మరోప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సభ: జనసంద్రమైన ఇచ్చాపురం
ఇచ్చాపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన భారీ బహిరంగ సభకు జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇచ్చాపురం జనసంద్రమైంది. వీధులన్నీ జనంతో నిండిపోయాయి. సభా ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనమే జనం. మేడలు, మిద్దెలు ఎక్కి జనం షర్మిల ప్రసంగం విన్నారు.
షర్మిల తన ప్రసంగంలో ఒక్క మనిషి వెళ్లిపోతే ఆంధ్రరాష్ట్రమే అతలాకుతలమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ బతికుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరయ్యేది కాదని ప్రజల నమ్మకం అని చెప్పారు. ఇది విజయయాత్ర కాదని, నిరసన యాత్రని ఆమె తెలిపారు. ప్రభుత్వ పనితీరును, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు అన్యాయం జరుగుతున్న తీరును వివరించారు. ఉద్యోగులను కేసీఆర్ వెళ్లిపోవాలంటున్నారంటే అర్థమేంటి? అని ప్రశ్నించారు. విభజన నిర్ణయంపై చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. అంతవరకు ప్రజల తరఫున వైఎస్ఆర్సిపి ప్రజల తరపున పోరాడుతుందని చెప్పారు. సీఎం, బొత్స, కేంద్రమంత్రులు ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. ఈ సమయంలో ప్రజల తరఫున నిలబడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. ఎందరు కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు? అని ప్రశ్నించారు. ప్రజల కన్నా పదవులే ముఖ్యమని కాంగ్రెస్, టీడీపీ నాయకులు నిరూపించుకున్నారన్నారు. తెలుగు ప్రజల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా జగన్మోహన్రెడ్డి ఊరుకోరని చెప్పారు. న్యాయం చేసే సత్తా కాంగ్రెస్కు లేకపోతే విభజన చేసే అధికారం కూడా ఆ పార్టీకి లేదన్నారు. ఆమె ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు.
3వేల కిలో మీటర్లకు పైగా పాదయాత్ర చేసిన చరిత్ర సృష్టించిన షర్మిలను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి, చుట్టు పక్కల గ్రామాల నుంచి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.
ఈ రోజు ఉదయం షర్మిల మరో ప్రజాప్రస్థానం 230వ రోజు పాదయాత్ర బలరాంపురం నుంచి ప్రారంభించారు. సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి మీదుగా షర్మిల ఇచ్చాపురం చేరుకున్నారు. ఇచ్ఛాపురంలో వైఎస్ఆర్ ప్రజాప్రస్థాన స్థూపం వద్ద వైఎస్ఆర్కు ఘన నివాళుర్పించారు. ఆ తరువాత మరో ప్రజాప్రస్థానం విజయస్థూపంను ఆవిష్కరించారు.