు అప్పుడప్పుడు ప్రేమకథలు ఒప్పుకుంటారు. ఆయన కెరీర్లో ‘వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి పలు హిట్ ప్రేమకథా చిత్రాలున్నాయి. తాజాగా మరో లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ప్రభాస్. ప్రేమకథా చిత్రాలను తనదైన శైలిలో ఆవిష్కరించే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని టాక్. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో పీరియాడికల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉంటుందట. అయితే ప్రభాస్ ప్రస్తుత కమిట్మెంట్స్ వల్ల హనుతో చేసే సినిమాకి ఇంకా టైమ్ పడుతుందట. గ్రామంలో ప్రేమ శ్రీకాకుళంలోని ఒక మారుమూల గ్రామం అది. ఓ అమ్మాయి–అబ్బాయి ప్రేమలో పడ్డారు. ఎవరెన్ని చేసినా విడదీయలేని ప్రేమ బంధం వారిది. అయితే అనుకోకుండా ఓ విపత్తు ఎదురవుతుంది. ఆ తర్వాత ఈ ప్రేమ జంట కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనే నేపథ్యంలో నాగచైతన్య హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించనున్నారు. మత్స్యకారుల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం ఉంటుంది. 2018లో గుజరాత్ వెరావల్ నుండి వేటకు వెళ్లి పాక్ కోస్ట్ గార్డ్‌కు చిక్కిన 21 మంది భారతీయుల్లో ఒక వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుందట. ఈ చిత్రం కోసం శ్రీకాకుళం యాస, భాషలు నేర్చుకుంటున్నారు నాగచైతన్య. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ చివర్లో లేదా నవంబరులో ఆరంభం కానుంది. టిల్లు లవ్ అట్లుంటది మనతోని అంటూ రాధిక (నేహా శెట్టి) ప్రేమ కోసం వెంట పడి హిట్ సాధించారు సిద్ధు జొన్నలగడ్డ. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ–నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. ఇప్పుడు ఆ ప్రేమని రెండు రెట్లు ఎక్కువగా అందించేందుకు సిద్ధమవుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా వచ్చే నెల 15న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన ‘టికెటే కొనకుండా.. ’ పాట లిరికల్ వీడియోలో హీరోయిన్ని ప్రేమలో పడేయడానికి హీరో పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ‘డీజే టిల్లు’ కంటే ‘టిల్లు స్క్వేర్’లో నవ్వులు, ప్రేమ రెట్టింపు ఉంటాయని చిత్ర యూనిట్ ఇప్పటికే స్పష్టం చేసింది. మరి టిల్లు కొత్త ప్రేమ కహానీ ఏంటో తెలియాలంటే సెప్టెంబర్ 15 వరకూ వేచి చూడాలి. ఖుషీగా ప్రేమలో... హీరో విజయ్ దేవరకొండకి ప్రేమకథలు కొత్తేమీ కాదు. ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి ప్రేమ కథా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత లవ్ స్టోరీస్ చేయకూడదనుకుని యాక్షన్ బాట పట్టారు. అయితే డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పిన ప్రేమ కథ నచ్చడంతో ‘ఖుషి’ సినిమా చేశారు విజయ్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలుమార్లు చె΄్పారు. ఈ మూవీలో సమంత హీరోయిన్. విప్లవ్ (విజయ్ దేవరకొండ), ఆరాధ్య(సమంత) ప్రేమించుకుంటారు. అయితే ఇంట్లో వాళ్లు ఒప్పుకోక΄ోవడంతో బయటకి వచ్చి పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలెడతారు. ఆ తర్వాత తమ మధ్య తలెత్తిన మనస్పర్థలు, గొడవలను తట్టుకొని మళ్లీ ఎలా కలిశారు? అనే కథాంశంతో ‘ఖుషి’ రూపొందినట్లు టాక్. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ‘గీత గోవిందం’ (2018) వంటి ప్రేమకథా చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ–దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమాకి శ్రీకారం జరిగింది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోందని టాక్. -
వెండితెర పై అపూర్వ ప్రేమ సంతకాలు
-
ఈ ఏడాది సరికొత్త ప్రేమకథా చిత్రాలు ఇవే..!
సినిమాల్లో ప్రేమకథలకు ఉన్న క్రేజే వేరు. లవ్ స్టోరీలను సినీ ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడతారు. భాష ఏదైనా ప్రేమకథా చిత్రాలకు ఆదరణ ఉంటుంది. గతేడాదిలో పలు ప్రేమ కథాంశంగా తెరకెక్కిన చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా కూడా నిలిచాయి. అందులో సీతారామం మూవీ ఒకటి. మరీ ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా సరికొత్త ప్రేమకథలను పరిచయం చేసేందుకు టాలీవుడ్లో సిద్ధమవుతున్న చిత్రాలేవో చూసేద్దాం. ప్రేమకావ్యం.. శాకుంతలం కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్, శకుంతలగా సమంత నటించారు. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, గౌతమి, మధుబాల కీలక పాత్రలుపో షించారు. కాగా ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ని విడుదల చేయనున్నట్లు శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. వినరో భాగ్యము విష్ణుకథ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి నటిస్తున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫోన్ నంబర్ ప్రధాన అంశంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. మన ఫోన్ నెంబర్ తర్వాత నెంబర్ వారితో పరిచయం ప్రేమగా మారితే ఎలా ఉంటుందన్నదే ప్రధాన కథాంశం. ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని- కీర్తి సురేశ్ 'దసరా' నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. యాక్షన్ చిత్రంగా తెరకెస్తున్నప్పటికీ ఓ మంచి ప్రేమకథ ఉందని పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. సింగరేణి బొగ్గు గనుల సమీపంలోని వీర్లపల్లి గ్రామ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తిసురేశ్ నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ - సమంత 'ఖుషి' పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన ఖుషి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే పేరుతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. -
ఓటీటీలోకి ‘లవ్‌స్టోరీ’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ ‘లవ్‌స్టోరీ’. మహమ్మారి కాలంలో కూడా అధిక శాతం ప్రేక్షకులను థియేటర్లోకి రప్పించిన చిత్రంగా లవ్‌స్టోరీ మార్క్ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్ల వర్షం కురిపించింది. ఇందులో సాయి పల్లవి డ్యాన్స్, నాగ చైతన్య నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన ఈ మూవీ వరుసగా సక్సెస్, మ్యాజికల్ సక్సెస్ మీట్ వేడుకులను కూడా జరుపుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని బుల్లితెర ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఆహా దసరా కానుకగా తీపి కబురుఉ అందించింది. చదవండి: నన్ను ఎవరు గుర్తు పట్టడంలేదు, అందుకే ఈవెంట్స్‌కి రావట్లేదు: రవళి ఈ సినిమాను ఆహాలో విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించి స్ట్రీమింగ్ డేట్‌ను కూడా వదిలారు నిర్వహకులు. అక్టోబర్ 22న ఆహాలో ‘లవ్ స్టోరీ’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సరిగ్గా సెప్టెంబర్ 4న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా నాలుగు వారాలకు(నెల రోజుల) అనంతరం ఓటీటీలోకి రావడం విశేషం. థియేటర్లలో భారీ విజయం సొంతం చేసుకున్న ‘లవ్ స్టోరీ’ ఇక ఆహాలో ఏ స్టాయిలో విజయం సాధిస్తుందో చూడాలి. 12 వారాలు... 90 రోజులు... 20 కొత్త సినిమాలు, షోలు! 🎥 ఈ దసరా నుండి సంక్రాంతి వరకు అదిరిపోయే నాన్ స్టాప్ 100% తెలుగు వినోదాల పండగ, మీ అహలో!🧡 సిద్ధమా!!!https://t.co/whilkXuvEA#CelebrateWithAHA🥳 pic.twitter.com/TTbmVrS3OG — ahavideoIN (@ahavideoIN) October 10, 2021 -
ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అది!
ప్రేమ..ఈ రెండక్షరాలు మనల్ని ఊహల్లో విహరించేలా చేస్తాయి. ప్రపంచాన్ని మరిచేలా చేస్తాయి. అందుకే ప్రేమకథాచిత్రాలు ఎన్ని వచ్చినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అందులోని ఎమోషన్స్ కొన్ని రోజుల దాకా మనతోనే ట్రావెల్ చేస్తాయి. ప్రేమకథల్లో ఏముంటాయి? అదొక సుత్తి అంటారు కొంతమంది. ఇంకొంతమందికి ప్రేమంటే అదొక పిచ్చి. లవ్ జానర్‌కు ప్రపంచమంతా ఫాలోయింగ్ ఉంది. ప్రేమకథలు తీస్తే..ఏ స్టార్డమ్ లేకున్నా దానికదే తెచ్చుకొని థియేటర్లలో వందల రోజులు ఆడేస్తుందని నమ్ముతారు ఫిల్మ్‌మేకర్స్. అందుకే లవ్ జానర్లో అనేక సినిమాలు వచ్చాయి..వస్తూనే ఉన్నాయి. కానీ దేనికదే ప్రత్యేకత. దేనిలో ఉండే ఎమోషన్స్ దానివే. అందుకే ప్రేమకు మనందరం అంతలా కనెక్ట్ అయిపోతాం. వాలైంటైన్స్ వీక్ సందర్భంగా ప్రేమకథాచిత్రాలను ఓసారి గుర్తుచేసుకుందాం. తొలిప్రేమ ప్రేమలోని అమాకయత్వం అంతా ఈ సినిమాలో ఉంటుంది. మొదటిసారి ప్రేమలో పడినప్పుడు ఎలా ఉంటుంది, ప్రేమించిన వ్యక్తిని చూడటానికి ఎంత ఆరాటపడతారు, ప్రేమను తెలియజేయడానికి ఎంత కష్టపడతారు లాంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఆర్య నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు..నా ప్రేమను ఫీల్ అవ్వు అంటూ ఆర్య అనే యువకుడు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆర్య ఒక కొత్తరకం ప్రేమ కథ. ఇలా కూడా ప్రేమ ఉంటుందా అన్నట్లుగా ఈ కథ నడుస్తుంది. చివరికి సుఖాంతమే అయినా, అంతవరకూ ఈ ప్రమకథలో చాలా గమ్మత్తైన మలుపులు ఉంటాయి. నా ఆటోగ్రాఫ్..స్వీట్మెమురీస్ జీవితంలో మూడు దశల్లో తను ప్రేమించిన ముగ్గురు గుర్తుచేసుకుంటూ ఒక వ్యక్తిచేసే ప్రయాణమే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమురీస్. ప్రేమలోని అమాయకత్వం, స్వచ్చమైన ప్రేమ, బాధ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఇలాంటి కథతో మలయాళంలో ప్రేమమ్ సినిమా రూపొంది మంచి విజయం సాధించింది. ఏ మాయ చేశావే ఈ సినిమాలో ఎన్ని అలకలు ఉంటాయో,అంతే ప్రేమ ఉంటుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ సినిమాల్లో ‘ఏ మాయ చేశావేకి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే, నేను నిన్నే ఎందుకు ప్రేమించాలి? అని అడుగుతాడు హీరో. ప్రేమ కథల్లో ఉండే మ్యాజిక్ అంతా ఈ సినిమాలో ఉంటుంది. 100% లవ్ మనసునిండా ప్రేమ ఉన్నా ఇగోల కారణంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనుకునే క్యూట్ అండ్ రొమాంటిక్ బావా మరదళ్ల కథ ఇది. అన్నింట్లో తనే గ్రేట్ అని ఫీలయ్యే హీరోకి..తన టాలెంట్‌తో ధీటైన సమాధానం చెప్తుంది హీరోయిన్. ఇక అప్పట్నుంచి ఎవరికి వారు గ్రేట్ అని నిరూపించుకోవడం కోసం చేసే క్యూట్ టామ్ అండ్ జెర్రీ ఫైట్లా సాగుతుంది. ఎదుటివాళ్ల భావాలతో సంబంధం లేకుండా తన పంతమే నెగ్గాలనుకుంటాడు హీరో. చివరికి హీరో మరదలి ప్రేమతో మిస్టర్ పర్ఫెక్ట్‌లా మారతాడు. నిన్నుకోరి ప్రేమ పుట్టడానికి క్షణకాలం చాలు. కానీ అది పెళ్లిబంధంగా మారడానికి మధ్య చాలా పరిస్థితులు అడ్డంకులుగా మారతాయి. ఈ సినిమాలోనూ అదే జరుగుతుంది. ఇద్దరూ ప్రేమించుకున్నా కొన్ని కారణాల వల్ల పెళ్లిచేసుకోలేకపోతారు. అప్పటినుంచి తనకోసం అనునిత్యం తపన చెందుతుంటాడు హీరో నాని. ఈ క్రమంలో తన ప్రేయసి వాళ్లింటికి వెళతాడు. తను ప్రేమించిన అమ్మాయి వాళ్ల భర్తతో కలిసి సంతోషంగా ఉందని తెలుసుకున్నాక హీరో కూడా మారతాడు. తర్వాత తెలిసిన బంధువులమ్మాయితో హీరో పెళ్లి జరుగి కథ సుఖాంతమవుతుంది. చాలా మందికి ఈ కథ బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలోని పాటలు కూడా మంచి విజయం సాధించాయి. అర్జున్‌రెడ్డి ప్రమలో ఎంత ప్రేమ ఉంటుందో, అంతే బాధ కూడా ఉంటుంది. ఆ బాధను చెప్పే సినిమా అర్జున్‌రెడ్డి. ప్రేమించిన అమ్మాయి అకస్మాత్తుగా దూరమైతే అర్జున్‌రెడ్డి అనే వ్యక్తి జీవితమంతా తలకిందులు అయిపోతుంది. కొన్నినెలలపాటు తనలో తానే ఒకనరకం అనుభవిస్తాడు. అతడి కథే ఈ సినిమా. ప్రేమకథల్లో మరో కొత్తకోణం ఈ సినిమా. దొరసాని స్వచ్ఛమైన ప్రేమకు కులాలు,అంతస్తులు అడ్డురావని ఓ దొరసాని పేదింటి అబ్బాయిని ప్రేమిస్తే ...అందుకు ఒప్పుకోని దొరసాని కుటుంబసభ్యలు వారిని ఏం చేశారుట? . వారి ప్రాణం పోతుందని తెలిసినా ప్రేమ కోసం వారు చేసిన పోరాటం ఏంటి అన్నదే ఈ సినిమా కథ.ఈలాంటి జానర్లో ఇదివరకే సినిమాలు వచ్చినా దేనికదే ప్రత్యేకం. తెలంగాఫ గడీల నేపథ్యంలో ఓ ఊరి దొరసానికి ,పేదింటి అబ్బయికి మధ్య సాగిన ప్రేమకథకు తెలంగాణ యాసను జోడించి తీసిన స్వచ్ఛమైన ప్రేమకథ. కమర్షియల్‌గా కాకుండా అందంగా తీర్చిదిద్దిన రియల్స్టోరి ఇది. డియర్ కామ్రేడ్ విప్లవ భావాలున్న ఓ వ్యక్తి ప్రేమలో పడటం, ఆ తర్వాత తన భావాలకు,ప్రేమకు మధ్య జరిగే సంఘర్షణ, వాటి వల్ల ఎదురైన పరిస్థితులు, మహిళా క్రికెట్ అసోసియేషన్‌లో వేదింపుల నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమా. జాను తమిళంలో క్లాసిక్ హిట్‌గా నిలిచిన 96 సినిమాకి రీమేక్ ఈ సినిమా. వృత్తిపరంగా ట్రావెల్ ఫోటోగ్రాఫరైన రామ్..అనుకోకుండా తను చదువుకున్న స్కూల్‌కి వెళతాడు. స్కూల్‌ని చూసి పాత ఙ్ఞాపకాల్ని నెమరేసుకుంటాడు. రామ్, జాను పదో తరగతిలో ప్రేమలో పడతారు. కానీ అనుకోకుండా విడిపోతారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌లో కలుసుకున్న వాళ్లిద్దరూ తమ తొలిప్రేమ గురించి ఏం మాట్లాడుకున్నారు? అన్ని సంవత్సరాల తర్వాత వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు ఏంటి అన్నదే ‘జాను’ కథ. ప్రతీ ఒక్కరి జీవితంలో ఫస్ట్‌లవ్ చాలా స్పెషల్. అలా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఈ సినిమా. -
ఉపాసన నన్ను ప్రేమకథలు చేయమంటోంది!
ఒకే కోవలోని సినిమాలు చేయడానికి రామ్‌చరణ్ అస్సలు ఇష్టపడరు. ఆయన నటించిన తొలి మూడు సినిమాలే అందుకు ఉదాహరణలు. కొత్తదనం కోసం పరితపించడం తండ్రి చిరంజీవి నుంచి చరణ్‌కి అబ్బిన లక్షణం. రచ్చ, ఎవడు, నాయక్... చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని, అక్టోబర్ 1న ‘గోవిందుడు అందరివాడేలే’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారాయన. ఈ సందర్భంగా చరణ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘గోవిందుడు అందరివాడేలే’ అని టైటిల్ పెట్టడానికి కారణమేంటి? హీరో పాత్ర తీరుతెన్నుల్ని దృష్టిలో పెట్టుకొని పెట్టిన టైటిల్ అది. అంతేతప్ప ఆ సినిమాలో నా పేరు గోవిందుడేం కాదు. ఇందులో నా పేరు ‘అభిమన్యు’. ఎన్నారైని. తాత కోసం ఇండియా వస్తాను. ఆ తర్వాత ఏమైందనేది సినిమా. ఇప్పటివరకూ ఇలాంటి కోవలోని సినిమా నేను చేయలేదు. మీరూ, మీ నాన్నగారూ ఈ సినిమా చూశారా? విడివిడిగా చూశాం. అయితే... ఇద్దరం పూర్తిగా చూడలేదు. ఎడిటింగ్ టైమ్‌లో నేను కొంత చూశాను. నిజానికి ‘మగధీర’ తర్వాత చేయాల్సిన సినిమా ఇది. అప్పుడు కుటుంబ కథల కోసం చాలా ప్రయత్నించాను. చాలామంది కథలు వినిపించారు కూడా. అయితే... ఎవరూ నన్ను ఒప్పించలేకపోయారు. ప్రతి ఒక్కరూ కుటుంబ కథ అని మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీ చెప్పేవారు. మిక్స్‌డ్‌గా ఉంటే బావుంటుందని వాళ్లెంత చెప్పినా నాకెందుకో మింగుడు పడేది కాదు. కృష్ణవంశీ ఈ కథ చెప్పినప్పుడు... నేను ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న కథ ఇదే అనిపించింది. పైగా కృష్ణవంశీతో సినిమా చేయాలని నాకెప్పట్నుంచో కోరిక.. ఇలాంటి కథల్ని తెరకెక్కించడంలో ఆయన మాస్టర్. చాలామంది... మురారి, చందమామ చిత్రాల పోలికలు ఈ సినిమాలో ఉంటాయనుకుంటున్నారు. కొందరైతే... ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంతో కూడా పోల్చి మాట్లాడుతున్నారు. వారి అంచనాల్లో నిజం లేదు. ఇదొక ఫ్రెష్ సినిమా. ఇందులో ఏ సినిమాల పోలికలూ ఉండవు. సినిమారంగంలో అందరూ సక్సెస్ వైపే పరుగెడుతుంటారు. మీరేంటి... పరాజయాల్లో ఉన్న కృష్ణవంశీతో సినిమా చేశారు? నేనెప్పుడూ సక్సెస్ వైపు పరిగెత్తలేదు. నాకు కథ ముఖ్యం. అందుకే తొందరపడి ఎవరికీ కమిట్ అవ్వను కూడా. మీరన్నట్లు కృష్ణవంశీ గత చిత్రాలు కొన్ని ఫ్లాపై ఉండొచ్చు. కానీ దర్శకునిగా ఆయన మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. ఇది నిజం. పైగా కృష్ణవంశీ ఏ విషయంలోనూ రాజీ పడరు. నాకు అలాంటి దర్శకుడే కావాలి. అందుకే చేశాను. ఎవరితోనూ తొందరపడి కమిట్ కాను అన్నారు. మరి మొదలై ఆగిన ధరణి దర్శకత్వంలోని ‘మెరుపు’, కొరటాల శివ సినిమాల మాటేంటి? అవి మొదలై ఆగిపోయాయి కదా? కథ నచ్చితేనే నిర్మాత దగ్గర్నుంచి డబ్బు తీసుకుంటాను. కొరటాల శివ కథ నాకు చూచాయగా నచ్చింది. అయితే... సంతృప్తిగా రాలేదు. అయితే... బండ్ల గణేశ్ ఒత్తిడి చేయడంతో ఆ సినిమాకు చెక్ తీసుకున్నాను. ఓపెనింగ్‌లో కూడా పాల్గొన్నాను. ఆ కథ కూడా ‘గోవిందుడు...’ లాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందుకే పక్కన పెట్టాల్సివచ్చింది. ఇప్పుడు కాకపోయినా... తర్వాతైనా కొరటాల శివతో సినిమా చేస్తాను. కథల విషయంలో చిరంజీవిగారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందంటారు నిజమేనా? ఆయనకు నచ్చకపోవడం వల్లే ‘గోవిందుడు...’ ఆలస్యమైందని పలువురి అభిప్రాయం. డెరైక్టర్ కోరుకుంటేనే నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంతేతప్ప అనవసరంగా జోక్యం చేసుకోరు. ‘గోవిందుడు’ విషయం కొన్ని సీన్స్ నేటివిటీకి దూరంగా ఉన్నాయి. నాన్న సలహా మేరకు వాటిని మార్చాం. రాజ్‌కిరణ్‌ని తప్పించి, ప్రకాశ్‌రాజ్‌ని తీసుకోవడం ఎవరి ఆలోచన? నాన్నగారితో పాటు అందరి నిర్ణయం అది. రాజ్‌కిరణ్ గొప్ప ఆర్టిస్ట్. కానీ... ఎందుకో ఆ పాత్రకు ఆయనకంటే ప్రకాశ్‌రాజ్ కరెక్ట్ అనిపించింది. ఒకప్పుడు ఎస్వీరంగారావుగారిలా... ఈ తరానికి ప్రకాశ్‌రాజ్ అనాలి. ఆయన్ను మనం సరిగ్గా ఉపయోగించుకోవడం లేదంతే. అనుకున్నదానికంటే అద్భుతంగా నటించారాయన. ఆయన సూచనలు కూడా మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రకాశ్‌రాజ్ సీన్స్ తీయడం వల్ల అయిదు కోట్ల రూపాయలు అదనపు భారం పడిందని చాలామంది అంటున్నారు కానీ... అలాంటిదేం లేదు. ఓ విధంగా బడ్జెట్ తగ్గింది. కృష్ణవంశీ సినిమాలకు భిన్నంగా... తక్కువ ఖర్చుతో, తక్కువ వర్కింగ్ డేస్‌లో పూర్తయిన సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. కృష్ణవంశీ ఆర్టిస్టుల్ని పిండేస్తారని, ఆయనకు ఏదీ ఓ పట్టాన నచ్చదని అంటుంటారు. నిజమేనా? ఆయన ఆర్టిస్టుల్ని పిండేస్తారు. అలాగే... మేమూ ఆయన్ను పిండేశాం. ఒకటి మాత్రం నిజం. ఆర్టిస్టుల నుంచి నటన రాబట్టుకోవడంలో కృష్ణవంశీ దిట్ట. సీన్ పేపర్ చదవగానే... ఈ సీన్ ఇలా చేయాలని ప్రిపేర్ అవుతాం. కానీ లొకేషన్లోకి వెళ్లాక... అదే సీన్‌ని ఆయన మరోలా నేరేట్ చేస్తారు. చాలా కొత్తగా ఉంటుంది. ‘ఇలా కూడా చేయొచ్చా?’ అనిపిస్తుంది. ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందని బండ్ల గణేశ్, యాభై ఏళ్లు గుర్తుంటుందని కృష్ణవంశీ అంటున్నారు. మీరేం అంటారు? కోరికలుంటాయి. తప్పేం లేదు. నా వరకు సినిమా బాగా ఆడి నిర్మాతకు డబ్బులొస్తే చాలు. ఇంతకూ... శ్రీను వైట్ల సినిమా ఉన్నట్లా? లేనట్లా? కథ నచ్చితే కచ్చితంగా చేస్తా. త్వరలోనే ఆ విషయం చెబుతా. మణిరత్నం సినిమా చేస్తున్నారని వార్తలొచ్చాయి? ఆయన దర్శకత్వంలో నటించాలని ఎవరికుండదండీ. ఆయన ఫ్రేమింగ్, టేకింగ్ అద్భుతం. అయితే సినిమా అనేది వ్యాపారం. ఇక్కడ డబ్బులు రావడం ముఖ్యం. ఆయన చెప్పిన కథ నాకు నచ్చలేదు. ఇప్పుడు ఆ కథతోనే ఆయన మమ్ముట్టి కుమారుడితో సినిమా చేస్తున్నారు. మంచి కథ దొరికితే ఆయనతో చేస్తా. కోన వెంకట్, గోపీమోహన్‌ల కథ ఫైనల్ చేశారట? వారి కథ బాగుంది. అయితే... డెరైక్టర్ కోసం చూస్తున్నాం. అది కూడా త్వరలో చెబుతా. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుంది. బాలీవుడ్ ‘జంజీర్’ ఫలితం నుంచి నుంచి మీరు నేర్చుకున్నదేంటి? నేర్చుకున్నదేం లేదు. అది ఆడలేదంతే. ‘లగాన్’ ఫేమ్ ఆశుతోశ్ గోవారీకర్‌తో సినిమా చేస్తున్నారట కదా? అవును. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా ఉంటుంది. మీ సినిమాల విషయంలో మీ భార్య ఉపాసన ఏమైనా సలహాలిస్తుంటారా? ఆమె ప్రేమకథల్ని చేయమంటోంది. మంచి కథలొస్తే చేయొచ్చు. నిజానికి సరిగ్గా ట్రీట్ చేస్తే ‘ఆరంజ్’ మంచి ప్రయత్నం. కానీ ఆడలేదు... ఏం చేస్తాం. మీ నాన్నగారి 150వ సినిమాకు దర్శకుడు ఫైనల్ అయ్యారా? లేదు. సిట్టింగులు జరుగుతూనే ఉన్నాయి. మంచి ఎంటర్టైనింగ్ కథ కోసం చూస్తున్నాం. మీ నాన్నగారు తెలుగు సినిమాలో నంబర్‌వన్‌గా రెండు దశాబ్దాల పాటు కొనసాగారు. ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంది. దాని కోసం మీరు కూడా పోటీ పడుతున్నారా? నాన్న నంబర్‌వన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. వచ్చిన సినిమాల్లో మంచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్లారు. అనుకోకుండా ఆ స్థానం వరించింది. నేనూ అంతే... వచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళ్తాను. ‘నంబర్‌వన్’ కావాలని మాత్రం ఆశించను. మీ బాబాయి ‘గోపాల గోపాల’ అంటున్నారు. మీరేమో ‘గోవిందుడు అందరివాడేలే’ అంటున్నారు. మీ తమ్ముడు వరుణ్‌తేజ్ ‘ముకుంద’ అంటున్నారు. ఏంటి మీ ఫ్యామిలీ మొత్తం కృష్ణుడి మీద పడ్డారు? ఏంటో అలా సెట్ అయ్యింది. అనుకుని చేసేదేం కాదు కదా. మీ బాబాయి పవన్‌కల్యాణ్‌తో కథల విషయంలో డిస్కస్ చేస్తారా? ఇంట్లో అందరం కలిసినప్పుడు చర్చించుకుంటాం. ఆయన కూడా సలహాలిస్తుంటారు. పవన్‌కల్యాణ్ ఎనిమిదో సినిమా ‘జానీ’. మహేశ్‌బాబు ఎనిమిదో సినిమా ‘నిజం’, ఎన్టీఆర్ ఎనిమిదో సినిమా ‘ఆంధ్రావాలా’. ప్రభాస్ ఎనిమిదో సినిమా ‘యోగి’, బన్నీ ఎనిమిదో సినిమా ‘ఆర్య-2’. ఇప్పుడు మీ ఎనిమిదో సినిమాగా ‘గోవిందుడు...’ రాబోతున్నాడు. ఈ ఎనిమిదో ప్రమాదం నుంచి గట్టెక్కగలరా? ‘గోవిందుడు అందరివాడేలే’ దాన్ని కచ్చితంగా బ్రేక్... చేసి, పెద్ద విజయం సాధిస్తుంది. వైజాగ్‌లో స్టూడియో కడుతున్నారని తెలిసింది నిజమేనా? తెలుగు సినిమా అక్కడ కూడా అభివృద్ది చెందే అవకాశం ఉందంటారా? కట్టాలనుకుంటున్నాం. అయితే... ఎక్కడో ఇప్పుడే చెప్పలేను. పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి తరలుతుందని చెప్పలేం. ఎందుకంటే మద్రాసు నుంచి రావడానికే చాలా టైమ్ పట్టింది కదా. అయితే... ప్రత్యామ్నాయంగా మరో చోట సినిమా అభివృద్ధి చెందడం అవసరమే. అమెరికాలో చాలా ప్రాంతాల్లో స్టూడియోలు ఉన్నాయి.