
అమెరికాలో భారత సంతతి మహిళ ఘాతుకం
అనంతరం ఆత్మహత్యాయత్నం
న్యూయార్క్: పిల్లలకు తల్లి ఒడిని మించిన స్వర్గం లేదంటారు. కానీ అమెరికాలో ఓ కన్నతల్లే కొడుకు ప్రాణాలు తీసింది. సరితా రామరాజు అనే భారత సంతతికి చెందిన మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. తన 11 ఏళ్ల కొడుకు యతిన్‌కు మూడు రోజుల పాటు డిస్నీలాండ్ తిప్పి చూపించింది. తర్వాత హోటల్ గదిలో గొంతు కోసి చంపేసింది. తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు 911కు ఫోన్ చేసి చెప్పింది.
వాళ్లు వచ్చేసరికే బాలుడు శవమై కనిపించాడు. అపస్మారక స్థితిలో ఉన్న సరితను ఆస్పత్రికి తరలించారు. బాలుడు చనిపోయాకే ఆమె 911కు ఫోన్ చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. వంటకు ఉపయోగించే పెద్ద కత్తి హోటల్ గదిలో దొరికింది. దాంతోనే పొడిచి చంపినట్టు భావిస్తున్నారు. ఆమెకు 26 ఏళ్ల నుంచి యావజ్జీవ శిక్ష దాకా పడవచ్చని కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది. సరితది బెంగళూరు. భర్త ప్రకాశ్ రాజుతో 2018లో విడాకులు తీసుకుంది. కొడుకు యతిన్ రాజును కోర్టు తండ్రి సంరక్షణలో ఉంచింది. సరితకు సందర్శన హక్కులు మాత్రమే లభించాయి.
విడాకుల తర్వాత సరిత కాలిఫోర్నియా నుంచి వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్‌కు మారింది. యతిన్‌ను తనకు అప్పగించాలంటూ గత నవంబర్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ‘‘కొడుకు వైద్యం, స్కూలింగ్ వంటి నిర్ణయాలు తన ప్రమేయం లేకుండానే తీసుకుంటున్నారు. నా మాజీ భర్తకు మాదకద్రవ్యాల వ్యసనముంది. మద్యం, ధూమపానం మత్తులో ఉంటాడు’’ అని ఆరోపించింది. ఇటీవల కొడుకును చూసేందుకు సరిత శాంటా అనాకు వచ్చింది. తనను మూడు రోజులూ డిస్నీల్యాండ్‌కు తీసుకెళ్లింది. ఈ నెల 19న కొడుకును తండ్రికి అప్పగించాల్సి ఉంది. ఆ రోజు ఉదయం 9.12కు ఈ ఘాతుకానికి పాల్పడింది. తనపై సరిత ఆరోపణలన్నీ అవాస్తవమని ప్రకాశ్ అన్నాడు. ‘‘ఆమెకు తీవ్రమైన మానసిక సమస్యలున్నాయి. తనతో మాట్లాడేందుకే యతిన్ భయపడేవాడు’’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment