భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్న జడ్జి సత్యానంద్, ఇంటికి చేరిన తర్వాత భార్యాపిల్లలతో సలూమ్
తిరుపతి లీగల్ : విభేదాలతో వేరుగా జీవిస్తున్న దంపతులు న్యాయస్థానం సాక్షిగా ఒక్కటయ్యారు. సుదీర్ఘంగా న్యాయమూర్తులు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో వారి జీవితంలో వసంతం తొంగిచూసింది. ఆపై, వారిని జడ్జిలతోపాటు ప్రకృతి కూడా ఆశీర్వదించింది. జోరున కురుస్తున్న వర్షం నడుమే వారిద్దరూ కలిసి వెళ్లారు. ఈ సన్నివేశం గురువారం స్థానిక కోర్టు ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు..తిరుపతికి చెందిన టి.మునికుమారి బీఎన్.కండ్రిగకు చెందిన సలూమ్‌ను ప్రేమించి ఐదేళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు.
దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇదలా ఉంచితే, తిరుపతి మండల న్యాయసేవా అధికార సంస్థ స్థానిక కోర్టు ఆవరణలో న్యాయసేవా వారోత్సవాలను నిర్వహిస్తోంది. బుధవారం ‘జంటను కలిపిన జడ్జి’ అనే వార్త సాక్షి దినపత్రికలో ప్రధానంగా వచ్చింది. ఇది చూసిన మునికుమారికి ఆశలు చిగురించాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు కోర్టుకు వచ్చింది. స్థానిక 4వ అదనపు జూనియర్ జడ్జి శ్రీనివాస్‌కు తన భర్తపై ఫిర్యాదు చేసింది. న్యాయమూర్తి స్పందించారు. సలూమ్‌ను కోర్టుకు రప్పించారు.
అప్పటికి సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. జడ్జితో పాటు పారాలీగల్ వలంటీర్లు ఎన్.రేవతి, ఎం.విజయలక్ష్మి సుమారు 4 గంటలకు పైగా దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పటికే కోర్టు సమయం కూడా ముగిసింది. ఆ తర్వాత వారిని 4వ అదనపు జిల్లా జడ్జి సత్యానంద్ వద్దకు తీసుకెళ్లారు. ఆ దంపతులతో ఆ జడ్జి కూడా చర్చించారు. కలసిమెలసి ఉండాలని హితబోధ చేశారు. ఇకపై భార్యాపిల్లలను బాగా చూసుకుంటానంటూ సలూమ్ న్యాయమూర్తుల సమక్షంలో హామీ పత్రం రాసి ఇచ్చాడు.
చమర్చిన మునికుమారి కళ్లలో చెప్పలేనంత ఆనందం, కృతజ్ఞతా భావం. అప్పటికే సమయం సాయంత్రం 6.30 దాటింది. జడ్జిల ఆశీస్సులతో దంపతులిద్దరూ కోర్టు నుంచి వెలుపలికి వచ్చారు. జోరుగా వర్షం కురుస్తోంది. సలూమ్ తన బైక్ స్టార్ట్ చేశాడు. మునికుమారి అతడి వెనుక కూర్చుని భుజంపై చెయ్యి వేసి ఓ నవ్వు నవ్వింది. అంతే..నిమిషాల వ్యవధిలో బైక్‌లో సలూమ్ సింగాలగుంటలోని అత్తగారింట వాలిపోయాడు. సీన్ కట్ చేస్తే– తల్లితోపాటు ఇంటికి వచ్చిన తండ్రిని చూసి పిల్లలిద్దరి కళ్లలో సంభ్రమాశ్చర్యం! నాన్నొచ్చాడూ..అంటూ చెప్పలేనంత సంతోషంతో కేరింతలు కొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment