ఈ ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు! | Upcoming Love story movies In Tollywood | Sakshi
Sakshi News home page

ఈ ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు!

Published Thu, Aug 17 2023 1:14 AM | Last Updated on Thu, Aug 17 2023 7:52 AM

Upcoming Love story movies In Tollywood - Sakshi

సినిమాల్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్‌ నడుస్తుంది. ఒకసారి హారర్‌ది హవా అయితే ఇంకోసారి కామెడీది.. మరోసారి యాక్షన్‌ ఇరగదీస్తుంది.. అయితే ట్రెండ్‌తో సంబంధం లేని జానర్‌ ఏదంటే అది ‘లవ్‌’. అందుకే ఏడాది పొడవునా ‘ఇట్స్‌ లవ్‌ టైమ్‌’ అంటూ లవ్‌స్టోరీస్‌ రూపొందుతుంటాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవాటిలో, ఆన్‌ సెట్‌కి వెళ్లనున్న చిత్రాల్లో చాలా ప్రేమకథలు ఉన్నాయి. కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.
 
పీరియాడికల్‌ లవ్‌...
యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అందులోనూ ఎక్కువగా యాక్షన్‌ సినిమాలే. జస్ట్‌ ఫర్‌ చేంజ్‌ అన్నట్టు అప్పుడప్పుడు ప్రేమకథలు ఒప్పుకుంటారు. ఆయన కెరీర్‌లో ‘వర్షం, డార్లింగ్, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ వంటి పలు హిట్‌ ప్రేమకథా చిత్రాలున్నాయి. తాజాగా మరో లవ్‌ స్టోరీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట ప్రభాస్‌. ప్రేమకథా చిత్రాలను తనదైన శైలిలో ఆవిష్కరించే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చేయనున్నారని టాక్‌. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉంటుందట. అయితే ప్రభాస్‌ ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ వల్ల హనుతో చేసే సినిమాకి ఇంకా టైమ్‌ పడుతుందట.   
 
గ్రామంలో ప్రేమ
శ్రీకాకుళంలోని ఒక మారుమూల గ్రామం అది. ఓ అమ్మాయి–అబ్బాయి ప్రేమలో పడ్డారు. ఎవరెన్ని చేసినా విడదీయలేని ప్రేమ బంధం వారిది. అయితే అనుకోకుండా ఓ విపత్తు ఎదురవుతుంది. ఆ తర్వాత ఈ ప్రేమ జంట కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనే నేపథ్యంలో నాగచైతన్య హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించనున్నారు.  మత్స్యకారుల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం ఉంటుంది.
2018లో గుజరాత్‌ వెరావల్‌ నుండి వేటకు వెళ్లి పాక్‌ కోస్ట్‌ గార్డ్‌కు చిక్కిన 21 మంది భారతీయుల్లో ఒక వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుందట. ఈ చిత్రం కోసం శ్రీకాకుళం యాస, భాషలు నేర్చుకుంటున్నారు నాగచైతన్య. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌ చివర్లో లేదా నవంబరులో ఆరంభం కానుంది.
 
టిల్లు లవ్‌
అట్లుంటది మనతోని అంటూ రాధిక (నేహా శెట్టి) ప్రేమ కోసం వెంట పడి హిట్‌ సాధించారు సిద్ధు జొన్నలగడ్డ. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ–నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. ఇప్పుడు ఆ ప్రేమని రెండు రెట్లు ఎక్కువగా అందించేందుకు సిద్ధమవుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. ఈ సినిమా వచ్చే నెల 15న రిలీజ్‌ కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన ‘టికెటే కొనకుండా.. ’ పాట లిరికల్‌ వీడియోలో హీరోయిన్‌ని ప్రేమలో పడేయడానికి హీరో పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ‘డీజే టిల్లు’ కంటే ‘టిల్లు స్క్వేర్‌’లో నవ్వులు, ప్రేమ రెట్టింపు ఉంటాయని చిత్ర యూనిట్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. మరి టిల్లు కొత్త ప్రేమ కహానీ ఏంటో తెలియాలంటే సెప్టెంబర్‌ 15 వరకూ వేచి చూడాలి.
 
ఖుషీగా ప్రేమలో...
హీరో విజయ్‌ దేవరకొండకి ప్రేమకథలు కొత్తేమీ కాదు. ‘అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ వంటి ప్రేమ కథా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత లవ్‌ స్టోరీస్‌ చేయకూడదనుకుని యాక్షన్‌ బాట పట్టారు. అయితే డైరెక్టర్‌ శివ నిర్వాణ చెప్పిన ప్రేమ కథ నచ్చడంతో ‘ఖుషి’ సినిమా చేశారు విజయ్‌. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలుమార్లు చె΄్పారు. ఈ మూవీలో సమంత హీరోయిన్‌. విప్లవ్‌ (విజయ్‌ దేవరకొండ), ఆరాధ్య(సమంత) ప్రేమించుకుంటారు.

అయితే  ఇంట్లో వాళ్లు ఒప్పుకోక΄ోవడంతో బయటకి వచ్చి పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలెడతారు. ఆ తర్వాత తమ మధ్య తలెత్తిన మనస్పర్థలు, గొడవలను తట్టుకొని మళ్లీ ఎలా కలిశారు? అనే కథాంశంతో ‘ఖుషి’ రూపొందినట్లు టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ‘గీత గోవిందం’ (2018) వంటి ప్రేమకథా చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న హీరో విజయ్‌ దేవరకొండ–దర్శకుడు పరశురామ్‌ కాంబినేషన్‌లో మరో సినిమాకి శ్రీకారం జరిగింది. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోందని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement