నల్ల పిల్ల హీరోయినా..? | The film was introduced as a actor by the movie | Sakshi
Sakshi News home page

మరో సరిత

Published Sun, Jan 27 2019 2:10 AM | Last Updated on Sun, Jan 27 2019 7:44 AM

The film was introduced as a actor by the movie - Sakshi

ఇది వెండితెర వెనకాల కథ
ఏ ఇంటి అమ్మాయికీ జరగకూడని కథ
ఇప్పటివరకూ బయటపడని కథ
మగాహంకారం కప్పేసిన కథ
ఒక మహిళకు ఉన్న పోరాట గుణం చెప్పే కథ
సరైన కథ.. మరో సరిత కథ.

వెండితెరపై అద్భుతంగా నటించే సరిత తెర మీద కనిపించే వేరే నటీమణుల పాత్రలకు తెరవెనక తన గొంతుతో ప్రాణం పోస్తుంటారు. ‘మరో చరిత్ర’  ఆమె తొలి చిత్రం. నటిగా 40 ఏళ్లు. 150కి పైగా సినిమాలు, ఎందరో నటీమణులకు డబ్బింగ్‌.. సరిత ఇప్పుడు తెర మీద కనిపించకపోయినా వినిపిస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ వేడుకలో పాల్గొనడానికి దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆమెతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

‘మరో చరిత్ర’లాంటి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమా ద్వారా కథానాయికగా పరిచయమయ్యారు. ఈ రిజల్ట్‌ని ఊహించే వయసు కాదు కాబట్టి ఆశ్చర్యపోయి ఉంటారేమో?
సరిత:
నిజమే. టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆ సినిమా చేశాను. సినిమా అంటే ఏంటో తెలియదు. ఇక హిట్, ఫ్లాప్‌ గురించి తెలియని ఏజ్, స్టేజ్‌. బాలచందర్‌గారితో చేసిన ఆ సినిమా నాకో మంచి లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఆ సక్సెస్‌ పెద్ద సర్‌ప్రైజ్‌. రోజులు కాదు.. సంవత్సరాలు ఆడింది. అలాంటి హిట్‌ మళ్లీ నా కెరీర్‌లో రాలేదు. లవ్‌ స్టోరీస్‌ అంటే ‘మరోచరిత్ర’లా ఉండాలి అన్నట్లు ఆ సినిమా ఓ బెంచ్‌మార్క్‌ అయిపోయింది. ఇప్పటికీ ఆ సినిమాలోని సన్నివేశాలను కొన్ని సినిమాల్లో వాడటం భలే అనిపిస్తుంది.

అసలు బాలచందర్‌గారి కళ్లలో ఎలా పడ్డారు?
మా నాన్నగారు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా, ఫైనాన్షియర్‌గా ఉండేవారు. రైటర్‌ గణేశ్‌ పాత్రోగారు మా నాన్నగారికి ఫ్రెండ్‌. ఆయనోసారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నా. నేను స్కూల్‌ నుంచి వచ్చి, షూస్‌ విప్పి లోపలకు వెళ్లిపోయాను. గణేశ్‌గారు మా నాన్నగారిని ‘పాప యాక్ట్‌ చేస్తుందా? బాలచందర్‌గారు హీరోయిన్‌ కోసం చూస్తున్నారు. కొత్తమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికి 160 మందిని చూశారు’ అని మా నాన్నగారితో అన్నారట. నాకప్పుడు పధ్నాలుగేళ్లే అయినా వయసుకి మించి కనిపించేదాన్ని. గణేశ్‌గారు నాకు పదహారేళ్లు ఉంటాయనుకున్నారు. మా నాన్న నన్ను పిలిచి, ‘యాక్ట్‌ చేస్తావా?’ అని అడిగితే, ‘నో’ అన్నాను. ఆయన వెళ్లిపోయాక నాన్నగారు ‘ఇది కమల్‌హాసన్‌ పిక్చర్‌’ అన్నారు. నా ముఖం బల్బ్‌లా వెలిగిపోయింది. ఒప్పుకున్నాను. మర్నాడు స్కూల్‌కు సెలవు పెట్టి షాపింగ్‌కు వెళ్లాం. చీర, బ్లౌజ్‌ కొనడానికి. అది కట్టుకుని ఆడిషన్స్‌కి వెళ్లాలనుకున్నాను.

