marraige dispute
-
వాటిపై మోజు,ముప్పై దాటినా పెళ్లి ముచ్చట లేదు...కారణమిదే!
కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు.. అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ కూలి పోతుంది అనే అభిప్రాయం ఈమధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం.ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ..తూ...మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుషులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతోంది. దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు!అసలు కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. అతి తెలివి చిన్న తప్పును కూడా భరించే శక్తి,సహనం లేవు. అందరూ సమానమే అనే వింత భావన పెరగటం (డెమాక్రసి). పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకోక పోవడం. ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు, ఈరోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు.కానీ, ఇంట్లో వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది. చిన్న చిన్నదానికీ అలిగి, దగ్గరి వారికి కూడా దూరం అవుతున్నారు. ఎవరో ఒకరి నోటి దురుసుతనం కుటుంబం మొత్తం చిన్నాభిన్నం కావడానికి కారణం అవుతుంది . ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా, దృఢంగా, బలంగా మేనేజ్ చేయలేక పోవడం కూడా ఒక కారణం. ఇంట్లో భార్యా భర్తలు (తల్లిదండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు. అన్ని కుటుంబాల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసుకుంటున్నారు.అన్యోన్యంగా, ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడకపోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోయింది.. అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. "ముఫై దాటినా" పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు. గత ముఫై నలభై ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెబుతున్నారు. ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు, పోల్చుకోవడం, తదితర కారణాలు అధికమయ్యాయి . మనుషులు అంటేనే విలువ లేదు. మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ విలాస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెగింపుతనం వచ్చింది. మధ్యవర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు. దీంతో ఎవరిష్టం వారిదే అయ్యింది. కుటుంబ నిర్వహణ ఒక కళ. అది అందరికీ లేకపోవడం వల్ల వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది. మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది. మొరటుగా ప్రవర్తిస్తున్నారు. నేను, నా భార్య/భర్త, అనే సిద్దాంతం పోయి "నేనే నేను" "నేను నేనే"పాలసీ వచ్చింది.పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచుకోవాలంటే భయపడుతున్నారు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు. కుటుంబ విలువలు, కట్టుబాట్లు ఇక ఉండవు. ఎవరిష్టం వాళ్లదే అయ్యే రోజులు వచ్చేశాయి. అన్నాదమ్ములు, అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు, భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేవు. సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో.. ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. డిజిటల్ ప్లాట్‌ఫాంపై ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే నిజమైనవి అని అపోహలో బతుకుతున్న జనం. మెరుగైన ప్యాకేజీలు, విలాస జీవితాలపై మోజు పెంచుకుంటున్న యువతులు సాధారణ ఉద్యోగులను పెళ్లి చేసుకునే పరిస్థితి రావడం లేదు. 30 ఏళ్లు దాటిపోతున్నా ఎంతోమంది యువకులు పెళ్లిళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా చనిపోతే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ లేదా RIP అని పెట్టి అంతటితో వదిలేస్తున్నారు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. ఇదంతా ఊరికే అనుకోవడం తప్ప ఏమీ చేయలేము. అరణ్య రోదన మాత్రమే!! -
పిల్లను ఇవ్వడని మామపై కత్తితో దాడి.. ఆ కోపంలో మరదలిపైనా..
ప్రకాశం : పెళ్లి చేసుకునేందుకు పిల్లను ఇవ్వడం లేదని మామపై ఓ మేనల్లుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పీరాపురంలో గురువారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బండి శివ తన మామను కలిసి పెళ్లి చేసుకునేందుకు కుమార్తెను తనకు ఇవ్వాలని కోరాడు. తనకు ఇష్టం లేదని మామ మారంరెడ్డి నరసింహారెడ్డి చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మామపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అంతటితో ఆగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమార్తెపై కూడా అదే కత్తితో చేతిపై కోసి గాయపరిచాడు. క్షతగాత్రులను స్థానికులు ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఎస్ఐ సురేష్‌కు సమాచారం అందడంతో ఆయన హుటాహుటిన గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు శివను అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
‘జంటను కలిపిన జడ్జి’.. ఔను, వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!
తిరుపతి లీగల్ : విభేదాలతో వేరుగా జీవిస్తున్న దంపతులు న్యాయస్థానం సాక్షిగా ఒక్కటయ్యారు. సుదీర్ఘంగా న్యాయమూర్తులు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో వారి జీవితంలో వసంతం తొంగిచూసింది. ఆపై, వారిని జడ్జిలతోపాటు ప్రకృతి కూడా ఆశీర్వదించింది. జోరున కురుస్తున్న వర్షం నడుమే వారిద్దరూ కలిసి వెళ్లారు. ఈ సన్నివేశం గురువారం స్థానిక కోర్టు ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు..తిరుపతికి చెందిన టి.మునికుమారి బీఎన్.కండ్రిగకు చెందిన సలూమ్‌ను ప్రేమించి ఐదేళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇదలా ఉంచితే, తిరుపతి మండల న్యాయసేవా అధికార సంస్థ స్థానిక కోర్టు ఆవరణలో న్యాయసేవా వారోత్సవాలను నిర్వహిస్తోంది. బుధవారం ‘జంటను కలిపిన జడ్జి’ అనే వార్త సాక్షి దినపత్రికలో ప్రధానంగా వచ్చింది. ఇది చూసిన మునికుమారికి ఆశలు చిగురించాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు కోర్టుకు వచ్చింది. స్థానిక 4వ అదనపు జూనియర్ జడ్జి శ్రీనివాస్‌కు తన భర్తపై ఫిర్యాదు చేసింది. న్యాయమూర్తి స్పందించారు. సలూమ్‌ను కోర్టుకు రప్పించారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. జడ్జితో పాటు పారాలీగల్ వలంటీర్లు ఎన్.రేవతి, ఎం.విజయలక్ష్మి సుమారు 4 గంటలకు పైగా దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పటికే కోర్టు సమయం కూడా ముగిసింది. ఆ తర్వాత వారిని 4వ అదనపు జిల్లా జడ్జి సత్యానంద్ వద్దకు తీసుకెళ్లారు. ఆ దంపతులతో ఆ జడ్జి కూడా చర్చించారు. కలసిమెలసి ఉండాలని హితబోధ చేశారు. ఇకపై భార్యాపిల్లలను బాగా చూసుకుంటానంటూ సలూమ్ న్యాయమూర్తుల సమక్షంలో హామీ పత్రం రాసి ఇచ్చాడు. చమర్చిన మునికుమారి కళ్లలో చెప్పలేనంత ఆనందం, కృతజ్ఞతా భావం. అప్పటికే సమయం సాయంత్రం 6.30 దాటింది. జడ్జిల ఆశీస్సులతో దంపతులిద్దరూ కోర్టు నుంచి వెలుపలికి వచ్చారు. జోరుగా వర్షం కురుస్తోంది. సలూమ్ తన బైక్ స్టార్ట్ చేశాడు. మునికుమారి అతడి వెనుక కూర్చుని భుజంపై చెయ్యి వేసి ఓ నవ్వు నవ్వింది. అంతే..నిమిషాల వ్యవధిలో బైక్‌లో సలూమ్ సింగాలగుంటలోని అత్తగారింట వాలిపోయాడు. సీన్ కట్ చేస్తే– తల్లితోపాటు ఇంటికి వచ్చిన తండ్రిని చూసి పిల్లలిద్దరి కళ్లలో సంభ్రమాశ్చర్యం! నాన్నొచ్చాడూ..అంటూ చెప్పలేనంత సంతోషంతో కేరింతలు కొట్టారు. -
జుట్టు కత్తిరించి, నగ్నంగా ఊరేగించారు
భిండి: మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంత్రగత్తె అనే నెపంతో ఓ ఆదివాసీ యువతిని ఘోరంగా అవమానించిన ఘటన మరువకముందే మరో మహిళపై దాడిచేసి, అనంతరం నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం రేపింది. కొడుకు ప్రేమ పెళ్లి ఓ తల్లి ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన లాహర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక యువకుడు... మురళీదౌర్ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. కాగా ఈ పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే కోర్టు అనుమతితో గత ఫిబ్రవరిలో ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నారు. దీంతో యువతి కుటుంబసభ్యులు... యువకుడి కుటుంబంపై ఆగ్రహం పెంచుకున్నారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కక్ష గట్టారు. యువకుడి కుటుంబంపై దాడి చేసి, అతని తల్లిదండ్రులు, సోదరుడిని విపరీతంగా కొట్టాడు. అంతటితో వారి ఉన్మాదం చల్లారలేదు. యువకుడి తల్లిని జుట్టు పట్టి బయటికి లాక్కొచ్చి మరీ విచక్షణా రహితంగా కొట్టారు. అనంతరం ఆమె జుట్టును కత్తిరించి, వివస్త్రను చేశారు. కొట్టుకుంటూ వీధుల్లో సుమారు రెండు గంటలపాటు నగ్నంగా ఊరేగించి భీతావహం సృష్టించారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం గ్వాలియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి రాంప్రకాష్, జైసింగ్, విజయ తదితరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి అవినాష్ తెలిపారు. కాగా వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా పోలీసు స్టేషన్ పరిథిలోని బఖార్లో మంత్రగత్తె అనే నెపంతో ఓ యువతి పట్ల గ్రామస్తులు అనాగరికంగా ప్రవర్తించారు. ఆమెపై దాడి చేసి నగ్నంగా ఊరేగించడమే కాకుండా మురికి కాలువలో నీళ్లు తాగించి, కర్రలతో దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే.