Married woman commit suicide
-
వివాహిత ఆత్మహత్య...ఉద్రిక్తత
లింగోజిగూడ: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వివాహిత బంధువులు పోలీస్టేషన్ ముందు ఆందోళన చేపట్టడంతో పాటు భర్తపై దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యాచారం మండలం కురుమిద్దెకు చెందిన రమావత్ సుజాత(21)కు గతేడాది నల్లగొండ జిల్లా చితంపల్లి మండలం గాశిరాం తాండకు చెందిన రమావత్ శివతో వివాహం జరిగింది. వీరు హయత్‌నగర్ బంజారా కాలనీలో నివాసం ఉంటున్నారు. శివ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఆరునెలల పాప ఉంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుజాత మంగళవారం రాత్రి ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఆందోళన...కాగా సుజాత ఆత్మహత్య చేసుకోలేదని, శివనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకకరించారని ఆరోపిస్తూ బుధవారం హయత్‌నగర్ పోలీస్టేషన్ ముందు సుజాత బంధువులు ఆందోళన చేపట్టారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. సుజాత వివాహం సమయంలో ఇచి్చన కట్నం, బంగారం తిరిగి ఇవ్వాలని శివ బంధువులతో గొడవకు దిగారు. దీంతో పోలీస్టేషన్ ఆవరణలో డబ్బును తిరిగి ఇస్తామని శివ కుటుంబ సభ్యులు ఒప్పందానికి వచ్చారు. ఈ సమయంలో స్టేషన్‌కు వచ్చిన శివపై సుజాత బంధువులు దాడి చేశారు. గమనించిన పోలీసులు వారిని ఆపడానికి ప్రయతి్నంచగా తోపు లాట జరిగింది. ఇద్దరు మహిళా పోలీసులకు స్వల్పంగా గాయాలయ్యాయి. సుజాత బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామని హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. -
చస్తానేమో గానీ తప్పు చేయను..
కులాలు వేరైనా ప్రేమ చిగురించింది.. చదువు, అంతస్తు అడ్డుగా నిలిచినా ఆమె ఎదిరించింది.. ఇద్దరూ ఒక్కటయ్యారు.. ఇద్దరికి జన్మనిచ్చారు.. ఐదేళ్ల కాపురం..అద్దమంటి పిల్లలు.. అంతా బాగుందనుకున్న సమయంలో.. అనుమానం పెనుభూతమైంది! దంపతుల మధ్య దూరం పెంచింది.. అతని నిర్లక్ష్యాన్ని ఆమె తట్టుకోలేకపోయింది.. నింద మోయలేక మదనపడింది.. కన్నవాళ్లకు చెప్పుకోలేక.. కట్టుకున్నోడితో కలసి ఉండే ‘భాగ్య’ం లేక.. అందనంత తీరాలకు వెళ్లిపోయింది!పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలనూ వెంట తీసుకుపోయింది! పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో శనివారం కురుబ భాగ్యశ్రీ(27) తన ఇద్దరు పిల్లలు జతమన్ శౌర్య(4), క్రిషిత (2)లను గొంతు నులిమి చంపి.. తనూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అయ్యో.. ఎంత పని చేశావు తల్లీ అంటూ గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన కురుబ భాగ్యశ్రీ అగ్రికల్చర్ బీఎస్సీ చదివింది. కుటుంబం అనంతపురంలో స్థిరపడగా.. బతుకుదెరువు కోసం భాగ్యశ్రీ తల్లిదండ్రులు ధాబా నడిపేవారు. పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన మారెన్న కుమారుడు చరణ్‌కుమార్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతను తరచూ ఆ ధాబాకు వెళ్తూ భాగ్యశ్రీని ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని నమ్మి వెంట నడిచింది. ఐదేళ్ల క్రితం ఇద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. బత్తలపల్లిలో వేరు కాపురం పెట్టారు. భార్యాభర్త అన్యోన్యంగా ఉండేవారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా జతమన్ శౌర్య(లడ్డు), క్రిషిత (లక్కీ) జని్మంచారు. రెండేళ్లుగా చరణ్ ‘కియా’ కంపెనీ బస్సు డ్రైవర్‌గా వెళ్తున్నాడు. ఏమైందో తెలియదు గానీ దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. భర్త నిర్లక్ష్యం చేయడంతో భాగ్యశ్రీ తట్టుకోలేక పోయింది. పుట్టింటి వారు ఎప్పుడో ముఖం చాటేయగా, తన బాధ ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. భర్త అనుమానంతో తనపై నిందలు మోపడాన్ని సహించలేకపోయింది. పోరాడి ఓడిన భాగ్యశ్రీ.. ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం ఇలా అయిపోయిందని భాగ్యశ్రీ రోజుల తరబడి కుమిలిపోయింది. మనశ్శాంతి లేక మరణాన్ని కోరుకోవాలనుకునేది. కానీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను చూసి ఆగిపోతూ వచ్చింది. జీవితంలో నిలబడేందుకు నెలల తరబడి మౌన పోరాటం చేసింది. చివరకు ఓడిపోయి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి చరణ్ ఉద్యోగానికి వెళ్లి శనివారం ఉదయం 11 గంటలకు ఇల్లు చేరుకున్నాడు. భోజనం చేసి సమీపంలో ఉన్న అన్న ఇంటికి వెళ్లి అక్కడే నిద్రించాడు. కల్లోల మనసుతో ఉన్న భాగ్యశ్రీ..అంగన్వాడీలో ఉన్న చిన్నారులను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళ్లింది. ఉదయం నుంచీ ఏమీ తినకపోవడంతో కళ్లు తిరగడంతో రోడ్డుపై పడిపోయింది. వెంటనే గుర్తించిన అంగన్వాడీ సిబ్బంది ఆమెను సెంటర్‌కు తీసుకెళ్లి నీళ్లు తాపించి కాసేపు అక్కడే సేదదీర్చారు. కానీ తన జీవితానికి ‘మరణ శాసనం’ రాసుకున్న భాగ్యశ్రీ కాసేపటికే పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చింది. 11.30 గంటల ప్రాంతంలో పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చింది. అయితే భాగ్యశ్రీ పరిస్థితి చూసిన అంగన్వాడీ ఆయా... ఆమెకు, పిల్లలకు భోజనం పెట్టాలని భావించి 12.30 గంటలకు వారింటికి వెళ్లింది. తల్లీపిల్లలు గాఢ నిద్రలో ఉండడంతో ఆమె తిరిగి సెంటరుకు వెళ్లిపోయింది. అయితే అరగంట గడవకముందే ఇద్దరు బిడ్డలతో భాగ్యశ్రీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి వారింటికి పరుగు తీసింది. ఇద్దరు చిన్నారులు నిర్జీవంగా పడి ఉండగా...భాగ్యశ్రీ దూలానికి చీరతో వేసుకున్న ఉరికి వేలాడుతూ కనిపించింది. పిల్లలను చంపి..ఉరికి వేలాడి.. తాను వెళ్లిపోతే పిల్లల పరిస్థితి ఏమిటని భావించిన భాగ్యశ్రీ నిద్రలోనే పిల్లలను గొంతు నులిమి చంపి, తాను ఉరి వేసుకున్నట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. విషయం తెలిసి పరుగున ఇంటికి వచ్చిన చరణ్...భార్యా పిల్లల మృతదేహాలు చూసి బోరున విలపించాడు. ‘లడ్డూ, లక్కీ... లేచి రాండ్రా, ఎంత పని చేశావు భాగ్యా’ అంటూ బిగ్గరగా అరవ సాగాడు. సీఐ జయానాయక్, ఏఎస్ఐ ప్రసాద్, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భాగ్యశ్రీ రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చస్తానేమో గానీ తప్పు చేయను.. ‘‘ఎందుకిలా మారిపోయావో తెలియట్లేదు. నా మీద అనుమానం మొదలైంది. ఇది నీకు వచ్చిన అనుమానం కాదు..ఎవరో చెప్పి ఇలా మాట్లాడిస్తున్నారు. నీకు ఎంత సేపూ మొబైల్, ఫ్రెండ్స్, క్రికెట్, మందు మాత్రమేనా? నీకోసం ఎదురు చూసే భార్య, పిల్లలు ఉంటారు. వాళ్లకీ మనసు ఉంటుంది. అది నీకు అర్థం కాలేదు. ఆనందం లేదు, సంతోషం లేదు... ఏమీ లేదు.. ఒంటరిగా బతుకుతున్నా. నీకు ఇష్టం లేదు.. అందుకే ఇలా చేస్తున్నావని నా మనసులో మాట చెప్పాలని చాలా సార్లు లెటర్లు రాశాను. కానీ నువ్వు ఫీల్ అవుతావని ఇవ్వలేకపోయాను. ఇప్పటికీ చెప్పకపోతే నేను తప్పు చేసినదాన్ని అవుతాను. నేను మషిని కానా, నాకు ఫీలింగ్స్ ఉండవా? ఎంత చెప్పినా వేస్ట్. నీ మైండ్ అంతలా పొల్యూట్ చేశారు. మా నాన్నని చూడాలని ఉంది. ఒక్కసారి చూపించు. నీకు ఇష్టం లేకపోతే నాకు డైవర్స్ ఇచ్చి.. నీకు ఇష్టం వచ్చిన వాళ్లను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నేను మాత్రం ఏ తప్పూ చేయలేదు. అలాంటి తప్పు చేయాల్సి వస్తే చావడానికైనా సిద్ధం కానీ తప్పు మాత్రం చేయను. ఈ లైఫ్ నీతోనే అంతే. తప్పుగా మాట్లాడినా, నీ మనస్సు బాధ పెట్టినా నన్ను క్షమించు.’’ ఇట్లు అందరూ ఉన్నా.. ఒంటరిగా బతుకుతున్న నేను(భాగ్య) -
‘అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే..
సాక్షి, మొయినాబాద్: ‘అమ్మా..నేను చనిపోతున్నా..’ ఓ వివాహిత తన తల్లికి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది. అంతలోనే ఫోన్‌కట్ చేసి చెప్పినంత పనిచేసింది. పెళ్లయిన పదకొండు నెలలకే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటన మొయినాబాద్ మండల చిలుకూరులో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన శ్రావణి (26)తో చిలుకూరుకు చెందిన అవురం రాజశేఖర్‌రెడ్డి వివాహం గత సంవత్సరం నవంబర్ 27న జరిగింది. పెళ్లి సమయంలో అమ్మాయి కుటుంబం వారు 40 తులాల బంగారం, రూ.40 లక్షలు నగదు, తూప్రాన్‌లో ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. కొన్ని రోజులు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం శ్రావణి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. శ్రావణి ఉరివేసుకుని వేలాడుతుండగా గమనించిన చుట్టుపక్కల వారు, ఆమె అత్త కిందకు దింపారు. అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చదవండి: ఉషా అందుకు నిరాకరిచండంతో.. చెరువు వద్దకు పిలిచి.. శ్రావణి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు తల్లికి ఫోన్ చేసి.. శ్రావణి బుధవారం తల్లి పద్మకు ఫోన్‌చేసి మాట్లాడింది. నేను చనిపోతాను అంటూ ఏడుస్తూ ఫోన్ కట్‌చేసింది. కొద్ది సేపటి తరువాత తల్లి మళ్లీ ఫోన్ చేస్తే ఎత్తలేదు. అంతలోనే ఉరివేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధించేవాడని.. దసరా పండుగకు ముందు శ్రావణిని కొట్టాడని బంధువులు ఆరోపించారు. అతడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం చేశారు. శవాన్ని తరలించవద్దంటూ ఆందోళన పరారీలో ఉన్న భర్త రాజశేఖర్‌రెడ్డిని పట్టుకొచ్చే వరకు శవాన్ని తరలించవద్దంటూ బంధువులు ఆందోళనకు దిగారు. శ్రావణి తల్లి, బంధువులు రాకముందే శవాన్ని ఎందుకు కిందికి దింపారని నిలదీశారు. రాత్రి 8 గంటల వరకు కూడా శ్రావణి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. భర్తను పట్టుకొచ్చే వరకు శవాన్ని తరలించేదిలేదని పోలీసులను కూడా అడ్డుకున్నారు. -
నాన్నే చంపినాడు!
ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతున్నాడు. భర్తే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. గుత్తి: వివాహిత ఆత్మహత్య గుత్తి ఆర్ఎస్లో ఉద్రిక్తతకు దారి తీసింది. తన వివాహేతర సంబంధాలకు అడ్డు లేకుండా చూసుకునేందుకు భర్తే అదనపు కట్నం పేరిట వేధింపులకు గురిచేసి, చివరకు హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ ప్రభాకర్‌గౌడ్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. విడపనకల్లు మండలం వేల్పుమడుగుకు చెందిన దాసరి తిరుపతమ్మ కుమార్తె మహాలక్ష్మికి గుత్తి ఆర్ఎస్కు చెందిన ఓబన్న కుమారుడు సత్యనారాయణతో 2012లో వివాహమైంది. కట్నకానుకల కింద రూ.2లక్షల నగదు, ఆరు తులాల బంగారు ఆభరణాలు అందజేశారు. సత్యనారాయణ గుత్తి రైల్వే డీజిల్‌షెడ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమార్తెలు దాక్షాయణి(5), దీక్షత(3), కుమారుడు ఇతేష్ బాబు(2) ఉన్నారు. మూడేళ్ల నుంచి వేధింపులు సత్యనారాయణకు ఆర్ఎస్లోని రైల్వే ఉన్నతాధికారి భార్యతోపాటు, తాడిపత్రి, గుత్తికి చెందిన మరో ఇద్దరు యువతులతో వివాహేతర సంబంధం ఉంది. భార్యకు విషయం తెలిసిన తర్వాత.. భర్తను మార్చుకోవాలని ప్రయత్నించింది. అయితే అతను మారకపోగా.. భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కూడా తీసుకురావాలని చిత్రహింసలు పెట్టాడు. భర్తతోపాటు అత్త నాగలక్ష్మమ్మ, ఆడపడచు నాగవేణిలు కూడా తోడయ్యారు. మూడేళ్లుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. వారం క్రితం పీకలదాకా మద్యం తాగొచ్చి భార్యను చితకబాదాడు. ఆమె తల్లి, తమ్ముడు వచ్చి భార్యాభర్తలకు సర్దిచెప్పి వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత మృతి.. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సత్యనారాయణ ఫుల్‌గా తాగొచ్చి భార్యతో గొడవపెట్టుకున్నాడు. అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్త, ఆడపడుచు కూడా వేధించారు. దీంతో మనస్తాపం చెందిన మహాలక్ష్మి పురుగుమందు తాగి, అనంతరం ఉరివేసుకుంది. తన భార్య ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని సత్యనారాయణ పోలీసులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించాడు. గుత్తి ప్రభుత్వాసుపత్రిలో భార్యను చేర్పించి రాత్రికి రాత్రే పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని సీఐ ప్రభాకర్ గౌడ్ పరిశీలించారు. భర్తేహత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలు తల్లి దాసరి తిరుపతమ్మ, అక్క సుధా, తమ్ముడు అనిల్‌తో పాటు బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల ఆందోళన భర్త వచ్చే వరకు మహాలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం చేయకూడదని బంధువులు ఆస్పత్రిలో బుధవారం ఆందోళనకు దిగారు. సీఐ ప్రభాకర్‌గౌడ్, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఐను చుట్టుముట్టి హంతకుడిని రప్పించాలని డిమాండ్ చేశారు. నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేస్తామని సీఐ చెప్పినా వినలేదు. అనంతపురం నుంచి ఎస్సీ, ఎస్టీ విభాగం డీఎస్పీ మహబూబ్‌బాషా గుత్తికి వచ్చి వివాహిత మృతిపై బంధువులను విచారణ చేశారు. కట్నకానుకల కింద ఇచ్చిన రూ.2లక్షల నగదు, ఆరు తులాల బంగారు ఆభరణాలను వెనక్కు ఇప్పించాలని బంధువులు డిమాండ్ చేశారు. నగలు, నగదు రికవరీ చేసి పిల్లల పేరిట బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. మహాలక్ష్మి భర్త సత్యనారాయణ, ఆడ పడుచు నాగవేణి, అత్త నాగలక్షమ్మపై 304ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు. దీంతో బంధువులు శాంతించారు. డాక్టర్లు వెంటనే పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
పిఠాపురం రూరల్ : పిఠాపురం మండలం పి.దొంతమూరుకు చెందిన వివాహిత వాసంశెట్టి కృష్ణవేణి గురువారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పిఠాపురం రూర ల్ పోలీసులు తెలిపారు. దొంతమూరుకి చెందిన వాసంశెట్టి లోవరాజుతో కృష్ణవేణికి పదేళ్ల కిందట పెళ్లయింది. ఇటీవల అదనపు కట్నం కోసం భార్యను లోవరాజు వేధించడం ప్రారంభించాడు. ఇటీవల పుట్టింటికి వె ళ్లిన కృష్ణవేణి అదనపు కట్నం తీసుకురాకపోవడంతో ఆమెను శారీకరంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై వి.సుభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.