మోడ్రన్‌ డ్రెస్‌లో వెళ్లాలని ఎందుకు అనుకోలేదు? అంతకుముందు చీర కట్టుకునే అలవాటు ఉందా?
చీర అలవాటు లేదు. అయితే మామూలు డ్రెస్‌లో చిన్నపిల్లలా కనిపిస్తే హీరోయిన్‌ లుక్‌ లేదని సెలక్ట్‌ చేయరనుకున్నా. అంతకుముందు ‘అనార్కలి’ అనే సినిమాకు టెస్ట్‌ చేసి చిన్నపిల్లలా ఉన్నానని తీసుకోలేదు. రిజెక్షన్‌ అంటే నాకు ఇష్టం ఉండదు. అప్పటికి ‘మరోచరిత్ర’ కోసం 160 మందిని చూశారు. వాళ్లలా రిజెక్ట్‌ కాకూడదనుకున్నాను. నాకింకా గుర్తు. ‘పర్ఫెక్ట్‌ టైలర్స్‌’ అనే టైలరింగ్‌ షాప్‌ ఉండేది. అక్కడే నా ఫస్ట్‌ బ్లౌజ్‌ కుట్టించుకున్నాను. చీర కట్టుకుని, నేను నచ్చకుండా ఉండకూడదు అనే ఫీలింగ్‌తో వెళ్లాను. యన్టీఆర్‌గారి మేకప్‌మేన్‌ పీతాంబరంగారే మేకప్‌ చేశారు. బాలచందర్‌గారు ఆడిషన్‌ చేశారు. సెలక్ట్‌ అయ్యాను. అయితే ఫస్ట్‌డే సజావుగా సాగలేదు. 

ఏమైంది?
కమల్‌హాసన్‌గారి చేతిని ముద్దుపెట్టుకుని, ‘ఏం? తప్పా?’ అని అడగాలి. అప్పుడు ఆయన ‘ముద్దు పెట్టుకున్న చోటే తప్పు’ అంటారు. నేను సిగ్గుపడుతున్న ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వాలి. అది రాలేదు. 7 టేక్స్‌ అయ్యాయి. మా నిర్మాతగారు నన్ను పంపించడానికి టికెట్స్‌ బుక్‌ చేయడానికి వెళ్లిపోయారు. సాయంత్రం బాలచందర్‌గారి అసోసియేట్‌ అనంత్‌ నాతో ‘కమల్‌ అంటే ఇష్టమేనా? అని అడిగారు. ‘చాలా’ అన్నాను. ‘అది ఫేస్‌లో చూపించాలి’ అన్నారు. మర్నాడు షూటింగ్‌లో కమల్‌గారి మీద ఉన్న ఇష్టాన్ని ముఖంలో చూపించాను. సీన్‌ ఓకే అయింది.

‘మరోచరిత్ర’కు మిమ్మల్ని తీసుకున్నప్పుడు ‘నల్ల పిల్ల హీరోయినా?’ అనే కామెంట్స్‌ వినబడ్డాయి. మీరేమైనా హర్ట్‌ అయ్యారా?
అలా అన్నారని రియాక్ట్‌ అవ్వాలని కూడా తెలియదు. సినిమా రిలీజయ్యాక అమ్మాయి వల్లే పిక్చర్‌ రన్‌ అవ్వడం లేదు. తనే మైనస్‌ అని రాశారు. కానీ సెకండ్‌ వీక్‌కు ఈ అమ్మాయే ఈ సినిమాకు ప్లస్‌ అన్నారు. యాక్చువల్‌గా హిందీ రీమేక్‌లోనూ కమల్‌హాసన్‌గారు నన్నే చేయమన్నారు కూడా. ఆ సంగతలా ఉంచితే నాకు ఫెయిర్‌గా ఉండేవాళ్లంటే ఇష్టం. కానీ తర్వాత నా రంగే నాకు ప్లస్‌ అని, టాలెంటే ముఖ్యం అనితెలుసుకున్నాను.

రిజెక్షన్‌ అంటే ఇష్టపడనన్నారు. ఒకవేళ ‘మరో చరిత్ర’కు సెలక్ట్‌ కాకపోయుంటే? 
చదువుకునేదాన్ని. అయితే ‘మరో చరిత్ర’ తర్వాత ఇక నాకు చదువుకునే అవకాశం దక్కలేదు. ఎనిమిదో తరగతితోనే చదువు అయిపోయింది. అందుకే మా పిల్లలను బాగా చదివిస్తున్నాను. 

సౌందర్య, విజయశాంతి, నగ్మా, రమ్యకృష్ణ, సిమ్రాన్, టబు, నదియా.. ఇలా చాలా మందికి డబ్బింగ్‌ చెప్పారు.. చెబుతున్నారు. అసలు డబ్బింగ్‌ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు?
డబ్బింగ్‌ జర్నీ బ్యూటిఫుల్‌ అంటాను. ఫస్ట్‌ దాసరి నారాయణరావుగారు స్టార్ట్‌ చేశారు. ‘గోరింటాకు’ పిక్చర్‌కు అడిగారు. అందులో సావిత్రిగారికి డబ్బింగ్‌ చెప్పాను. డబ్బింగ్‌కి నన్ను ఎందుకు అడుగుతున్నారా? అనుకున్నాను. నా వాయిస్‌ బాగుంటుందని, డబ్బింగ్‌ బాగా చెబుతానని నాకు నేను తెలుసుకోవడానికి టైమ్‌ పట్టింది. సౌందర్య, విజయశాంతి, నగ్మా వాళ్లైతే సరిత డబ్బింగ్‌ చెబితే బావుంటుందని నా పేరుని సూచించేవారు కూడా. డైరెక్ట్‌గా కాల్‌  చేసి ‘సరూ.. చెప్పు’ అని అడిగేవారు. హీరోయిన్‌గా మూడు షిఫ్ట్స్‌ పని చేసినప్పటికీ రాత్రంతా కూర్చుని డబ్బింగ్‌ చెప్పేదాన్ని. టఫ్‌గా ఉండేది. కానీ స్నేహితుల కోసమే కదా అని హ్యాపీగా అనిపించేది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాను. డబ్బింగ్‌ పూర్తి స్థాయి ప్రొఫెషన్‌ అయింది. 

పెళ్లి తర్వాత బ్రేక్‌ ఎందుకు తీసుకున్నారు?
నేను కావాలని తీసుకున్న నిర్ణయం అది. నా పిల్లల్ని ఆయాలకు వదిలేసి, పని చేయలేను. యాక్టింగ్‌ అంటే 100 శాతం, డబ్బింగ్‌ అంటే 100 శాతం.. ఇలా ఏ పని చేసినా నా బెస్ట్‌ ఇవ్వాలనుకుంటాను. మా అబ్బాయికి పది నెలల వయసప్పుడు ‘కుట్టయేట్టన్‌’ అనే మలయాళ సినిమా చేశాను. బాబుకు పాలు పట్టి రండి అని బ్రేక్స్‌ కూడా ఇచ్చేవాళ్లు. కానీ నా వర్క్‌ని ఎంజాయ్‌ చేయలేకపోయాను. బిడ్డకు, పనికి నా బెస్ట్‌ ఇవ్వడం లేదనే ఫీలింగ్‌ కలిగింది. బాబు ఏం చేస్తున్నాడో అనే ఆలోచన. ఇదే నా లాస్ట్‌ సినిమా అని నిర్ణయించేసుకున్నాను.

అలా బ్రేక్‌ తీసుకున్నందుకు పశ్చాత్తాపం ఏమైనా?
లేదు. యాక్టింగ్‌కు బ్రేకిచ్చినా సినిమాలకు టచ్‌లోనే ఉన్నాను కదా. డబ్బింగ్‌ చెబుతూనే ఉన్నాను. అయితే కొన్ని మంచి సబ్జెక్ట్స్‌ మిస్సయ్యాను. వాటిలో తమిళంలో ‘మగళిర్‌ మట్టుమ్‌’ (తెలుగులో ‘ఆడవాళ్లకు మాత్రమే’) అనే సినిమా ఒకటి. కమల్‌హాసన్‌ అయితే ‘వాహినీ స్టూడియోలో ఊయల పెట్టిస్తాను. నువ్వు మాత్రం ఈ సినిమా చేయాల్సిందే’ అన్నారు. నేను మ్యానేజ్‌ చేయలేనని చెప్పాను.

‘నీకింకా పదిరోజులు టైమ్‌ ఇస్తాను ఆలోచించుకో’ అని లండన్‌ వెళ్లిపోయారు. అక్కడినుండి ఫోన్‌ చేశారు. అప్పుడు నో అన్నాను. తిట్టేశారు. ‘ఇలా అనుకుంటే నువ్విక వర్క్‌ చేయలేవు’ అని కోప్పడ్డారు (నవ్వుతూ). 

భర్త (మలయాళ నటుడు ముఖేష్‌) సపోర్ట్‌ చేస్తే స్త్రీలకు వాళ్ల వృత్తిలో కొనసాగడం సులువు అవుతుంది. మీ భర్త సహకారం అందలేదా?
మా ఆయన సపోర్ట్‌ అస్సలు లేదు.

ముఖేష్‌గారు, మీరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా?
నాకు ఆయన కరెక్ట్‌ కాదు. ఆ తర్వాత తెలిసింది. ఆప్యాయత, అనురాగాలు ఏం లేవు మా మధ్యలో. దేవుడు నాకు బంగారం లాంటి ఇద్దరి పిల్లల్ని ఇచ్చాడు. అది చాలని అనుకుంటున్నాను. ఆయన మీద డిపెండ్‌ కూడా అవ్వడం లేదు. ఎందుకంటే బాధ్యతలు పంచుకోవడంలో ఆయనెప్పుడూ మాతో లేరు. 

మనసులు కలవలేదనే విడాకులు తీసుకున్నారా?
నాకు డైవర్స్‌ ఇవ్వకుండానే ఆయన వేరే పెళ్ళి చేసుకున్నాడు. ఫ్రాడ్‌ చేసి డైవర్స్‌ పేపర్స్‌ తీసుకున్నాడు. మేమిద్దరం సెలబ్రిటీలం. డైవర్స్‌ తీసుకున్నా, డైవర్స్‌కు అప్లై చేసినా కచ్చితంగా మీడియాలో వస్తుంది. కానీ మేమిద్దరం విడాకులు తీసుకోవాలనుకుంటున్నామని, తీసుకున్నామని న్యూస్‌ వచ్చిందా? ఎందులోనూ రాలేదు. ఒకవేళ  నేను ఈ విషయం మీద కేసు పెడితే ఏడేళ్లు జైలులో ఉండిపోతాడు. కానీ అలా చేయలేను. ఎందుకంటే నేను ఏ లాయర్‌ను అపాయింట్‌ చేసుకున్నా వాళ్లను కొనేస్తున్నాడు. ఎవరూ నిలబడలేదు. నిలబడనివ్వలేదు. నాకు ఇలా జరిగిందనే బాధకంటే ఈ వ్యవస్థ ఇలా ఉన్నందుకు ఎక్కువ బాధ కలిగింది. మన పిల్లలు ఈ సమాజం నుంచి ఏం నేర్చుకుంటారు? అనే బాధ. ఈ సిస్టమ్‌ తప్పుని తప్పు అని ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే ఆయన చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన్ని ఏమీ చేయలేం. నువ్వు నన్ను కేరళాలో ఏమీ చేయలేవు అని డైరెక్ట్‌గా చాలెంజ్‌ కూడా విసిరాడు. దాంతో ఆ విషయాన్ని దేవుడికి వదిలేశాను. నా ఇద్దరు కొడుకులే నా ధైర్యం.

పిల్లలకు బాధ లేదా?
ఉండకుండా ఎలా ఉంటుంది? కానీ వాళ్లు నాతోనే ఉండాలనుకున్నారు. నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. వాళ్ల కోసం బతుకుతున్నాను. నా బాధ అంతా సెలబ్రిటీస్‌కే ఇలా ఉంటే మామూలు అమ్మాయిల పరిస్థితి ఏంటి? మీడియాను కూడా తనవైపే తిప్పుకుంటున్నాడు. కేరళలో ఉన్న ఓ ప్రముఖ దినపత్రిక వాళ్లు నన్ను ఓ 5 గంటలు ఇంటర్వ్యూ చేశారు. మా పిల్లలతో కూడా మాట్లాడారు. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి కాల్‌ చేసి మా ఎడిటర్‌గారికి మీ ఆయన ఫోన్‌ చేశారు అని చెప్పింది. ఆ ఇంటర్వ్యూ బయటకు రాదని అర్థమైంది. ఇంటర్వ్యూ బయటకు రాకూడదని ఎందుకు అంటారు? తప్పు వాళ్ల వైపు ఉండబట్టే కదా. ఆయన లా చదువుకున్నాడు. ఆయన క్లాస్‌మేట్స్‌ అందరూ లాయర్లు, జడ్జీలు. పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. 

ఈ సంఘటన వల్ల పిల్లలను పెంచే విధానంలో ఏదైనా మార్పు వచ్చిందా?
మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి మనం మన పిల్లలను పెంచుతాం. నా జీవితం నాకిప్పటి వరకూ నేర్పిన పాఠాలను పిల్లల పెంపకానికి ఉపయోగిస్తున్నాను. అయితే సిస్టమ్‌ను నేనెలా మార్చగలను? పెళ్లి విషయంలో నాకు జరిగినది తెలుసుకుని, ‘మమ్మీ.. డబ్బులుంటే న్యాయాన్ని కొనేయొచ్చుగా’ అంటున్నారు. అది ఎంత ప్రమాదకరమైన ఆలోచన? ఆ ఆలోచనతో పిల్లలు పెరగకూడదు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణిలో ఉంటారు. మేం మాట్లాడుకున్న లాయర్‌ వాళ్ల వైపు వెళ్లేసరికి మా పిల్లలు బాగా అప్‌సెట్‌ అయ్యారు. ఆ టైమ్‌లో నేను కూడా అలా అయిపోతే పిల్లలు వీక్‌ అవుతారు. అందుకే నా బాధను బయటకు చూపించలేదు. ఎందుకంటే ఏం జరిగినా ధైర్యంగా ఉండాలని వాళ్లు నేర్చుకోవాలనుకున్నా. 

ఇప్పుడు కూడా పిల్లల కోసం దుబాయ్‌లోనే ఉంటున్నారు. సినిమా చాన్సులు వస్తే?
నా పిల్లలు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. నా ఫస్ట్‌ ప్రయారిటీ వాళ్లే. ఒక అబ్బాయి డాక్టర్, రెండో అబ్బాయి ఇన్సూరెన్స్‌ కంపెనీలో వర్క్‌ చేస్తున్నాడు. నా జీవితాన్ని సంపూర్ణం చేసేది వాళ్లే కాబట్టి నేనూ పిల్లలతోపాటు దుబాయ్‌లో ఉంటున్నాను. మంచి సినిమాకి అవకాశం వస్తే షూటింగ్‌ చేసి మళ్లీ వెళ్లిపోతాను. ఒక్కసారి మళ్లీ మేకప్‌ వేసుకుంటే బ్యాక్‌ ఆన్‌ ట్రాక్‌లా ఉండాలి. అంత మంచి క్యారెక్టర్‌ రావాలి. ఎందులో అయినా కాంప్రమైజ్‌ అవుతాను కానీ పాత్ర విషయంలో కాంప్రమైజ్‌ కాను. ఇప్పటికీ డబ్బింగ్‌ చెబుతున్నాను.

మీ పిల్లలకు సినిమాల మీద ఆసక్తి ఉందా?
ఉంది. కచ్చితంగా వస్తారు. ఇద్దరూ ఆరడుగుల పైనే ఉంటారు. హీరోలుగానే వస్తారు. ఈ ఏడాదిలోనే వద్దాం అనుకుంటున్నారు. దేవుడి దయ వల్ల మంచి బ్రేక్‌ రావాలి. 

వ్యక్తిగతంగా పెళ్లి విషయంలో చేదు అనుభవం ఎదురైంది. వృత్తిపరంగా ఏమైనా?
కెరీర్‌వైజ్‌గా అలాంటిదేం లేదు. కానీ ఇప్పుడు కొందరు ఆర్టిస్టులు చేదుఅనుభవాలు ఎదురయ్యాయని చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బాధగా కూడా ఉంది.

ఆ రోజుల్లో పని వాతావరణం ఎలా ఉండేది?
ప్రతి ఒక్కరూ వేరేవాళ్లను గౌరవించుకునేవాళ్లం. షూటింగ్‌లో ఒక్కచోటే కూర్చునేవాళ్లం. ఇప్పుడు ఎవరి కార్‌వ్యాన్‌లో వాళ్లు ఉంటున్నారు. డబ్బింగ్‌  చెబుతూ ఇంకా ఇండస్ట్రీతో టచ్‌లోనే ఉన్నాను కాబట్టి ఈ మార్పులు తెలుస్తున్నాయి. మద్రాస్‌లో వాహినీ, ఏవీయం స్టూడియోస్‌లో ఎక్కువగా షూటింగ్స్‌ జరిగేవి. ఎవరి షూటింగ్‌లో వాళ్లు ఉన్నా లంచ్‌ టైమ్‌లో కలిసేవాళ్లం. శ్రీదేవి అమ్మగారైతే లంచ్‌ ప్రిపేర్‌ చేసి, దేవుడికి నైవేద్యం పెట్టి మా అందరికీ కలిపి ముద్దలు పెట్టేవారు. అంత బాగుండేవాళ్లం. 

మీకు వంట వచ్చా? షూటింగ్స్‌కు వండి తీసుకెళ్లిన సందర్భాలున్నాయా?
బాగా వచ్చు. ‘అర్జున్‌’ సినిమా అప్పుడు బిర్యానీ చేశాను. దర్శకుడు గుణశేఖర్‌గారి దగ్గర ‘మధ్యాహ్నం ఆవిడను వదిలేయండి .. మనకు బిర్యానీ వండి పెడతారంట’ అని ప్రకాశ్‌ రాజ్‌గారు పర్మిషన్‌ ఇప్పించారు. మహేశ్‌ కూడా టేస్ట్‌ చేశారు. 

మీకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?
సావిత్రిగారు. సినిమాల్లోకి రాకముందు నేను ఆవిడ సినిమాలు ఎక్కువగా చూడలేదు. తమిళంలో పని చేసేటప్పుడు చాలామంది నన్ను ఆవిడతో పోల్చేవారు. సావిత్రిలా.. అంటూ నా గురించి రివ్యూస్‌లో రాసేవారు. దాంతో ఆవిడ సినిమాలన్నీ చూడటం మొదలెట్టాను. అప్పుడు ఆవిడ ఏ రేంజ్‌ యాక్టరో అర్థం అయింది. ఆమె అంత పేరు రాకపోయినా కొంచెం అయినా తెచ్చుకోవాలనుకునేదాన్ని. 

