టాలీవుడ్‌లో ఎందరో స్టార్ హీరోలకు తల్లిగా నటించి, అలరించిన సుజాత అందరికీ గుర్తుండే ఉంటారు. పాత తరం అందరి అగ్రకథానాయకల సరసన సుజాత హీరోయిన్‌గా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ చిత్రాలలో నటించి అలరించిన సుజాత కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించారు. సహజనటిగా పేరు సంపాదించిన సుజాత అనేక తెలుగు చిత్రాలలో కీలక పాత్రలు పోషించి ఇక్కడ చెరగని ముద్ర వేశారు.
(ఇదీ చదవండి: వీళ్లది అలాంటి ఫ్రెండ్‌షిప్.. స్టార్ హీరోలు అయినా సరే!)
సుజాత స్వతహాగ మళయాలి. కానీ ఆమె శ్రీలంకలోని గల్లేలో జన్మించింది. ఆమె బాల్యం కూడా శ్రీలంకలోనే గడిచింది. హైస్కూల్ చదువు పూర్తి కాగానే తొలిసారి 'ఎమకులమ్ జంక్షన్' అనే మళయాళ చిత్రంలో తొలిసారి నటించారామె. తర్వాత కె.బాలచందర్ దృష్టిని సుజాత ఆకర్షించారు. బాలచందర్ తెరకెక్కించిన 'అవల్ ఒరు తోడర్ కథై'లో ప్రధాన పాత్ర పోషించారామె. సుజాత నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. తెలుగులో 'అంతులేని కథ'గా వచ్చింది. తర్వాత బాలచందర్ తెరకెక్కించిన 'అవర్గల్' (ఇది కథ కాదు) మూవీ కూడా సుజాతకు నటిగా మంచి పేరు తెచ్చి పెట్టింది.
దాసరి నారాయణరావు సినిమాతో ఎంట్రీ
అలా మంచి క్రేజ్‌లో ఉన్న సుజాతను దాసరి నారాయణరావు 'గోరింటాకు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశారు. తెలుగులో మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకుంది. తర్వాత దాసరి డైరెక్షన్‌లో ఏయన్నార్, సీనియర్ ఎన్టీఆర్,కృష్ణంరాజు, కృష్ణలతో పలు సినిమాల్లో నటించారు. గుప్పెడు మనసు, పండంటి జీవితం, రగిలే జ్వాల, ప్రేమతరంగాలు, బంగారు కానుక, బహుదూరపు బాటసారి, సూత్రధారులు వంటి సూపర్ హిట్ చిత్రాలలో సుజాత కీలక పాత్రలు పోషించారు. వెంకటేష్ 'చంటి'లో తల్లి పాత్రలో అలరించిన సుజాత.. 'పెళ్ళి'లో పృథ్వీకి తల్లిగా కనిపించి మెప్పించారు.
భర్త అనుమానంతో ఎన్నో ఇబ్బందులు
అలా తెలుగు తెరకు పరిచయం ఉన్న ప్రముఖ హీరోలందరీ సినిమాల్లో నటించిన ఆమె నిజ జీవితం మొత్తం కన్నీటి గాథలే. ఇంట్లో పెద్దలకు నచ్చకపోయిన జయశంకర్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో అతను పచ్చళ్ల వ్యాపారం చేసేవాడు. అప్పట్లోనే విదేశాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించాడు. కొద్దిరోజుల తర్వాత తన వ్యాపారం అంతగా జరగకపోవడంతో రానురాను పూర్తిగా సుజాత సంపాదన మీదనే ఆధారాపడ్డాడు. అక్కడి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. పచ్చళ్ల వ్యాపారాన్ని క్లోజ్ చేసిన తర్వాత జయశంకర్ కూడా సుజాతతో పాటు సినిమా షూటింగ్ వద్దకు వెళ్లేవాడు.
అక్కడ ఆమె ఎవరితోనైనా మాట్లాడుతూ కనిపిస్తే చాలు అనుమానంతో ఆమెపై రెచ్చిపోయేవాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సుజాతపై మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా హింసించేవాడు. ఆ భయంతో ఆమె సినిమా సెట్లో ఎవరితో మాట్లాడకుండా ఉండేవారు. భర్తతో ఎన్ని గొడవలు ఉన్నా పిల్లల చదువుల విషయంలో ఆమె నిర్లక్ష్యం చేయలేదు. కుమారుడు సాజిత్ సాఫ్ట్‌వేర్ రంగంలో, కూతురు దివ్య డాక్టర్‌గా స్థిరపడ్డారు. అయితే భర్తకు ఆమెపై ఉన్న అనుమానం రోజురోజుకూ పెరుగుతూ రావడం వల్ల చాలా సినిమా అవకాశాలను వదులుకుంది.
(ఇదీ చదవండి: రామ్ చరణ్,జూ.ఎన్టీఆర్.. ఉత్తమ హీరో ఎవరో తేలనుందా..?)
తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతింది. రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆమెకు మంచి గుర్తింపుతో పాటు సినిమా అవకాశాలు భారీగా వస్తున్న సమయంలో మంచాన పడ్డారు. అలా 2011 ఏప్రిల్ 6న చెన్నైలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. అలా ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కన్నీటితోనే కాపురం చేసింది. అలా బతికుండగానే చితికి నిప్పుపెట్టినట్లు ఆమె జీవితం ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment