masaipet school bus accident
-
ఆ విషాదానికి ఆరేళ్లు; మా కోరిక అదొక్కటే!
తల్లిదండ్రులకు టాటా చెప్పి, అమ్మమ్మలకు బాయ్ చెప్పి పాఠశాల బస్సెక్కి బయల్దేరిన ఆ పసివాళ్లు తరలిరాని లోకాలకు వెళ్లారు. తమను తీసుకెళ్తున్న ఆ వాహనమే మృత్యు శకటమవుతుందని, అందరినీ విడిచి అనంత లోకాలకు వెళ్తున్నామని తెలియని ఆ పసిమనసులు తోటి మిత్రులతో ముచ్చటిస్తున్నారు. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో కాపలా లేని రైల్వే క్రాసింగ్ దాటుతున్న వారి బస్సును అటువైపుగా వస్తున్న రైలు ఢీకొట్టడం, 16 మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. సరిగ్గా ఇదే రోజు (జులై 24), ఆరేళ్ల క్రితం మాసాయిపేట వద్ద జరిగిన ఈ ఘటన నాలుగు గ్రామాల్లోని పద్దెనిమిది కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఈ దుర్దినాన్ని తలచుకుని కన్నీంటిపర్యంతమవుతున్నారు. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాసాయిపేట బస్సు ప్రమాదంపై సాక్షి ప్రత్యేక కథనం. సాక్షి, మెదక్: మాసాయిపేట బస్సు ప్రమాదానికి నేటికి ఆరేళ్లు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే గేట్ వద్ద ఆరేళ్ల క్రితం ఇదే రోజు పాఠశాలకు బయల్దేరిన చిన్నారులను బస్సు ప్రమాదం బలితీసుకుంది. మాసాయిపేట కాపలా లేని రైల్వే గేటు వద్ద 34 మంది విద్యార్థులతో వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సు అకస్మాత్తుగా రైలు పట్టాలపై ఆగిపోయింది. అంతలోనే నిజామాబాద్ నుంచి అతి వేగంగా వచ్చిన నాందేడ్ రైలు ఢీకొని బస్సులో ఉన్న విద్యార్థుల్లో 13 మంది చిన్నారులు అక్కడే మృతి చెందగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మరో 18 మంది చిన్నారులు ప్రభుత్వ చొరవతో కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం పొంది ప్రాణాలతో బయటపడ్డారు. (చదవండి: చైనాలో బస్సు ప్రమాదం..21 మంది మృతి) కానీ ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారుల్లో కొందరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. జ్ఞాపక శక్తి మందగించి కొందరు, కాళ్లు చేతులు వణకడం సమస్యలతో మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఇక చదువుకునేందుకు వెళ్లిన తమ బిడ్డలు అకాల మృత్యువాత పడటంతో వారి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వాలు ఎంత పరిహారం ఇచ్చినా తమ పేగు బంధం తెగిపోయిందని, ఇది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని చెప్తున్నారు. తమలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని కోరుకుంటున్నారు. దేశంలో ఎక్కడ కాపలా లేని రైల్వే గేట్లు ఉండరాదని కోరుకుంటున్నారు. (చిన్న సాయం చేయండి.. తేజ్‌దీప్‌ను కాపాడండి) -
మృత్యుంజయుడు వరుణ్
హైదరాబాద్: మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి వరుణ్‌గౌడ్(7) పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు గురువారం డిశ్చార్జి చేశారు. ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరిన 18 మంది విద్యార్థులు పూర్తిగా కోలుకోగా గతంలోనే వైద్యులు వారిని ఇంటికి పంపారు. గురువారం ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య చికిత్స వివరాలను వెల్లడించారు. దుర్ఘటనలో మృత్యువు అంచులదాకా వెళ్లి వరుణ్‌గౌడ్ బతికి బయటపడ్డాడు. ప్రమాదంలో తల, ఛాతి, ఎడమ ఊపిరి తిత్తి కింది భాగంలోనూ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోలుకోవడం చాలా కష్టమని వైద్యులు కూడా భావించారు. నాటి నుంచి 30 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉన్నాడు. వైద్యులు తల, ఊపిరితిత్తులకు శస్త్ర చికిత్సలు చేశారు. కాలుకు గాయం కావడంతో అక్కడా శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం వరుణ్‌గౌడ్ మాట్లాడుతున్నా ఇంటి పరిసరాలకు వెళితే అక్కడి వాతావరణానికి పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. ఒక బిడ్డను కోల్పోయి.. మరుణ్ తల్లిదండ్రులు మల్లాగౌడ్, లతలకు ముగ్గరు సంతానం. వీరిలో రుచితగౌడ్, వరుణ్‌గౌడ్, శృతి ఉన్నారు. ఒకే స్కూల్లో చదువుతున్న వీరిలో ప్రమాదం జరిగిన చోటే శృతి ప్రాణాలు కోల్పోగా.. రుచిత గౌడ్ కొద్ది రోజుల్లోనే కోలుకుంది. ఒక బిడ్డను కోల్పోయి ఇద్దరు బిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే కన్నవారు తల్లడిల్లి పోయారు. ఎట్టకేలకు పూర్తి ఆరోగ్యంతో వరుణ్ బయటపడటంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. వైద్యులు, ప్రభుత్వం కృషితోనే.. గతంలో డిశ్చార్జ్ అయిన సాయిరాం, రుచిత, నబీరా ఫాతిమా, కరుణాకర్, అభినందు, త్రిశ, శ్రావణిలు గురువారం పరీక్షలకు ఆస్పత్రి వచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ వైద్యులు అందించిన సేవలు మరువలేనివన్నారు. అలాగే ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరించిందని, తమ బిడ్డలు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, డాక్టర్లు మురళీ మోహన్‌రెడ్డి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ బీజే రాజేష్ తదితరులు పాల్గొన్నారు.