హన్వాడ/మహమ్మదాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొనగట్టుపల్లికి చెందిన ఇప్పలి అంజిలయ్య (45) అయిదు రోజుల కిందట ఇంట్లో నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడని భార్య ఇప్పలి లక్ష్మమ్మ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి ఆచూకీ కోసం అన్ని ఠాణాలకు సమాచారం పంపించారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న మహమ్మదాబాద్ శివారులోని ధర్మాపూర్ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించి ఇప్పలి అంజిలయ్యగా గుర్తించారు.
వెంటనే పోలీసులు భార్య ఇప్పలి లక్ష్మమ్మను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ప్రియుడు, మరో వ్యక్తి సహకారంతో తానే హత్య చేసినట్లు వెల్లడించింది. హత్యచేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అంజిలయ్యకు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
పరిచయం కాస్త ప్రేమగా..
అంజిలయ్య భార్య లక్ష్మమ్మ పాలమూరుకు అడ్డా కూలీగా వెళ్లేది. ఈమెకు బోర్లు మరమ్మతు చేసే నవాబ్‌పేట మండలం మరికల్‌కు చెందిన జోగు శ్రీను పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండేళ్లుగా సాగుతున్న వీరి వ్యవహారానికి భర్త అడ్డంకిగా మారడంతో హతమార్చేందుకు లక్ష్మమ్మ ప్రియుడితో కలిసి పథకం వేసింది.
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అంజిలయ్యను అనుసరించిన జోగు శ్రీను, అతడితో హెల్పర్‌గా పనిచేసే బాలయ్య మహమ్మదాబాద్ శివారులోని ధర్మాపూర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి పోలీసులకు భర్త కనిపించడం లేదని లక్షమ్మ ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment