ఎంపీపీ పోరు హోరాహోరీ
మర్పల్లి: మండలాధ్యక్ష పదవి కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోరు హోరాహోరీగా మారింది. ఈ రెండు పార్టీల నాయకులు ఎక్కడా రాజీపడకుండా ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. దీంతో ఈనెల4న జరిగే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు తీవ్ర సందిగ్ధంగా మారింది. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలుండగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 6, టీఆర్ఎస్ 5, టీడీపీ 2 స్థానాలు గెలుచుకోగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.
అయితే సిరిపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన మర్రి ఇందిరమ్మ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల బలం సమానంగా మారింది. అయితే ఏకంగా ఎంపీపీ పదవినే ఇస్తామని ఇండిపెండెంట్ అభ్యర్థి గడ్డమీది సుమిత్రమ్మ మద్దతును కూడా టీఆర్ఎస్ కూడగట్టింది. అంతేకాకుండా మండల ఉప అధ్యక్ష పదవిని ఇస్తామంటూ కోటమర్పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన అంజయ్యను కూడా టీఆర్ఎస్ రహస్య శిబిరానికి తరలించినట్లు సమాచారం.
దీంతో ఎంపీపీ రేసులో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు నాయకులు భావించారు. అదే సమయంలో పార్టీ విప్ జారీ చేస్తే మర్రి ఇందిరమ్మ టీఆర్ఎస్కు ఓటేయడం అనుమానమేననే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎంపీటీసీ అంజయ్యతో కాంగ్రెస్ నాయకులు చర్చలు జరుపుతున్నారని, ఆయన మద్దతును తిరిగి సంపాదించడానికి ఆ పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
దీంతో ఎంపీపీ ఎన్నికపై తిరిగి ఉత్కంఠ నెలకొంది. కాగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మర్పల్లిని ఎలాగైనా దక్కించుకోవాలని హస్తం నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీడీపీ నుంచి గెలుపొందిన ఇద్దరు అభ్యర్థుల మద్దతును కూడా కూడగట్టేందుకు ఆ పార్టీ నాయకులు రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు కూడా తమకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దీంతో ఎంపీపీ పీఠం ఎవరివైపు మొగ్గనుందో అంచనాకు రావడం కష్టతరంగా మారింది.