తేనెటీగల దాడిలో ఒకరు మృతి
చింతకొమ్మదిన్నె(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గవంక సమీపంలో శివాలయంవద్ద తేనెటీగలు దాడిచేయడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. చింతకొమ్మదిన్నె మండలం బలిజేపల్లికి చెందిన 18మంది బృందం దైవదర్శనార్థం శివాలయానికి వెళ్లారు. అక్కడ మంగళవారం ఉదయం తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేయడంతో గంగిరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మిగిలిన వారు పరుగుతీసి ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం తెలుసుకున్న చింతకొమ్మదిన్నె పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. గంగిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.