హారర్ సినిమాలు ఏ మాత్రం ఆడియన్స్‌కు కనెక్ట్ అయినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. అందుకే కథాబలం ఉన్న భయపెట్టే కథలు తమ దగ్గరకి వస్తే చేసేందుకు భయపడరు హీరోలు, హీరోయిన్లు. కథలోని భయాన్నే భరోసాగా చేసుకుని, ప్రస్తుతం కొందరు నటీనటులు హారర్ సినిమాలు చేస్తున్నారు. ఆ స్టార్స్ చేస్తున్న హారర్ చిత్రాల గురించి తెలుసుకుందాం.
రాజా డీలక్స్ థియేటర్‌లో రాజా సాబ్
ప్రభాస్ కటౌట్ చాలు బాక్సాఫీస్ భయపడటానికి. కానీ వెండితెరపై ప్రభాస్ భయపడితే ఎలా ఉంటుంది? ఆడియన్స్‌ను ప్రభాస్ భయపెడితే ఎలా ఉంటుంది? అనేది ‘రాజా సాబ్’ సినిమాలో చూడొచ్చు. ‘ప్రేమకథా చిత్రమ్’తో ఆడియన్స్‌ని నవ్విస్తూనే భయపెట్టి, బాక్సాఫీస్ కాసులను కురిపించిన దర్శకుడు మారుతి ‘రాజా సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం.
‘రాజా డీలక్స్’ అనే థియేటర్‌లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉంది. దీంతో వీలైనంత తొందరగా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హారర్ తరహా జానర్‌లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్‌లోను నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.
ఇప్పుడు సినిమాలోనూ...
నాగచైతన్య కెరీర్‌లో ఇప్పటివరకూ హారర్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు లేవు. అయితే హారర్ టచ్ ఉన్న ‘ధూత’ అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ సిరీస్‌కు వీక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఓ పర్ఫెక్ట్ హారర్ మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ సినిమాతో దర్శకుడు కార్తీక్‌వర్మ దండు ఆడియన్స్‌ను బాగా భయపెట్టి, బాక్సాఫీస్ వద్ద డబ్బులు రాబట్టుకున్నారు. ఈ దర్శకుడు తెరకెక్కించనున్న కొత్త సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ‘విరూపాక్ష’ను మించిన హారర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని, కథకు కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం.
ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఓ ఎత్తైన పర్వతం పైకి ఎక్కుతున్న నాగచైతన్యను ఓ పక్షి కన్నులో నుంచి చూపించారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌కు ఆసక్తి నెలకొంది. ఈ నెలాఖర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. నాగచైతన్య కెరీర్‌లోని ఈ 24వ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.
కొరియన్ కనకరాజు
లవ్‌స్టోరీ, యాక్షన్ జానర్స్‌లో సినిమాలు చేశారు వరుణ్ తేజ్. అయితే ఈసారి కొత్తగా ప్రయత్నించాలని వరుణ్ తేజ్ డిసైడ్ అయ్యారు. అందుకే ఓ హారర్ కామెడీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్. ‘రన్ రాజా రన్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ వంటి చిత్రాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి.
ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో ఉంటుంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్‌గా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. మార్చిలో చిత్రీకరణ అంటున్నారు కాబట్టి, వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఊహించవచ్చు.
చీకటి–వెలుగుల మధ్యలో...!
చీకటి వెలుగుల మధ్య దాగి ఉన్న ఓ మిస్టరీని చేధించే పనిలో పడ్డారట బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా కౌశిక్ పెగుళ్లపాటి దర్శకత్వంలో ఓ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. సాయి శ్రీనివాస్ కెరీర్‌లోని ఈ 11వ చిత్రంలో ‘కిష్కింధపురి’ అనే కల్పిత ప్రాంతం ఉంటుందని, అక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయని, ఈ నేపథ్యంలో ఓ హారర్ కథను కౌశిక్ రెడీ చేసుకున్నారనీ భోగట్టా. ఈ సినిమాకు ‘కిష్కింధపురి’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చు.
రహస్యాలను కనిపెట్టే యువతిగా
∙ఈ ఏడాది ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘బాకు’) వంటి హారర్ సినిమాతో ఆడియన్స్‌ను ఆలరించారు తమన్నా. ఈ సినిమాలో ఓ పాజిటివ్ ఆత్మగానే కనిపించారు. అలాగే ఈ ఏడాదే విడుదలైన హిందీ బ్లాక్‌బస్టర్ హారర్ ఫిల్మ్ ‘స్త్రీ 2’లోనూ మెరిశారు తమన్నా. కానీ ఆమె పాత్రకు హారర్ టచ్ లేదు. ఓ స్పెషల్ సాంగ్‌తోనే సరిపోయింది. కాగా ప్రస్తుతం తమన్నా ‘ఓదెల 2’ అనే మైథలాజికల్ హారర్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నాగసాధువు శివశక్తి పాత్రలో కనిపిస్తారు తమన్నా. హెబ్బా పటేల్, వశిష్ఠ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ పతాకాలపై డి. మధు ఈ నిర్మిస్తున్నారు.
మరోవైపు గాంధారి కోటలోని రహస్యాలను కనిపెట్టే యువతి పాత్రలో నటించారు హన్సిక. ‘శ్రీ గాంధారీ’ సినిమా కోసం హన్సిక ఈ పాత్ర చేశారు. హారర్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్ ఇతర కీలక పాత్రధారులు. ఆర్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఇంకా సత్యం రాజేశ్ ‘పొలిమేర 3’, తిరువీర్ ‘మసూద 2’, వంటి హారర్ సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయని తెలుస్తోంది. మరికొందరు యువ దర్శకులు కూడా హారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది.
- ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment