నేను... స్వప్న... ప్రసాద్
ఇన్నాళ్లూ నేనేమిటో నాకు తెలియజెప్పడానికి చాలామంది ట్రై చేసినా ఈ మట్టిబుర్రకి అర్థం కాలేదు. కానీ... నిన్న ఓ చూపు చూసి, ఓ నిట్టూర్పు విడిచి ‘స్వప్న’అలా అనేసరికి ‘నేనేంటో’ తెలిసొచ్చింది! స్వప్న ఏం అన్నదో చెప్పాలంటే... ముందు ‘స్వప్న’ గురించి చెప్పాలి! స్వప్న గురించి చెప్పాలంటే, ‘ప్రసాద్’ గురించి చెప్పాలి! ప్రసాద్ గురించి చెప్పాలంటే, నా గురించి చెప్పాలి! నా గురించి చెప్పాలంటే ముప్ఫై ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అవి తెలుగుతెరను నలుగురు అగ్రహీరోలు నాలుగు వైపుల నుంచి అప్రతిహతంగా ఏలుతున్న రోజులు! ఆ సమయంలో... అంతులేని కథ, మరో చరిత్ర, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం అంటూ నాలుగు వైపుల నుంచి విరుచుకుపడ్డాడు బాలచందర్! సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య నలిగిపోతున్న ఆ సంధి కాలపు రోజుల్లో అప్పటి మా యువతకు పై సినిమాల ప్రభావాన్ని తట్టుకోవడం కష్టమైంది కానీ... ‘మరో చరిత్ర’ ప్రభావం నుంచి బయట పడటం దాదాపు అసాధ్యమైంది!
అజ్ఞానం, ఆకలి, నిరుద్యోగం, నిస్సహాయతల మధ్య నలిగిపోతున్న సమాజానికి మా వంతుగా ఏదైనా చేయాలని, సమాజాన్ని సమూలంగా మార్చి ‘మరో చరిత్ర’ సృష్టించాలన్న కసితో మొదలుపెట్టాం ‘మరో చరిత్ర’ ట్యూషన్ సెంటర్లు!
అప్పటికింకా విద్య వ్యాపారంగా అభివృద్ధి (?) చెందకపోవడంతో స్కూల్ ముగిసిన వెంటనే పిల్లలు ఇప్పట్లా రెసిడెన్షియల్ బోనుల్లో కాకుండా వీధుల్లో ఉండేవారు! సాయంత్రం అయ్యేసరికి పిల్లల కేరింతలతో వీధులు దద్దరిల్లిపోతుంటే, పెద్దలు పిల్లల్ని మురిపెంగా కోప్పడుతుండేవారు! ముందుగా పిల్లల్ని తద్వారా పెద్దల్ని సంస్కరించాలన్న తాపత్రయంతో మా యువత అంతా కలిసి సాయంత్రం అయిదు నుంచి ఎనిమిది గంటల వరకూ అన్ని తరగతుల వారికీ ఉచితంగా ట్యూషన్లు చెప్పేవాళ్లం!
అప్పటికి ఇరవై, ఇరవై రెండు మధ్యనున్న నేను, మా యువతకు లీడర్‌ని! అప్పుడు మాతో కలిశాడు... ప్రసాద్! మా ఊరి పిల్ల జమీందార్!
రాచరికం పోయి ప్రజాస్వామ్యానికి బాటలు పరిచిన మొదటి దశాబ్దానికి చివరి ప్రతినిధి అయిన ప్రసాద్, వెనకా ముందూ ఏమీ లేకపోయినా సమాజానికి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్న మమ్మల్ని చూసి ఆకర్షితుడై, మాతో చేరి, వాళ్ల దివాణం అరుగుమీద ట్యూషన్లు చెప్పుకోమనడమే కాక, రోజూ మాకు కాఫీ, టిఫిన్లు కూడా ఏర్పాటు చేశాడు! వాడు మాత్రం పాఠాలు చెప్పడానికి ప్రయత్నించలేదు.
ఇలా జరుగుతుండగా ఒకరోజు... ‘మా తమ్ముణ్ని కూడా ట్యూషన్‌లో చేర్చుకోండి’ అంటూ వచ్చింది స్వప్న! వెండితెరను చీల్చుకుని బయటకు వచ్చినట్లుగా... నా కలలలోంచి నేరుగా నడచి వచ్చినట్లుగా... ఆమె అసలు పేరు తెలియదు కానీ... ‘మరో చరిత్ర’ హీరోయిన్‌లా ఉండటంతో ఆ పేరే ఫిక్సయిపోయాన్నేను!
చెప్పడం మరిచా! చిన్నప్పుడు బంతిలా ఉండేవాణ్నట. అందుకని నన్నందరూ ‘బాలూ’ అని పిలుస్తారు!
స్వప్న... పద్దెనిమిదికి అటూ ఇటూగా వయసు... నేరేడు పండు నిగారింపుతో, నల్ల కలువను తెల్ల రేకులో చుట్టినట్లు, తెల్ల చీరలో నుదుట బొట్టు లేకుండా ఉంది! వాళ్ల నాన్న రైల్వేలో చిరుద్యోగట! తల్లి లేదు. ఆరుగురి పిల్లల్లో తనే పెద్ద. ట్రాన్స్‌ఫర్ నిమిత్తం ఈ ఊరు వచ్చారట. స్వప్నకు సంవత్సరం కిందటే పెళ్లయిందట! అయినా మూడు నెలలకే ‘అన్నీ’ అయిపోయాయట! ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లుగా చెప్పిందే కానీ, జరిగినదానికి ఏమీ బాధ పడుతున్నట్లు లేదు.
రోజూ తమ్ముడి వెంట వచ్చే స్వప్న, తనూ క్లాసులు తీసుకొనేది. పది వరకూ చదివిందట! ఆశయాల గురించి, ఆదర్శాల గురించి మాతో ధైర్యంగా చర్చిస్తుండేది! అప్పుడే నిర్ణయించుకున్నాను - పెళ్లంటూ చేసుకుంటే స్వప్ననే చేసుకోవాలని!
కానీ నా ఆశ, ఆశయం అమలు కాకుండా పెళ్లికెదిగిన నా చెల్లెళ్లు!
కులాంతరం. అందునా వితంతు వివాహం చేసుకుంటే, నా ఆశయం సిద్ధిస్తుంది కానీ, ఆ ప్రభావం నా చెల్లెళ్ల పెళ్లిళ్లపై పడుతుందని ధైర్యం చేయలేకపోయాను.
కానీ స్వప్నకు న్యాయం జరగాలి. ఆమెకు కొత్త జీవితం రావాలి! ఎలా?! ఆలోచించాను... ఎస్. ప్రసాద్!
ఆర్థికంగాను, సామాజికంగాను బలమైన కుటుంబం! మమ్మల్ని చూసి వాడూ ఆశయాలపై మోజు పెంచుకుంటున్నాడు. అందుకే ఓ శుభోదయాన వాణ్ని కలిసి -
‘‘స్వప్న గురించి నీ అభిప్రాయం ఏమిటి?’’ అంటే, ‘‘సదభిప్రాయమే’’ అన్నాడు ప్రశ్నార్థకంగా. ‘‘అయితే, స్వప్నను పెళ్లి చేసుకోవచ్చు కదా’’ అన్నాను.
చిరాగ్గా మొహం పెట్టి, ‘‘అదేదో నువ్వే చేసుకోవచ్చు కదా’’ అన్నాడు పెడసరంగా!
నేను నా బాధ్యతల గురించి చెప్పాను. దానికి వాడు నావైపొకసారి వింతగా చూసి, ‘‘ఆదర్శాలు పాటించడం అంటే వాటిని వల్లె వేయడం కాదు. ప్రతికూల పరిస్థితుల్లో ఎదురీదడం. పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తి తనకుమాలిన ధర్మం భుజాన వేసుకోకు. అన్నట్లు నా మేనకోడలితో నా పెళ్లి నిశ్చయమైంది’’ అంటూ విసవిసా వెళ్లిపోయాడు! వెధవ!
ఆస్తులు బయటకు పోకుండా కాపాడుకోవడానికి మేనరికం చేసుకుంటున్నాడు. ఆ సాయంత్రం స్వప్నతో ప్రసాద్‌గాడి నిర్వాకం గురించి చెప్పిన నాకు, స్వప్న ప్రతిస్పందన ఇంకా విచిత్రంగా అనిపించింది!
‘‘నా పెళ్లి విషయం నిన్నెవరు మాట్లాడమన్నారు బాలూ. అతను ఒప్పుకున్నా, నేనెలా ఒప్పుకుంటాననుకొన్నావ్?’’ ఇంచుమించు ప్రసాద్‌లానే ప్రతిస్పందించింది!
తర్వాత ప్రసాద్‌గాడి పెళ్లయిపోయి, పెళ్లాం ద్వారా వచ్చిన ఆస్తులు చూసుకోవడానికి మద్రాసు వెళ్లిపోయాడు. ‘మరో చరిత్ర’ వేడి తగ్గిపోయింది. మా ట్యూషన్ సెంటర్ పలచబడింది.
ఓ రోజు రాత్రి ఎనిమిదౌతుందనుకొంటా. వసారాలో కూర్చొని షార్ట్‌హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తున్న నా దగ్గరకు వచ్చింది స్వప్న! వాళ్ల నాన్నకు ట్రాన్స్‌ఫర్ అయిందని, ఊరు వదిలి పోతున్నామని చెప్పింది.
ఆ తర్వాత స్వప్న కనపడదు అన్న భావనకు గుండె బరువెక్కింది.
ఇన్నాళ్లూ తన తమ్ముడికి ట్యూషన్ చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పి, వెళ్లబోతూ ఒక్కసారిగా వెనుదిరిగి, నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని, నా పెదాలను చుంబించి, వేగంగా వెళ్లిపోయింది. ఒక్కసారిగా నా మెదడు అచేతనమైంది!
నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొన్నప్పుడు, ఎడం చేత్తో ఆమె నడుం పట్టుకొని, కుడి చేతిలోనికి ఆమె శిరస్సు తీసుకొని... చాలాసార్లు అనుకొన్నాను. ఏం చెయ్యను! నేను పెరిగిన వాతావరణం నా చేతులను కట్టేసింది.
తర్వాత నాకు ఉద్యోగం రావడం, మా పెద్ద చెల్లి పెళ్లి, మా నాన్నగారు పోవడం, నేను పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. స్వప్న జాడ తెలియదు. ప్రసాద్‌గాడు తన ఆస్తులు చూసుకోవడానికి అప్పుడప్పుడూ వస్తుండేవాడు.
అప్పుడే నా జీవితంలో ఊహించని దెబ్బ తగిలింది! నేను ఎంతో జాగ్రత్తగా పెంచిన మా మూడో చెల్లి ప్రేమ వివాహం చేసుకుని పోతే, నేను ఏరి కోరి చేసిన పెళ్లి కాదని, రెండో చెల్లి నా దగ్గరకు వచ్చేసింది.
నా చెల్లికి చాలావిధాలుగా నచ్చజెప్పాను. ఆ అబ్బాయిని కూడా కలిశాను. ఇద్దరూ మొండి ఘటాలే. ఒక్కటే సమాధానం - ‘తమ అభిప్రాయాలు వేరట!’
‘అయినా సర్దుకుపోవాలని’ నేనంటే, ‘‘మేమేం శత్రువులం కాదన్నయ్యా. మా మనసులు కలవలేదు. విడిగా ఉందామనుకొంటున్నాం. అయినా నీ దగ్గర ఉండనులే. సిటీలో జాబ్‌కి ట్రై చేస్తున్నాను. వస్తూ పోతాను’’ అంది. దాన్ని డిగ్రీ చదివించి ఎంత తప్పుచేశానో అర్థమైంది!
ఈ దెబ్బ నుండి కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది నాకు. ఈసారి ఊహించని షాక్ మా ఆవిడ ఇచ్చింది!
రోజులాగే ఆఫీస్ నుంచి వచ్చిన నాకు, ‘నేను మా ఇంటికి పోతున్నాను’ అన్న మా ఆవిడ లెటర్ చూసి ఒళ్లు జలదరించింది!
నా అనుమతి లేనిదే గడప దాటడానికి సాహసించని నా భార్య... పిల్లాణ్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది!
వెంటనే నేను వెళ్లేసరికి గుమ్మంలో కూర్చుని బాబుకి పాలు పడుతోంది.
‘‘ఏమిటీ పిచ్చి పని. పద.’’
‘‘ఎక్కడికి?’’ అంది అర్థం కానట్లు!
‘‘ఎక్కడికేంటి? మనింటికి.’’
‘‘ఇది నా ఇల్లే.’’
‘‘నీకేవన్నా పిచ్చి పట్టిందా?’’ కోపాన్ని ఆపుకోవడం కష్టంగా ఉంది నాకు!
‘‘వదిలింది. అందుకే వచ్చేశాను’’ కూల్‌గా అంది. చాచిపెట్టి కొట్టాను. అంతే!
‘‘ఇది నా ఊరు. ఇక్కడంతా నా జనాలు. మీ మర్యాద దక్కాలంటే హద్దుల్లో ఉండటం మంచిది’’ అంది.
‘‘ప్లీజ్. నీకే ఇబ్బందీ రానివ్వను’’
‘‘ఇబ్బందులున్నాయని అన్లేదే! మీతో ఉండటం ఇష్టం లేదు’’ స్థిరంగా అంది.
‘‘నాతో ఉండటం ఇష్టం లేనప్పుడు, నా కొడుకుని ఎందుకు తెచ్చుకున్నావ్?’’
‘‘రేపు జడ్జిగారికి ఓ మాట చెప్పి...’’
రాక్షసి తెగించింది. ఆడది ఏ మాటకు విలవిల్లాడుతుందో ఆ బాణం వదిలాను.
‘‘అంతగా రానంటున్నావ్. ఇక్కడ ఎవణ్నయినా మరిగావా?’’
ఆ మాటకు ఒక్కసారిగా రోషంతో ముక్కుపుటాలెగరేస్తూ నావైపు చూసి, ‘‘అవును. ఇన్నాళ్లకు నాకో మగాడు దొరికాడు’’ పిల్లాణ్ని చంక మార్చుకుంటూ అని మొహం మీదే తలుపు వేసేసింది!
*
చూస్తుండగానే కాలం ఇంకొన్ని సంవత్సరాలు మింగేసింది!
ఓ రోజు ప్రసాద్ ఓ వంద మంది పిల్లల్ని తీసుకుని వేసవి సెలవుల నిమిత్తం మా ఊరు వచ్చాడు. ఏదో ట్రస్ట్ కూడా పెట్టాడట. ట్యాక్స్ ఎగవేత కోసమేమో!
విషయం ఏంటో తెలుసుకుందామని వాడింటికి వెళ్లాను. వాడు, వాడి భార్య సాదరంగా ఆహ్వానించారు. వృద్ధాశ్రమం కూడా ఉందట. భోజనాల సమయం కావడంతో వాడి భార్య మా ఇద్దరికీ వడ్డిస్తుంటే, ప్రసాద్ ఆమెతో ‘‘తిన్నాడా?’’ అని అడిగాడు ఎవర్నో ఉద్దేశించి!
‘లేదంటూ’ లోపలికి వెళ్లి, ఓ ఐదేళ్ల పసివాణ్ని తీసుకొచ్చింది. అన్నం తినకుండా అలిగాడట. గిటార్ కొనాలట! వచ్చిన విజిటర్స్ నుంచి డొనేషన్లు వసూలు చేయడానికి ఇదో పద్ధతేమో!
ప్రసాద్ ఆ పసివాణ్ని బుజ్జగిస్తూ, ‘‘నువ్వు చిన్నపిల్లాడివి కదా. పెద్దయ్యాక కొంటాను. అన్నం తిను’’ అన్నాడు. విననట్లు తల తిప్పేశాడు పిల్లాడు.
బంగారు రంగులో బాలకృష్ణునిలా ఉన్న పసివాణ్ని చూస్తే ముచ్చటేసింది.
‘‘నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే, గిటార్ కొనిస్తాను’’ అన్నాను.
వాడు నావైపు చూసి, ‘‘మా క్లాస్‌కి నేనే ఫస్ట్’’ అన్నాడు కొంచెం గర్వంగా!
ఆ మాటకు ప్రసాద్ నవ్వుతూ, ‘‘సర్లే. రేపు కొంటాను. అన్నం తిను’’ అన్నాడు.
మెరుస్తున్న కళ్లతో పిల్లాడు ప్రసాద్‌ను చూస్తూ, ‘ప్రామిస్’ అని చెయ్యి చాపాడు.
‘‘ఆ డబ్బు నేనిస్తాను’’ అన్నాను పిల్లాడి చేతిలో చెయ్యి వేసి!
‘‘తీసుకెళ్లి అన్నం పెట్టు’’ అంటూ పిల్లాణ్ని ఆయాకు అప్పగించాడు ప్రసాద్!
ఆ పసివాణ్ని చూసిన తన్మయత్వంలో నేను, ప్రసాద్‌ను ‘‘నీకెంతమంది పిల్లలు?’’ అని అడిగాను.
దానికి వాడు చిన్నగా నవ్వుతూ, ‘‘పిల్లలు వద్దనుకొన్నాం బాలూ. మొదటి నుంచీ మా ఇద్దరికీ సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉండేది. మేం ప్రేమించుకోవడానికి అదో కారణం. అందుకే పెళ్లయిన వెంటనే కుటుంబ నియంత్రణ చేయించుకొన్నాం’’ అన్నాడు.
నాకు షాకింగ్‌గా ఉంది. నా అంచనా తప్పుతోంది!
‘‘పిల్లలు లేకపోవడం ఏమిటి? డజను మంది మనవలు కూడా ఉన్నారు. నా పిల్లలు ఇప్పుడు విదేశాల్లో కూడా ఉన్నారు తెలుసా?’’ మొహంలో ఆనందం తొణికిసలాడుతుండగా చెప్తోంది ప్రసాద్ భార్య!
భోజనాల తర్వాత, నేను గిటార్ డబ్బుకు చెక్కు ఇవ్వబోతుంటే, ‘‘డొనేషన్లు తీసుకోం బాలూ. కేవలం మా ఆస్తులతోనే వీటిని రన్ చేయాలనుకున్నాం’’ గర్వంగా చెబుతున్న వాడి కళ్లలో ఏదో చైతన్యం!
మాటల సందర్భంలో స్వప్న కనిపించిందని, రైల్వేలో జాబు చేస్తోందని చెప్పాడు. నా గుండె గొంతులోకి వచ్చినట్లయింది! ‘‘పెళ్లయిందా?’’ ఆతృతగా అడిగితే, ‘‘తెలీదు’’ అన్నాడు ఆ విషయానికి అంత ప్రాముఖ్యం లేనట్లు!
నాకు వెంటనే స్వప్నను చూడాలని ఉంది. వాడి దగ్గర అడ్రెస్ తీసుకుని వెతుక్కుంటూ వెళ్లాను.
స్వప్నే తలుపు తీసింది. మనిషి ఏం మారలేదు కానీ, తల కొంచెం నెరసి హుందాగా ఉంది. ఆశ్చర్యంతో రిసీవ్ చేసుకుంది!
తండ్రి పోయిన తర్వాత ఆ ఉద్యోగం ఆమెకు ఇచ్చారట. చెల్లెళ్లని, తమ్ముళ్లని చదివించి, అందరికీ పెళ్లిళ్లు చేసిందట. ప్రస్తుతం ఇక్కడే ఒంటరిగా ఉంటోందట!
జీవన సాగరాన్ని ఈదిన పరిణతి ఆమె మొహంలో ప్రతిఫలిస్తోంది.
‘‘పెళ్లి చేసుకోలేదేం?’’ అని అడిగితే,
‘‘ఆ ఊహే రాలేదు... ఈ పనులలో పడి’’ అంది నవ్వుతూ.
నా గురించి పూర్తిగా చెప్పి, ‘‘మనం పెళ్లి చేసుకుందామా?’’ అడిగాను.
నా కళ్లలోకి చూసి నవ్వుతూ, ‘‘నువ్వేం మారలేదు బాలూ’’ అంది.
‘‘అది కాదు. అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని గ్రహించలేకపోయాను.’’
‘‘నువ్వింకా అక్కడే ఉన్నావా బాలూ? తలచుకొంటే ఇప్పుడు సిల్లీగా ఉంటోంది. ఇంత జీవితం గడిపాక, వెనక్కి చూసుకుంటే ఆ భావాలు, ప్రేమలు, పెళ్లిళ్లు... ఎంత అల్ప విషయాలో తెలుస్తోంది.’’
ఆడదై ఉండి ఒంటరి జీవితం గడుపుతున్న స్వప్నను చూసి, నేనెందుకు ఒంటరిగా ఉండలేను అనిపించి వచ్చేశాను. అలా ఒంటరితనానికి అలవాటుపడిన నా దగ్గరకు ఓ రోజు మా రెండో చెల్లి వచ్చింది.
మాటల సందర్భంలో, ‘‘మొన్న ఆఫీస్ నుండి వస్తుంటే, వదిన కనిపించింది. ఇంటికి తీసుకెళ్లి టీ పెట్టి ఇచ్చింది’’ అంది. నాకు చాలా కోపం వచ్చింది.
‘‘అది ఇంటికి పిలిస్తే వెళతావా? తను నన్ను కాదని పోయింది తెలుసా?’’
‘‘మీ ఇద్దరికీ పొసగలేదు. విడిపోయారు. మధ్యలో మాకు శతృత్వం ఏమిటి? అయినా మా విడాకుల విషయంలోనూ నువ్వు ఇలానే స్పందించావ్. ప్రతి ఒక్కరినీ నీ కోణంలోంచి చూడటం మానుకో అన్నయ్యా’’ అంది.
నా కళ్ల ముందు పుట్టిన పిల్ల నాకు తత్వం బోధిస్తుంటే, బాధగా అనిపించింది. ఓ విధమైన విరక్తితో మిగిలిన జీవితాన్నైనా ప్రశాంతంగా గడుపుదామని ప్రసాద్ ఆశ్రమంలో చేరడానికి వెళ్లాను.
నన్ను రిసీవ్ చేసుకొన్న ఆయా -
‘‘సార్ ఢిల్లీ వెళ్లారు. మేడమ్‌ను పిలుస్తాను కూర్చోండి’’ అని లోపలికి వెళ్లింది.
గోడకి ఉన్న మదర్ థెరిస్సా ఫొటో చూస్తూ కూర్చున్నాను. కర్టెన్ తొలగించుకుంటూ కాళ్లకి మెట్టెలు, మెళ్లో సూత్రాలతో నిండు ముత్తయిదువలా గదిలోకి ప్రవేశించింది... స్వప్న! ఒక్కసారిగా షాకయ్యాను.
‘‘చెప్పండి’’ అంటూ నన్ను చూసి ఆశ్చర్యపోయి, ‘‘ఏంటి ఇలా వచ్చావ్?’’ అంది ప్రసాద్ కూర్చునే సీట్లో కూర్చుంటూ.
గోడకి ఉన్న మదర్ థెరిస్సా ఫొటో చూస్తూ కూర్చున్నాను. కర్టెన్ తొలగించుకుంటూ కాళ్లకి మెట్టెలు, మెళ్లో సూత్రాలతో నిండు ముత్తయిదువలా గదిలోకి ప్రవేశించింది... స్వప్న!
ఒక్కసారిగా షాకయ్యాను.
‘‘నువ్వేంటి ఇక్కడ?’’ నా గొంతు పొడిబారుతోంది.
‘‘ప్రసాద్‌ని పెళ్లి చేసుకున్నాను.’’
బాంబ్ పేలినట్లుగా వినబడింది నాకు!
‘‘నెలరోజుల కిందట ప్రసాద్ భార్య చనిపోయింది. చాలా రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. అంతిమ సంస్కారాలు చేయవద్దనీ, తన శరీరాన్ని ఏదైనా హాస్పిటల్‌కు దానం చేయమనీ ఆమె కోరడంతో ఎవరికీ చెప్పలేదు.’’
‘‘మరి ప్రసాద్ నిన్ను చేసుకోవడమేంటి?’’
‘‘ప్రసాద్ నన్ను చేసుకోలేదు. నేనే ప్రసాద్‌ని చేసుకున్నాను.’’
రెంటికీ తేడా అర్థం కాని నేను, ‘‘నీకు పెళ్లి ఇష్టం లేదనీ, అది చాలా స్వల్ప విషయం అన్నావ్’’ అన్నాను.
అందుకామె నావైపు నిర్లిప్తంగా చూస్తూ, ఓ నిట్టూర్పు విడిచి, ‘‘నువ్వు మారవు బాలూ’’ అంది.
జీవితంలో మొదటిసారి నాకు, నా గురించి తెలిసింది!
- . దొడ్డిగల్లు నారాయణరావు