ఉపాసన నన్ను ప్రేమకథలు చేయమంటోంది! | make Love Story movies says Upasana | Sakshi
Sakshi News home page

ఉపాసన నన్ను ప్రేమకథలు చేయమంటోంది!

Published Mon, Sep 29 2014 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

ఉపాసన నన్ను ప్రేమకథలు చేయమంటోంది!

ఉపాసన నన్ను ప్రేమకథలు చేయమంటోంది!

 ఒకే కోవలోని సినిమాలు చేయడానికి రామ్‌చరణ్ అస్సలు ఇష్టపడరు. ఆయన నటించిన తొలి మూడు సినిమాలే అందుకు ఉదాహరణలు. కొత్తదనం కోసం పరితపించడం తండ్రి చిరంజీవి నుంచి చరణ్‌కి అబ్బిన లక్షణం. రచ్చ, ఎవడు, నాయక్... చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని, అక్టోబర్ 1న ‘గోవిందుడు అందరివాడేలే’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారాయన. ఈ సందర్భంగా చరణ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
 
 ‘గోవిందుడు అందరివాడేలే’ అని టైటిల్ పెట్టడానికి కారణమేంటి?
 హీరో పాత్ర తీరుతెన్నుల్ని దృష్టిలో పెట్టుకొని పెట్టిన టైటిల్ అది. అంతేతప్ప ఆ సినిమాలో నా పేరు గోవిందుడేం కాదు. ఇందులో నా పేరు ‘అభిమన్యు’. ఎన్నారైని. తాత కోసం ఇండియా వస్తాను. ఆ తర్వాత ఏమైందనేది సినిమా. ఇప్పటివరకూ ఇలాంటి కోవలోని సినిమా నేను చేయలేదు.
 
 మీరూ, మీ నాన్నగారూ ఈ సినిమా చూశారా?
 విడివిడిగా చూశాం. అయితే... ఇద్దరం పూర్తిగా చూడలేదు. ఎడిటింగ్ టైమ్‌లో నేను కొంత చూశాను. నిజానికి ‘మగధీర’ తర్వాత చేయాల్సిన సినిమా ఇది. అప్పుడు కుటుంబ కథల కోసం చాలా ప్రయత్నించాను. చాలామంది కథలు వినిపించారు కూడా. అయితే... ఎవరూ నన్ను ఒప్పించలేకపోయారు. ప్రతి ఒక్కరూ కుటుంబ కథ అని మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీ చెప్పేవారు. మిక్స్‌డ్‌గా ఉంటే బావుంటుందని వాళ్లెంత చెప్పినా నాకెందుకో మింగుడు పడేది కాదు. కృష్ణవంశీ ఈ కథ చెప్పినప్పుడు... నేను ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న కథ ఇదే అనిపించింది. పైగా కృష్ణవంశీతో సినిమా చేయాలని నాకెప్పట్నుంచో కోరిక.. ఇలాంటి కథల్ని తెరకెక్కించడంలో ఆయన మాస్టర్. చాలామంది... మురారి, చందమామ చిత్రాల పోలికలు ఈ సినిమాలో ఉంటాయనుకుంటున్నారు. కొందరైతే... ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంతో కూడా పోల్చి మాట్లాడుతున్నారు. వారి అంచనాల్లో నిజం లేదు. ఇదొక ఫ్రెష్ సినిమా. ఇందులో ఏ సినిమాల పోలికలూ ఉండవు.
 
 సినిమారంగంలో అందరూ సక్సెస్ వైపే పరుగెడుతుంటారు. మీరేంటి... పరాజయాల్లో ఉన్న కృష్ణవంశీతో సినిమా చేశారు?
 నేనెప్పుడూ సక్సెస్ వైపు పరిగెత్తలేదు. నాకు కథ ముఖ్యం. అందుకే తొందరపడి ఎవరికీ కమిట్ అవ్వను కూడా. మీరన్నట్లు కృష్ణవంశీ గత చిత్రాలు కొన్ని ఫ్లాపై ఉండొచ్చు. కానీ దర్శకునిగా ఆయన మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. ఇది నిజం. పైగా కృష్ణవంశీ ఏ విషయంలోనూ రాజీ పడరు. నాకు అలాంటి దర్శకుడే కావాలి. అందుకే చేశాను.
 
 ఎవరితోనూ తొందరపడి కమిట్ కాను అన్నారు. మరి మొదలై ఆగిన ధరణి దర్శకత్వంలోని ‘మెరుపు’, కొరటాల శివ సినిమాల మాటేంటి? అవి మొదలై ఆగిపోయాయి కదా?
 కథ నచ్చితేనే నిర్మాత దగ్గర్నుంచి డబ్బు తీసుకుంటాను. కొరటాల శివ కథ నాకు చూచాయగా నచ్చింది. అయితే... సంతృప్తిగా రాలేదు. అయితే... బండ్ల గణేశ్ ఒత్తిడి చేయడంతో ఆ సినిమాకు చెక్ తీసుకున్నాను. ఓపెనింగ్‌లో కూడా పాల్గొన్నాను. ఆ కథ కూడా ‘గోవిందుడు...’ లాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందుకే పక్కన పెట్టాల్సివచ్చింది.  ఇప్పుడు కాకపోయినా... తర్వాతైనా కొరటాల శివతో సినిమా చేస్తాను.
 
 కథల విషయంలో చిరంజీవిగారి ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంటుందంటారు నిజమేనా? ఆయనకు నచ్చకపోవడం వల్లే ‘గోవిందుడు...’ ఆలస్యమైందని పలువురి అభిప్రాయం.
 
 డెరైక్టర్ కోరుకుంటేనే నాన్నగారి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. అంతేతప్ప అనవసరంగా జోక్యం చేసుకోరు. ‘గోవిందుడు’ విషయం కొన్ని సీన్స్ నేటివిటీకి దూరంగా ఉన్నాయి. నాన్న సలహా మేరకు వాటిని మార్చాం.
 
 రాజ్‌కిరణ్‌ని తప్పించి, ప్రకాశ్‌రాజ్‌ని తీసుకోవడం ఎవరి ఆలోచన?
 నాన్నగారితో పాటు అందరి నిర్ణయం అది. రాజ్‌కిరణ్ గొప్ప ఆర్టిస్ట్. కానీ... ఎందుకో ఆ పాత్రకు ఆయనకంటే ప్రకాశ్‌రాజ్ కరెక్ట్ అనిపించింది. ఒకప్పుడు ఎస్వీరంగారావుగారిలా... ఈ తరానికి ప్రకాశ్‌రాజ్ అనాలి. ఆయన్ను మనం సరిగ్గా ఉపయోగించుకోవడం లేదంతే. అనుకున్నదానికంటే అద్భుతంగా నటించారాయన. ఆయన సూచనలు కూడా మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రకాశ్‌రాజ్ సీన్స్ తీయడం వల్ల అయిదు కోట్ల రూపాయలు అదనపు భారం పడిందని చాలామంది అంటున్నారు కానీ... అలాంటిదేం లేదు. ఓ విధంగా బడ్జెట్ తగ్గింది. కృష్ణవంశీ సినిమాలకు భిన్నంగా... తక్కువ ఖర్చుతో, తక్కువ వర్కింగ్ డేస్‌లో పూర్తయిన సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’.
 
 కృష్ణవంశీ ఆర్టిస్టుల్ని పిండేస్తారని, ఆయనకు ఏదీ ఓ పట్టాన నచ్చదని అంటుంటారు. నిజమేనా?
 ఆయన ఆర్టిస్టుల్ని పిండేస్తారు. అలాగే... మేమూ ఆయన్ను పిండేశాం. ఒకటి మాత్రం నిజం. ఆర్టిస్టుల నుంచి నటన రాబట్టుకోవడంలో కృష్ణవంశీ దిట్ట. సీన్ పేపర్ చదవగానే... ఈ సీన్ ఇలా చేయాలని ప్రిపేర్ అవుతాం. కానీ లొకేషన్లోకి వెళ్లాక... అదే సీన్‌ని ఆయన మరోలా నేరేట్ చేస్తారు. చాలా కొత్తగా ఉంటుంది. ‘ఇలా కూడా చేయొచ్చా?’ అనిపిస్తుంది.
 
 ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందని బండ్ల గణేశ్, యాభై ఏళ్లు గుర్తుంటుందని కృష్ణవంశీ అంటున్నారు. మీరేం అంటారు?
 కోరికలుంటాయి. తప్పేం లేదు. నా వరకు సినిమా బాగా ఆడి నిర్మాతకు డబ్బులొస్తే చాలు.
 
 ఇంతకూ... శ్రీను వైట్ల సినిమా ఉన్నట్లా? లేనట్లా?

 కథ నచ్చితే కచ్చితంగా చేస్తా. త్వరలోనే ఆ విషయం చెబుతా.
 
 మణిరత్నం సినిమా చేస్తున్నారని వార్తలొచ్చాయి?
 ఆయన దర్శకత్వంలో నటించాలని ఎవరికుండదండీ. ఆయన ఫ్రేమింగ్, టేకింగ్ అద్భుతం. అయితే సినిమా అనేది వ్యాపారం. ఇక్కడ డబ్బులు రావడం ముఖ్యం. ఆయన చెప్పిన కథ నాకు నచ్చలేదు. ఇప్పుడు ఆ కథతోనే ఆయన మమ్ముట్టి కుమారుడితో సినిమా చేస్తున్నారు. మంచి కథ దొరికితే ఆయనతో చేస్తా.
 
 కోన వెంకట్, గోపీమోహన్‌ల కథ ఫైనల్ చేశారట?
 వారి కథ బాగుంది. అయితే... డెరైక్టర్ కోసం చూస్తున్నాం. అది కూడా త్వరలో చెబుతా. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుంది.
 
 బాలీవుడ్ ‘జంజీర్’ ఫలితం నుంచి నుంచి మీరు నేర్చుకున్నదేంటి?
 నేర్చుకున్నదేం లేదు. అది ఆడలేదంతే.
 
 ‘లగాన్’ ఫేమ్ ఆశుతోశ్ గోవారీకర్‌తో సినిమా చేస్తున్నారట కదా?
 అవును. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా ఉంటుంది.
 
 మీ సినిమాల విషయంలో మీ భార్య ఉపాసన ఏమైనా సలహాలిస్తుంటారా?
 ఆమె ప్రేమకథల్ని చేయమంటోంది. మంచి కథలొస్తే చేయొచ్చు. నిజానికి సరిగ్గా ట్రీట్ చేస్తే ‘ఆరంజ్’ మంచి ప్రయత్నం. కానీ ఆడలేదు... ఏం చేస్తాం.
 
 మీ నాన్నగారి 150వ సినిమాకు దర్శకుడు ఫైనల్ అయ్యారా?
 లేదు. సిట్టింగులు జరుగుతూనే ఉన్నాయి. మంచి ఎంటర్‌టైనింగ్ కథ కోసం చూస్తున్నాం.
 
 మీ నాన్నగారు తెలుగు సినిమాలో నంబర్‌వన్‌గా రెండు దశాబ్దాల పాటు కొనసాగారు. ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంది. దాని కోసం మీరు కూడా పోటీ పడుతున్నారా?
 నాన్న నంబర్‌వన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. వచ్చిన సినిమాల్లో మంచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్లారు. అనుకోకుండా ఆ స్థానం వరించింది. నేనూ అంతే... వచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళ్తాను. ‘నంబర్‌వన్’ కావాలని మాత్రం ఆశించను.
 
 మీ బాబాయి ‘గోపాల గోపాల’ అంటున్నారు. మీరేమో ‘గోవిందుడు అందరివాడేలే’ అంటున్నారు. మీ తమ్ముడు వరుణ్‌తేజ్ ‘ముకుంద’ అంటున్నారు. ఏంటి మీ ఫ్యామిలీ మొత్తం కృష్ణుడి మీద పడ్డారు?
 ఏంటో అలా సెట్ అయ్యింది. అనుకుని చేసేదేం కాదు కదా.
 
 మీ బాబాయి పవన్‌కల్యాణ్‌తో కథల విషయంలో డిస్కస్ చేస్తారా?
 ఇంట్లో అందరం కలిసినప్పుడు చర్చించుకుంటాం. ఆయన కూడా సలహాలిస్తుంటారు.
 
 పవన్‌కల్యాణ్ ఎనిమిదో సినిమా ‘జానీ’. మహేశ్‌బాబు ఎనిమిదో సినిమా ‘నిజం’, ఎన్టీఆర్ ఎనిమిదో సినిమా ‘ఆంధ్రావాలా’. ప్రభాస్ ఎనిమిదో సినిమా ‘యోగి’, బన్నీ ఎనిమిదో సినిమా ‘ఆర్య-2’. ఇప్పుడు మీ ఎనిమిదో సినిమాగా ‘గోవిందుడు...’ రాబోతున్నాడు. ఈ ఎనిమిదో ప్రమాదం నుంచి గట్టెక్కగలరా?
 ‘గోవిందుడు అందరివాడేలే’ దాన్ని కచ్చితంగా బ్రేక్... చేసి, పెద్ద విజయం సాధిస్తుంది.
 
 వైజాగ్‌లో స్టూడియో కడుతున్నారని తెలిసింది నిజమేనా? తెలుగు సినిమా అక్కడ కూడా అభివృద్ది చెందే అవకాశం ఉందంటారా?
 కట్టాలనుకుంటున్నాం. అయితే... ఎక్కడో ఇప్పుడే చెప్పలేను. పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి తరలుతుందని చెప్పలేం. ఎందుకంటే మద్రాసు నుంచి రావడానికే చాలా టైమ్ పట్టింది కదా. అయితే... ప్రత్యామ్నాయంగా మరో చోట సినిమా అభివృద్ధి చెందడం అవసరమే. అమెరికాలో చాలా ప్రాంతాల్లో స్టూడియోలు ఉన్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement