పోలీసుల అదుపులో నిందితుడు పోలీస్ స్టేషన్ ఆవరణలో తిరుగుతున్న చిన్నారులు
శ్రీకాకుళం, టెక్కలి రూరల్: స్థానిక మండలంలోని బలరాంపురం గ్రామానికి చెందిన వివాహిత హత్యకేసుకు సంబంధించిన వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాద్ మీడియాకు ఆదివారం వెల్లడించారు. ఈ నెల 9న రాత్రి నుంచి తన చెల్లి అన్నెపు లక్ష్మీ(34) కనిపించడం లేదని ఆమె సోదరుడు చింతాడ అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు ఎస్‌ఐ సురేష్‌బాబు ఆధ్వర్యంలో పోలీసు బృందం బలరాంపురం గ్రామానికి వెళ్లి ఆరా తీయగా.. మృతురాలి భర్త కుశుమన్న గత కొద్ది ఏళ్లుగా దుబాయ్‌లో తాపీమేస్త్రిగా పని చేస్తున్నాడని, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్తుండేవాడని తెలిసింది. మరోవైపు లక్ష్మికి అదే గ్రామానికి చెందిన చెందిన సంపతిరావు భాస్కర్రావు అనే యువకుడితో 7 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. మృతురాలు గ్రామంలోని బలరాంపురం కాలనీలో నివాసం ఉండగా.. ఆమె నివాసానికి సమీపంలోనే నిందితుడు కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడని, ఇందులోనే వారిద్దరూ తరచూ కలుస్తుండే వారని విచారణలో తేలింది.
మరోవైపు తనకు అధికార పార్టీ(టీడీపీ)లో రాజకీయంగా పలుకుబడి పెరుగుతుందని, అదేవిధంగా పెళ్లి చేసుకునేందుకు లక్ష్మి అడ్డం అవుతుందని భావించిన భాస్కర్రావు.. ఆమెకు ఇటీవల నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అందుకు ఆమె ససేమిరా అనండంతో పాటు నిందితుడికి ఇచ్చిన సుమారు రూ.6 లక్షలను తిరిగి ఇచ్చేయాలని తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న రాత్రి సమయంలో తాను కొత్తగా నిర్మించుకున్న ఇంటికి రమ్మని లక్ష్మిని పిలిచాడు. మరోసారి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వినకపోవడంతో అక్కడే గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శవాన్ని గోనె సంచిలో మూటకట్టి గ్రామానికి కిలోమీటరు దూరంలోని లింగాలవలస పంచాయతీ పరిధి బోడుగురవ మెట్టపై రాళ్ల మధ్యలో పడేశాడు. ఆ మరుసటి రోజు పాతపట్నం నుంచి 20 లీటర్ల పెట్రోల్ తీసుకువచ్చి రాత్రి సమయంలో శవాన్ని కాల్చి వేశాడని పోలీసులు వివరించారు.
రెండురాళ్ల మధ్యలో బూడిదగా ఉన్న మృతదేహం
తానుగా వచ్చి ఒప్పుకున్న నిందితుడు!
అయితే యువకుడు శవాన్ని తగలబెట్టే ప్రయత్నంలో భాగంగా చేతులకు గాయాలు కాగా.. అతని ప్రవర్తనపై గ్రామంలో చర్చ మొదలైంది. దీంతో నిందితుడే నేరుగా గ్రామ వీఆర్‌ఓ మెట్ట జనకమోహనరావుతో కలిసి పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోవడంతో పాటు హత్య ఏ విధంగా చేశాడో చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మిని కాల్చి చంపిన స్థలాన్ని చూపించాడని, ఘటన స్థలానికి చేరుకోగా అక్కడ శవాన్ని కాల్చిన బూడిద కనిపించిందని తెలిపారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని టెక్కలి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వెల్లడించారు. ఇదిలా ఉండగా... తన తల్లిని హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి పిల్లలు యోగానందరావు, ధనలక్ష్మి పోలీస్ స్టేషన్ చుట్టూ ఆదివారం తిరిగారు. అమ్మ లేకపోవడంతో తాము అనాథలుగా మిగిలిపోయామని భోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment