Married woman murder case
-
మంచిర్యాలలో వివాహిత దారుణ హత్య
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ మహిళను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి.. రాళ్లతో కొట్టి చంపారు. రైల్వే స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే ఈ హత్య జరిగింది. మృతురాలిని గోపాలవాడకు చెందిన శరణ్యగా గుర్తించారు పోలీసులు. ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తోంది. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఆమెపై ఘాతుకం జరిగినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ పక్కనే ఆమె మృతదేహాం పడి ఉంది. సమాచారం అందుకున్న డీసీపీ సుధీర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే శరణ్య భర్త సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే.. వాళ్ల ఇద్దరి మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ ఆ కోణం నుంచే మొదలైంది. -
ప్రియుడి చేతిలో వివాహిత దారుణ హత్య..
శ్రీకాకుళం, టెక్కలి రూరల్: స్థానిక మండలంలోని బలరాంపురం గ్రామానికి చెందిన వివాహిత హత్యకేసుకు సంబంధించిన వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాద్ మీడియాకు ఆదివారం వెల్లడించారు. ఈ నెల 9న రాత్రి నుంచి తన చెల్లి అన్నెపు లక్ష్మీ(34) కనిపించడం లేదని ఆమె సోదరుడు చింతాడ అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు ఎస్ఐ సురేష్‌బాబు ఆధ్వర్యంలో పోలీసు బృందం బలరాంపురం గ్రామానికి వెళ్లి ఆరా తీయగా.. మృతురాలి భర్త కుశుమన్న గత కొద్ది ఏళ్లుగా దుబాయ్‌లో తాపీమేస్త్రిగా పని చేస్తున్నాడని, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్తుండేవాడని తెలిసింది. మరోవైపు లక్ష్మికి అదే గ్రామానికి చెందిన చెందిన సంపతిరావు భాస్కర్‌రావు అనే యువకుడితో 7 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. మృతురాలు గ్రామంలోని బలరాంపురం కాలనీలో నివాసం ఉండగా.. ఆమె నివాసానికి సమీపంలోనే నిందితుడు కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడని, ఇందులోనే వారిద్దరూ తరచూ కలుస్తుండే వారని విచారణలో తేలింది. మరోవైపు తనకు అధికార పార్టీ(టీడీపీ)లో రాజకీయంగా పలుకుబడి పెరుగుతుందని, అదేవిధంగా పెళ్లి చేసుకునేందుకు లక్ష్మి అడ్డం అవుతుందని భావించిన భాస్కర్‌రావు.. ఆమెకు ఇటీవల నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అందుకు ఆమె ససేమిరా అనండంతో పాటు నిందితుడికి ఇచ్చిన సుమారు రూ.6 లక్షలను తిరిగి ఇచ్చేయాలని తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న రాత్రి సమయంలో తాను కొత్తగా నిర్మించుకున్న ఇంటికి రమ్మని లక్ష్మిని పిలిచాడు. మరోసారి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వినకపోవడంతో అక్కడే గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శవాన్ని గోనె సంచిలో మూటకట్టి గ్రామానికి కిలోమీటరు దూరంలోని లింగాలవలస పంచాయతీ పరిధి బోడుగురవ మెట్టపై రాళ్ల మధ్యలో పడేశాడు. ఆ మరుసటి రోజు పాతపట్నం నుంచి 20 లీటర్ల పెట్రోల్ తీసుకువచ్చి రాత్రి సమయంలో శవాన్ని కాల్చి వేశాడని పోలీసులు వివరించారు. రెండురాళ్ల మధ్యలో బూడిదగా ఉన్న మృతదేహం తానుగా వచ్చి ఒప్పుకున్న నిందితుడు! అయితే యువకుడు శవాన్ని తగలబెట్టే ప్రయత్నంలో భాగంగా చేతులకు గాయాలు కాగా.. అతని ప్రవర్తనపై గ్రామంలో చర్చ మొదలైంది. దీంతో నిందితుడే నేరుగా గ్రామ వీఆర్ఓ మెట్ట జనకమోహనరావుతో కలిసి పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోవడంతో పాటు హత్య ఏ విధంగా చేశాడో చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మిని కాల్చి చంపిన స్థలాన్ని చూపించాడని, ఘటన స్థలానికి చేరుకోగా అక్కడ శవాన్ని కాల్చిన బూడిద కనిపించిందని తెలిపారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని టెక్కలి సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెల్లడించారు. ఇదిలా ఉండగా... తన తల్లిని హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి పిల్లలు యోగానందరావు, ధనలక్ష్మి పోలీస్ స్టేషన్ చుట్టూ ఆదివారం తిరిగారు. అమ్మ లేకపోవడంతో తాము అనాథలుగా మిగిలిపోయామని భోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. -
వీడిన వివాహిత హత్య మిస్టరీ
కూడేరు: శివరాంపేట వద్ద జాతీయరహదారి సమీపాన జరిగిన వివాహిత హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. కాల్ డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. రాంగ్ కాల్ ఆధారంగా పరిచయమైన వ్యక్తే ఆమెను పథకం ప్రకారం హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ప్రసాద్‌రావు మంగళవారం కూడేరులో విలేకరులకు వెల్లడించారు. అనంతపురానికి చెందిన విజయలక్ష్మి (22) అనే వివాహిత సెల్‌కు నెలన్నర కిందట కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రుద్రేశ్ నుంచి రాంగ్ కాల్ వచ్చింది. బ్రేకప్ కావాల్సిన కాల్‌ను వారు కొనసాగించడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తరచూ వీరు ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకునే వారు. విజయలక్ష్మి నుంచి అతడికి వాట్సప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ పెరిగాయి. ఈ క్రమంలో రుద్రేశ్ భార్యకు అనుమానం వచ్చింది. తరచూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండటం గమనించి ఆరా తీసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య పదేపదే గొడవ జరిగేది. చివరకు విడిపోయే పరిస్థితికి దారి తీయడంతో రుద్రేశ్ ఆలోచనలో పడ్డాడు. ఇంతటి వివాదానికి కారణమైన విజయలక్ష్మిని దూరంగా ఉంచాలని అనుకున్నాడు. అది సాధ్యం కాకపోవడంతో ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు. ఇందుకు పక్కా ప్రణాళిక రచించాడు. ఈ నెల ఐదో తేదీన విజయలక్ష్మిని అనంతపురం నుంచి తన ద్విచక్రవాహనంలో కూడేరు మండలం శివరాంపేట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ జాతీయరహదారి సమీపాన గుట్ట వద్ద మాటల్లో పెట్టి ఆమె గొంతుకు చున్నీతో బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. అనంతరం ఆమెను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు బండరాయిని ముఖం మీద వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హత్య ఘటన ఏడో తేదీ వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. కాల్ డేటాను పరిశీలించగా.. రుద్రేశ్ అనే వ్యక్తికి ఎక్కువగా ఫోన్ చేసినట్లు బయటపడింది. ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. -
వివాహిత హత్య కేసులో ఆరుగురి అరెస్టు
మామిడికుదురు : సంచలనం కలిగించిన వివాహిత హత్య కేసులో ఆరుగురు ముద్దాయిలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పామాపురానికి చెందిన అంతటి శిరీష (25)ను గత ఏడాది ఆగస్టు మూడో తేదీన రాజోలు మండలం తాటిపాకలో హత్య చేసి శవాన్ని మామిడికుదురు మండలం పాశర్లపూడిలో పాతి పెట్టిన సంగతి విదితమే. ఈ హత్య కేసులో ముద్దాయిల వివరాలను అమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఎల్.అంకయ్య, రాజోలు సీఐ జీవీ కృష్ణారావు తెలిపారు. శిరీష హత్య కేసులో ఆమె భర్త గెడ్డం జగదీష్‌తో పాటు గుండుమేను ఏసుబాలరాజు, బిక్కిన దుర్గాప్రసాద్, గెడ్డం నాగరాజు, చుట్టుగుళ్ల వరప్రసాద్, బుంగా భగవాన్‌దాస్‌లను అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరు ముద్దాయిలు గెడ్డం రమేష్, ఉండ్రు ఏడుకొండలు పరారీలో ఉన్నారని చెప్పారు. శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు పాశర్లపూడి గ్రామానికి చెందిన జగదీష్‌కు హైదరాబాద్‌లో శిరీషతో పరిచయం ఏర్పడింది. 2013 మార్చిలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. 2014 జనవరి 3న శిరీష మగబిడ్డకు జన్మనిచ్చిందన్నారు. ఇదిలా ఉండగా జగదీష్‌కు 2013 ఫిబ్రవరి 15న ముమ్మిడివరం మండలం ఠానేలంకకు చెందిన ఉషారాణితో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, మొదటి భార్య నుంచి ఒత్తిడి రావడంతో పాటు శిరీష నుంచి కూడా ఒత్తిడి తీవ్రమైంది. దీంతో శిరీషను కొట్టి చీర కొంగుతో ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. స్నేహితుల సహాయంతో తాటిపాక నుంచి ఆటోలో శిరీష శవాన్ని తీసుకు వచ్చి పాశర్లపూడిలోని డ్రైన్ గట్టున పాతిపెట్టాడు. శిరీష అన్నయ్య ధనుంజయ్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ నిర్వహించి ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. నగరం, మలికిపురం ఎస్సైలు బి.సంపత్‌కుమార్, ఎస్ఎం పాషా, హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీను, కానిస్టేబుళ్లు కె.గణేష్‌బాబు, బి.సుబ్బారావులను డీఎస్పీ అంకయ్య, సీఐ కృష్ణారావు అభినందించారు.