ఆచూకీ లేని యూరప్ మార్స్ ల్యాండర్
పారిస్: అంగారక గ్రహంపైకి యూరప్ పంపిన మార్స్ ల్యాండర్ మిస్సయ్యింది. మార్స్ ల్యాండర్ షాపరెల్లి బుధవారం అంగారకునిపై దిగాల్సి ఉంది. కానీ ఆ గ్రహంపైకి దిగే కొన్ని క్షణాల ముందు మార్స్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. దీనిపై యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నట్లు పేర్కొంది.
ప్యారాచూట్ ముందుగానే తొలగిపోవడం వల్ల ల్యాండర్ పడిపోయి ఉండొచ్చని గ్రౌండ్ కంట్రోలర్లు చెప్పారు. దీని వల్ల ల్యాండర్ స్విచ్ ఆఫ్ అయ్యి సంకేతాలు నిలిచిపోయి ఉండొచ్చన్నారు. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంకా నిర్ధారించలేదు. షాపరెల్లి ల్యాండింగ్‌కి సంబంధించి తమ వద్ద కచ్చితమైన సమాచారం లేదని వెల్లడించింది. ఒకవేళ దీని ఆచూకీని గుర్తించలేకపోతే స్పేస్ ఏజెన్సీ వరసగా రెండోసారి విఫలమైనట్లవుతుంది.