ఆవిడ లైఫ్‌ను చూసి మీరు నేర్చుకున్నదేంటి? 
ఆవిడ గురించి వినడమే తప్ప నేను సావిత్రిగారి జీవితాన్ని చూడలేదు. ‘గోరింటాకు’ సినిమాలో ఆమె చేసిన పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. ఆ సినిమాలో ఆవిడ లుక్‌ మారిపోయింది. బాధ అనిపించింది. నటిగా, వ్యక్తిగా అద్భుతమైన మనిషి సావిత్రిగారు. కానీ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆవిడ జీవితం తెలుసుకున్నాక ఈ విషయం నా మనసులో నాటుకుపోయింది.

ఇండస్ట్రీలో మీకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరు? ఎవరితో కష్టసుఖాలు షేర్‌ చేసుకుంటారు? 
నాకు అందరూ ఫ్రెండ్సే. ఆనందం, బాధ రెండూ నేనే పంచుకుంటాను. నా పెళ్లి విషయాలు షేర్‌ చేసుకోవడం సిగ్గనిపించింది. 

దేవుడున్నాడని నమ్ముతారా? 
కచ్చితంగా. ఏదో పవర్‌ ఉందని నమ్ముతాను. నేను సాయిబాబా భక్తురాలిని. మద్రాస్‌లో మైలాపూర్‌లో సాయిబాబా గుడి ఉంది. అక్కడకు తరచూ వెళ్లేదాన్ని. షిరిడీకి కూడా వెళుతుంటాను. కష్టాల్లో బాబా తోడుంటాడని నమ్ముతాను. 

‘అర్జున్‌’లో విలనిజమ్‌ షేడ్‌ ఉన్న అత్త పాత్ర చేసినప్పుడు ఎలా అనిపించింది?
ఫస్ట్‌ చేయడానికి సంకోచించాను. ఆ తర్వాత ఆ టీమ్‌ నన్ను కన్విన్స్‌ చేసింది. మహేశ్‌బాబు, గుణశేఖర్‌గార్ల కాంబినేషన్‌ అంటే చిన్న విషయం కాదు. కథ, నా పాత్ర బాగుంటాయి. నటిగా నా పర్ఫార్మెన్స్‌ మీద నాకు నమ్మకం ఉంది. అయితే అంత బాగా విలనిజమ్‌ పండించగలనని ‘అర్జున్‌’ చేసిన తర్వాతే తెలిసింది (నవ్వుతూ).

తమిళ సినిమా ‘అగ్ని సాక్షి’లో పాట పాడారు. ఆ తర్వాత సింగర్‌గా  కంటిన్యూ కాలేదేం?
నేను సింగర్‌ని అవుదామనుకున్నాను. అయితే ట్రైన్డ్‌ సింగర్‌ కాదు. అందుకే కంటిన్యూ కాలేదు. ఇప్పుడంటే పాటలో ఒకటీ రెండూ లైన్లు కూడా పాడిస్తున్నారు. అప్పుడు పాట అంటే ఫుల్‌ సాంగ్‌ పాడాల్సిందే. 

ఫైనల్లీ ఇప్పుడు మీకు మీరే అండ.. పిల్లలకు మీరే అండ. ఎలా ఉన్నారు?
హెల్త్‌ బావుంటే అంతా సెట్‌ అవుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేవు. పాజిటివ్‌గా ఉంటాను. ఫైనాన్షియల్‌గా ఆహా ఓహో అని చెప్పను కానీ మాకు సరిపడినంత ఉన్నాయి. ఐయామ్‌ హ్యాపీ. 

– డి.జి. భవాని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement